Let's talk: editor@tmv.in
పెషావర్‌లో ఆత్మాహుతి దాడి

పెషావర్‌లో ఆత్మాహుతి దాడి

Pinjari Chand
25 నవంబర్, 2025

పాకిస్థాన్‌ కైబర్‌ పఖ్తున్‌ఖ్వా రాజధాని పెషావర్‌లో సోమవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. నగరంలో ఉన్న పారామిలిటరీ దళం ప్రధాన కార్యాలయంపై సోమవారం ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు దాడి చేయడంతో ముగ్గురు భద్రతా సిబ్బంది మరణించగా, 12 మంది గాయపడ్డారు. సైనికులు ఉదయం కవాతుకు సిద్ధమవుతుండగా, ఫెడరల్ కాన్స్టాబులరీ(ఎఫ్సీ) ప్రధాన కార్యాలయంలోకి చొరబడటానికి ప్రయత్నించిన ఆత్మాహుతి బాంబర్లు కూడా ఎదురు కాల్పుల్లో మరణించారని పెషావర్ క్యాపిటల్ సిటీ పోలీస్ ఆఫీసర్ మియాన్ సయీద్ అహ్మద్ విలేకరులకు తెలిపారు. మొదట ముగ్గురు ఉగ్రవాదులు ప్రధాన కార్యాలయంపై దాడి చేయడానికి ప్రయత్నించారు. ఒక ఉగ్రవాది ప్రధాన ద్వారం వద్ద తనను తాను పేల్చివేసుకున్నాడు. మరో ఇద్దరు ఆవరణలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. కానీ కార్యాలయ భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారని తెలిపారు.

బాధ్యత వహించిన తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్

నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)లోని జమాత్-ఉల్ అహ్రార్ వర్గం ఈ దాడికి బాధ్యత వహించింది. పాకిస్తాన్ తాలిబాన్ అని కూడా పిలువబడే టీటీపీ, 2007లో అనేక ఉగ్రవాద సంస్థలతో కలిసి ఒక పెద్ద గ్రూపుగా స్థాపించారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జుల్ఫికర్ హమీద్ మాట్లాడుతూ, ఎఫ్సీ ప్రధాన కార్యాలయం లోపల రెండు ఆత్మాహుతి పేలుళ్లు జరిగాయని, ఒకటి ప్రధాన ద్వారం వద్ద, మరొకటి ఆవరణలో ఉన్న మోటార్ సైకిల్ స్టాండ్ సమీపంలో జరిగిందని తెలిపారు. ప్రధాన ద్వారం వద్ద జరిగిన శక్తివంతమైన పేలుడు చుట్టుపక్కల నివాసాల్లో, వాణిజ్య ప్రాంతాలలో భయాందోళనలను రేకెత్తించింది. పేలుడు శబ్దం చాలా దూరం వరకు వినిపించింది. పారామిలటరీ దళం ప్రధాన కార్యాలయం సైనిక కంటోన్మెంట్‌కు దగ్గరగా, రద్దీగా ఉండే ప్రాంతంలో ఉంది. వీడియో ఫుటేజ్ ప్రకారం ఆత్మాహుతి బాంబర్లలో ఒకరు ఎఫ్సీ ప్రధాన కార్యాలయం ప్రధాన ద్వారం వద్దకు కాలినడకన చేరుకున్నారు. శాలువా ధరించిన వ్యక్తి అక్కడ ఉన్న భద్రతా తనిఖీ కేంద్రం వద్ద తనను తాను పేల్చుకున్నాడు. పేలుడు కారణంగా ముగ్గురు కార్యాలయ సిబ్బంది అక్కడికక్కడే మరణించారని ప్రాథమిక పరిశోధనలో తేలింది. పేలుడు జరిగిన వెంటనే, మరో ఇద్దరు ఉగ్రవాదులు పక్క గేటు ద్వారా ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించారు. ఇద్దరితో రైఫిల్స్, హ్యాండ్ గ్రెనేడ్లు, ఆయుధాలు ఉన్నాయి. దాడి చేసిన వ్యక్తులు లోపలికి వెళ్లిన తర్వాత, కుడి వైపున ఉన్న మోటార్ సైకిల్ స్టాండ్ వైపు కాల్పులు జరిపారని, ఆ తర్వాత జరిగిన కాల్పుల్లో వారు మరణించారని వెల్లడిస్తున్నాయి. పోలీసుల కథనం ప్రకారం, దాడి చేసిన వారు ప్రధాన కార్యాలయంలో ఉన్న సీనియర్ అధికారులను, పెద్ద సంఖ్యలో సిబ్బంది ఉండటంతో వారిని బందీలుగా చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు.

దాడిని ఖండించిన ప్రధాని

ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. భద్రతా దళాలు సకాలంలో తీసుకున్న చర్య మనల్ని పెద్ద ప్రమాదం నుంచి రక్షించిందన్నారు. పాకిస్తాన్‌పై జరిగే ఏవైనా ఉగ్రవాద కుట్రలను కూడా అణిచివేస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కూడా ఈ దాడిని ఖండిస్తూ బయటి శక్తుల మద్దతు ఉన్న ఫిత్నా-అల్-ఖవారిజ్ పాకిస్తాన్ ఐక్యతను, సంకల్పాన్ని బలహీనపరచలేవని నొక్కి చెప్పారు. పాకిస్తాన్ ప్రభుత్వం గత సంవత్సరం నిషేధించిన టీటీపీని ఫిట్నా అల్-ఖవారీజ్ గా ప్రకటించింది.

పెషావర్ దాడి తర్వాత ఇస్లామాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేశామని, నగరంలోని అన్ని ప్రవేశ ద్వారాల వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారని, సాధారణ ప్రయాణికులను కూడా తనిఖీ చేస్తున్నామని ఇస్లామాబాద్ పోలీసు ప్రతినిధి తెలిపారు. సకాలంలో చర్య తీసుకోవడం ద్వారా దాడిని భగ్నం చేశారని, ఎఫ్‌సి సైనికులకు మంత్రి మొహ్సిన్ నఖ్వీ నివాళులర్పించారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు,

మొదట ఫ్రాంటియర్ కాన్స్టాబులరీ అని పిలుచుకునే పౌర పారామిలిటరీ దళాన్ని ప్రభుత్వం జూలైలో ఫెడరల్ కాన్స్టాబులరీగా పేరు మార్చింది.