
పెళ్లి డబ్బు కోసం హైడ్రామా
ఉత్తరప్రదేశ్ పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఒక సంచలన కేసును ఛేదించారు. తన యజమానికి చెందిన రూ. 9.70 లక్షల నగదును దోచుకుపోయారంటూ ఒక డ్రైవర్ అల్లిన దోపిడీ నాటకాన్ని పోలీసులు సాంకేతిక ఆధారాలతో బట్టబయలు చేశారు. తన పెళ్లి ఖర్చుల కోసం డ్రైవర్ ఈ మొత్తం కుట్రకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. అడ్డదారిలో డబ్బు సంపాదించి పెళ్లి చేసుకోవాలనుకున్న అతడి ఆశలు అడియాశలయ్యాయి.
దోపిడి ఫిర్యాదులో అనుమానాస్పద అంశాలు
ఈ ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. మహారాజ్‌గంజ్‌లోని ఫరెండాకు చెందిన వ్యాపారి ఆదిత్య చౌదరి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న తున్ను ప్రజాపతి (ఖుషీనగర్ నివాసి) తన యజమాని డబ్బు దొంగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశాడు. ప్రజాపతి ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం బీఆర్‌డీ మెడికల్ కాలేజీ సమీపంలో క్లయింట్ నుంచి నగదు వసూలు చేసుకుని తిరిగి వస్తుండగా చివుతాహా గ్రామం వద్ద మోటార్‌సైకిళ్లపై వచ్చిన నలుగురు దుండగులు తన కారును అడ్డగించి కిటికీ పగలగొట్టి బలవంతంగా నగదు బ్యాగ్‌ను లాక్కెళ్లారని పోలీసులకు తెలిపాడు. అయితే స్థానిక చిలువ తాల్ పోలీసులు ప్రజాపతి ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసు నమోదు చేసి దొంగతనం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. కాగా ఘటన స్థలంలో దొంగతనానికి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు లభించలేదు. పైగా డ్రైవర్ ప్రజాపతి విచారణలో పొంతన లేని సమాధానాలు చెప్పడం మాటలు మార్చడం వంటివి చేయడంతో పోలీసుల అతనిపై అనుమానం మరింత బలపడింది.
సీసీటీవీ డేటాతో ప్లాన్ బహిర్గతం
కేసును సీరియస్‌గా తీసుకున్న దర్యాప్తు బృందం, సాంకేతిక ఆధారాలైన సీసీటీవీ ఫుటేజ్, సెల్ టవర్ డేటాపై దృష్టి పెట్టింది. దోపిడీ జరిగినట్లు డ్రైవర్ చెప్పిన సమయానికి ప్రజాపతి పూర్తిగా వేరే ప్రాంతంలో అంటే శివ్‌పూర్నగరంలోని సాహబ్‌గంజ్ ఏరియాలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు లభించిన ఆధారాలతో ప్రజాపతిని గట్టిగా నిలదీయగా వచ్చే ఏడాది మే నెలలో తన పెళ్లి ఉందని, అందుకే తన యజమానికి తెలియకుండా డబ్బును దొంగిలించేందుకు ఈ పథకం పన్నానని తాను చేసిన నేరాన్ని పోలీసుల ముందు అంగీకరించాడు.
సహచరుడికి నగదు, ఇద్దరి అరెస్టు
డ్రైవర్ తున్ను నగదు వసూలు చేసిన వెంటనే తన స్నేహితుడు, జిమ్ యజమాని అయిన జయనాథ్ సింగ్‌కు ఆ బ్యాగ్‌ను అప్పగించి, ఆ తర్వాతే దోపిడీ నాటకం అల్లినట్లు పోలీసులు భాగంగా బయట పడింది. మరోవైపు ఎస్పీ (నార్త్) జితేంద్ర కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ సాంకేతిక ఆధారాలు ఈ కుట్రను వెంటనే బహిర్గతం చేయగలిగాయి. కుట్రకు పాల్పడిన డ్రైవర్‌తో పాటు అతని సహచరుడు జయనాథ్ సింగ్‌ను అరెస్టు చేసి దొంగిలించబడిన రూ. 9.70 లక్షల నగదు మొత్తాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నాం. అంతేకాక వారిద్దరిపై దొంగతనం, తప్పుడు ఫిర్యాదు చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం అని స్పష్టం చేశారు.
