Let's talk: editor@tmv.in
పెళ్లి వెనకున్న నిగూఢార్థం సప్తపది

పెళ్లి వెనకున్న నిగూఢార్థం సప్తపది

FL - BHAVN
9 అక్టోబర్, 2025

ఏ కళ కూడా సృజించిన కళాకారుడి ఆత్మ ఇన్ప్లూయెన్స్ నుంచి తప్పుకోలేదు. సినిమా కళని కల్పిస్తున్న వాళ్ల ఆత్మాభివృద్ధి, నైతికౌన్నత్యం, కళా పరిణామం చిత్రాలలో, కథల్లో, మాటల్లో, చేష్టల్లో, సెట్టింగులలో వ్యక్తం కాకుండా ఎలా ఉంటుంది?

ఏడు రంగులు కలిస్తే ఇంద్రధనుస్సు. అన్ని వర్ణాలు అందులోవే. సప్తస్వరాల అమరికే సకల రాగాలకు మూలం. జీవితం ఇంద్రధనస్సులా వర్ణమయం కావాలన్నా, లేక సరాగాల అమరికతో రాగరంజితం కావాలన్నా ఏ మనిషితో మనం ఏడడుగులు నడుస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనసుకు నచ్చిన వ్యక్తితో సాగిన సప్తపది జీవితాన్ని వర్ణమయం చేస్తుంది. రాగరంజితం చేస్తుంది. హైందవ సంప్రదాయాన్ని, ఆచారాలను గౌరవిస్తూనే సనాతనమైన టైటిల్ తో ఒక గొప్ప విప్లవాత్మక సందేశాన్ని అందించిన అభ్యుదయ సినిమా సప్తపది.

విప్లవాత్మకం ఈ కథ

ఆ ఇంటికి మాత్రమే కాదు పూర్తి ఊరికి గౌరవనీయుడైన, సనాతనత్వానికి ప్రతీక వంటి పెద్దయన, ఒక సానాతన, సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పెళ్లైన తన మనవరాలిని ఆమె కోరుకున్న నిమ్నకులస్థుడికి ఆమె భర్తతో అంగీకారంతో అప్పగించడం ఈ సినిమా కథ. భారతీయ సమాజంలో అత్యంత బలంగా పాతుకొని పోయి ఉన్న వర్ణ వ్యవస్థను ప్రశ్నిస్తూనే, ఎంతో సున్నితమైన రీతిలో ఆచార సంప్రదాయల అసలు లక్ష్యాన్ని గురించి రమ్యంగా చెప్పారు ఈ సినిమా ద్వారా. కథ మాత్రమే కాదు కథనం సాగిన తీరు అడుగడుగునా ఆలోచన రేకెత్తిస్తుంది. కథలోని ఒక్కో పాత్ర ఔచిత్యం ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో మాటల్లో చెప్పడం చాలా కష్టం. ఎంతో సున్నితమైన విషయాన్ని విశ్వనాథ్ తనదైన తీరులో ఎవరూ అభ్యంతరపెట్టని రీతిలో వివరించడంలో చూపిన దర్శకత్వ ప్రతిభను పొగిడేందుకు భాష చాలదని అంటే అది అతిశయోక్తి కాదు.

పాత్రల ఔచిత్యం...

సనాతనత్వానికి ప్రతీకగా ఉండే యాజులు పాత్ర ఎంత గంభీరమైందో చెప్పేందుకు గాను ఆ పాత్ర పరిచయ సమయంలోనే అతడి రాక కోసం గుడిలో వేచి ఉన్న ఆలయధర్మకర్త, ఊరి పెద్ద మాటల్లోనే కాదు యాజులు ప్రతి అడుగులోనూ ప్రతిబింబిస్తుంది. యాజులు మనవడు గౌరీనాథుడు ఈ కథలో రెండో నాయకుడిగా చెప్పుకోవచ్చు. అతడు అమ్మవారి నైర్మల్యాన్ని తీస్తూ మొదటి సారి ప్రేక్షకులకు పరిచయం అవుడతాడు. ఆ సందర్భంలో ముందురోజు అమ్మవారికి అలంకరించిన పూమాలలను ఎంతో భక్తి శ్రద్ధలతో తీసి అంతే శ్రధ్దగా ఆలయం శుభ్రం చేసే అమ్మాయికి అందిస్తూ కనిపిస్తాడు. ఇక్కడ ఆయన తనకు అలంకరించిన దండను కూడా అంతే శ్రద్ధగా ఇతరులకు సమర్పించేందుకు వెనుకాడని తనాన్ని చిన్న చర్యద్వరా సూచకంగా చూపించారు.

ప్రతీ సన్నీవేశం చరితార్థం

ఈ సినిమాలో మాటలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రధానపాత్రధారి ఈ సినిమా నాయిక. కానీ ఆ పాత్రకు మాటలు చాలా తక్కువ. ఆమెది అభినయ ప్రధాన పాత్రగా చెప్పేకోవచ్చు. ఆమె వివాహం తర్వాత ఆమెను ప్రేమించిన హరిబాబు వచ్చి గజ్జెలతో ఆమెకు ఇక పనిలేదు కాబట్టి తనకు ఇచ్చెయ్యమని కోరుతాడు. తలుపుచాటుగా నిలబడి ఆ మాటలు విన్న ఆమె గజ్జెలు అతడి చేతికి అందించి తలుపులు మూసుకుంటుంది. ఆమె ఆ తలుపులతో పాటు అతడి తలపులను కూడా మూసెయ్యాలని అనుకుంటుందని చెప్పకుండానే ఆమె చేత చెప్పిస్తారు దర్శకుడు. తొలిరాత్రి ఆమె పాదాలకు చిన్నగాయం కావడంతో వచ్చిన రక్తం వల్ల తిరిగి ఆమె తలపుల్లో హరిబాబు మెదులుతాడు. అదే సందర్భంలో ఆమె భర్త గౌరీనాథుడు గదిలోకి వస్తాడు. ఆమె మనసు అలా పరాధీనంగా ఉండడం వల్ల ఆమెలో అతడికి తాను రోజు కొలుచుకునే దేవత కనిపిస్తుంది. పరాయి స్త్రీ అమ్మవారితో సమానం అని మనసావాచా నమ్మిన వాడు కావడం అందుకు కారణం. ప్రతి సన్నివేశం ఒక క్లాసిక్. ఇలా చర్చిస్తూ పోతే మొదటి షాట్ నుంచి చివరి షాట్ వరకు కూడా ఏ ఒక్క సన్నివేశాన్ని మనం నిర్లక్ష్యం చెయ్యలేము.

మాటల్లో పేలిన తూటాలు

ఆలయధర్మ కర్త, ఊరిపెద్ద, యాజులుకి సన్నిహితుడైన రాజుగారి పాత్రలో అల్లురామలింగయ్య ప్రతి మాట ఒక తూట. యాజులు, రాజుగారి మధ్య సాగే ప్రతి సంభాషణ సమాజానికి చేస్తున్న ఒక మార్గదర్శనం మాదిరిగా ఉంటుంది. ఈ మొత్తం సినిమాలో అత్యంత ఎక్కువ మాటలున్న పాత్ర రాజుగారిదే. అలా ఎక్కువ మాట్లాడినప్పటికీ అది ఎక్కడా మోనోలాగ్ లా అనిపించకపోవడం విశేషం. ప్రతి మాట ఎంతో ఆలోచింపజేసేదిగా ఉంటుంది. జంధ్యాల మాటలు ఈ సినిమాకు ఆయువు పట్టు. క్లైమాక్స్ లో యాజులు చెప్పిన మాటలు ఒక కనువిప్పులాంటి భావన కలిగిస్తుంది.

చండాలుడితో ఆది శంకరుల వారి మధ్య జరిగే సంవాదాన్ని గుర్తుచేసుకొనే సందర్భం చూస్తున్న ప్రతి ప్రేక్షకుడి మనసులో నిజంగా మానవతను రగిలింపజేస్తుంది. జరిగిన పెళ్లికి విలువ లేదా అని ఊరి జనం ప్రశ్నించినపుడు యాజులు చెప్పిన సమాధానం పెళ్లి ప్రాముఖ్యతను, అందులోని గూఢార్థాన్ని అర్థంచేసుకోవడానికి దోహదం చేస్తుంది. త్రికరణ శుద్ధిగా ఆచరించని పని వ్యర్థం పెళ్లైనా అది ఇంకేదైనా అని సర్ది చెప్పటం ద్వారా జనాన్ని ఒప్పించే సన్నివేశం సినిమా అయిపోతున్నా ప్రేక్షకులు కుర్చీలలోంచి లేవడం మరిచిపోయేలా చేస్తుంది.

‘‘పెళ్లంటే శోభనం ముందు జరిగే తంతు కాదు. అది స్త్రీ పురుషులిద్దరిని స్నేహితులుగా, సన్నిహితులుగా చేసే ఘట్టం. ఆ సఖ్యత లోపించిన జంట కలకాలం కలిసి బ్రతకలేరు, అందుకే వేరు చేస్తున్నాను. అటువంటి స్నేహం, సఖ్యత కలిగిన వ్యక్తికి ఆమెను అప్పగిస్తున్నాను’’ వంటి డైలాగులు మనసును హత్తుకుంటాయి.

పుట్టుకను అనుసరించి కాదు, సంస్కారాన్ని బట్టి వర్ణాలు ఏర్పడ్డాయి. మనుషులందరిలో సాక్షాత్కరించే పరమాత్మ ఒక్కడే. మనుషులందరికీ ఇహపరాలు ఒక్కటే అని యాజులు చేత చెప్పించిన తీరు నభూతో నభవిష్యతి.

కొత్త వారే కానీ …

ఈ సినిమాలోని ప్రధాన తారగణం అంటే నాయికా, ఇద్దరు నాయకులు కూడా కొత్త కళాకారులు. ఇదివరకు కెమెరాను ఎరగని వారు. అటువంటి వారితో ఇంత గొప్ప అభినయ ప్రాధాన్యం కలిగిన సినిమా చేయడం మాత్రమే కాదు, ప్రేక్షకుల మెప్పు సాధించగలగడం విశ్వనాథ్ కు మాత్రమే చెల్లిన విద్య. అంతేకాదు ఈ సినిమా ఆ రోజుల్లో అవార్డుల పంట పండించింది. జాతీయ స్థాయిలో నేషనల్ ఇంటిగ్రేషన్ కెటగిరిలో ఉత్తమ చిత్రంగా నర్గీస్ దత్ అవార్డ్ గెలుచుకుంది. ఉత్తమ స్క్రీన్ ప్లే గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డ్ ను సొంతం చేసుకుంది. ఫిల్స్మ్ ఫేర్ అవార్డ్ కూడా ఈ చిత్రానికే వచ్చింది.

ఇక ఈ సినిమాలోని మాటలు ఒక ఎత్తైతే పాటలు మరో ఎత్తు. సంగీత సాహీత్యాల గురించి చెప్పుకోవడానికి తప్పకుండా ఒకసారి పూర్తి చర్చ జరపాల్సిన అవసరం ఉంది. అంత చక్కగా కుదిరాయి. మహదేవన్ బాణీలకు వేటూరి కలం, బాలసుబ్రమణ్యం, సుశీల, జానకిల గళం ఒక సుందర సంగమం. అద్భుత ఆవిష్కారం. ప్రతీ పాట సందర్భోచితం. ఒక్కోపాట గురించి ఒక్కో చిన్న చర్చయినా జరగకపోతే ఈ సినిమా సంగీతానికి అన్యాయం చేసినట్టే అవుతుంది.

బ్రహ్మణవాదాన్ని బలంగా వినిపిస్తారన్న అపవాదున్నదర్శకుడు విశ్వనాథ్. ఈ సినిమా తర్వాత బ్రాహ్మణులతో, బ్రాహ్మణ సంఘాలతోనూ, విమర్శలు ఎదరుర్కోని మాటలు పడవలసి వచ్చింది. అయినా తాను అనుకున్నది, నమ్మింది తాను తీశారు. దాన్ని ఇప్పటికీ జనం ఆదరిస్తూనే ఉన్నారు. తరాలు దాటినా ఆయన సినిమాలు క్లాసిక్ గా నిలిచిపోతాయని చెప్పడంలో ఎలాంటి అనుమానం వద్దు. ఇప్పుడు కూడా చూడాలని అనుకునే వారు యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది తప్పక చూడవచ్చు.

పెళ్లి వెనకున్న నిగూఢార్థం సప్తపది - Tholi Paluku