Let's talk: editor@tmv.in
పెళ్లి క్యాన్సిల్.. అధికారికంగా ప్రకటించిన స్మృతి, పలాష్

పెళ్లి క్యాన్సిల్.. అధికారికంగా ప్రకటించిన స్మృతి, పలాష్

Shaik Mohammad Shaffee
8 డిసెంబర్, 2025

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ తమ బంధానికి ముగింపు పలికారు. ఇద్దరూ విడిపోతున్నట్లుగా ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఈ విషయంలో ఊహాగానాలను ఆపాలని, తమకు కొంత ప్రైవసీ (ఏకాంతం) ఇవ్వాలని వారు అభిమానులను, మీడియాను కోరారు.

వివాహం రద్దైంది: మంధాన

గత నెల రోజులుగా తమ వ్యక్తిగత జీవితం గురించి తీవ్రమైన ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో స్మృతి మంధాన సోషల్ మీడియాలో బహిరంగ ప్రకటనను విడుదల చేశారు. "నా పెళ్లి రద్దైందని స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు. తాను చాలా వ్యక్తిగత విషయాలను దాచుకునే వ్యక్తిని అని పేర్కొంటూ, ఈ సమయంలో రెండు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని, ఈ పరిస్థితుల నుండి బయటపడటానికి వారికి కొంత సమయం ఇవ్వాలని ఆమె కోరారు.

తన దృష్టి ప్రస్తుతం పూర్తిగా క్రికెట్‌పైనే ఉందని మంధాన స్పష్టం చేశారు. "నాకు ఎప్పుడూ దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడమే ముఖ్యం. వీలైనంత కాలం భారతదేశం కోసం ఆడి, ట్రోఫీలు గెలవాలని ఆశిస్తున్నాను. నా దృష్టి ఎల్లప్పుడూ దానిపైనే ఉంటుంది" అని చెప్పారు. మంధాన‍‍ ముచ్ఛల్‌ వివాహం వాస్తవానికి నవంబర్ 23న జరగాల్సి ఉండగా, మంధాన తండ్రి శ్రీనివాస్ గుండె సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో వాయిదా పడింది.

ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా: పలాష్

స్మృతి మంధాన ప్రకటన విడుదలైన వెంటనే, పలాష్ ముచ్చల్ కూడా తన ప్రకటనను విడుదల చేశారు. "నేను నా జీవితంలో ముందుకు సాగాలని, మా వ్యక్తిగత బంధం నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాను" అని ఆయన అన్నారు. తనకు ఎంతో పవిత్రమైన బంధంపై ఆధారం లేని వదంతులకు ప్రజలు సులభంగా స్పందించడం తనకు చాలా కష్టంగా అనిపించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "ఇది నా జీవితంలో అత్యంత కష్టమైన దశ, నేను నా నమ్మకాలను వదలకుండా గౌరవంగా దీన్ని ఎదుర్కొంటాను" అని తెలిపారు. తప్పుడు, పరువు నష్టం కలిగించే సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై తన బృందం కఠినమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని పలాష్ ముచ్చల్ హెచ్చరించారు. పలాష్ సోదరి, గాయని పలక్ ముచ్ఛల్ కూడా ఈ అంశంపై మాట్లాడుతూ, రెండు కుటుంబాలు చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నాయని, సానుకూలతను నమ్ముతూ బలంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ ప్రకటనలతో ఇద్దరు ప్రముఖులు తమ వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ఊహాగానాలకు ముగింపు పలికారు.

గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ నవంబర్ 23న సాంగ్లిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే నవంబర్ 21న హల్దీ, నవంబర్ 22న మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో స్మృతి సహచర మహిళా క్రికెటర్లు షెఫాలీ వర్మ, రిచా ఘోష్, శ్రేయంకా పాటిల్, జెమీమా వంటి వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. నవంబర్ 23న వివాహానికి అన్ని సన్నాహాలు పూర్తి కాగా, వీఐపీలు, క్రీడాకారిణులు వేదికకు తరలివచ్చారు.

అయితే దురదృష్టవశాత్తు నవంబర్ 23న ఉదయం స్మృతి తండ్రి శ్రీనివాస్ గుండె సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అదే రోజు సాయంత్రం స్మృతి కూడా అస్వస్థతకు గురయ్యారు, పలాష్ సైతం ఆసుపత్రిలో చేరారు. ఈ అనారోగ్య కారణాల వలన ఆ రోజు జరగాల్సిన వివాహాన్ని వాయిదా వేయక తప్పలేదు. ఆ సమయంలోనే పెళ్లి రద్దు అయినట్లుగా వార్తలు వచ్చినా, ఇప్పుడు తాజాగా ఇద్దరూ కలిసి తమ వివాహ బంధాన్ని రద్దు చేసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా వాయిదా పడిన పెళ్లిని ఎందుకు పూర్తిగా రద్దు చేసుకున్నారనే దానిపై వారు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.