Let's talk: editor@tmv.in
పెళ్లి ఆగిపోయిందన్న కోపంతో యువతికి హెచ్‌ఐవీ ఇంజక్షన్

పెళ్లి ఆగిపోయిందన్న కోపంతో యువతికి హెచ్‌ఐవీ ఇంజక్షన్

Panthagani Anusha
15 మార్చి, 2026

పెళ్లి నిశ్చయమై ఆగిపోయిందన్న కోపంతో ఒక యువకుడు అత్యంత అమానుషానికి ఒడిగట్టాడు. తనతో పెళ్లి వద్దన్న యువతి జీవితాన్ని అంధకారం చేయాలనే క్రూర ఆలోచనతో ఆమె శరీరంలోకి బలవంతంగా హెచ్‌ఐవీ సోకిన రక్తాన్ని ఇంజెక్ట్ చేశాడు. సభ్య సమాజం తలదించుకునేలా హైదరాబాద్‌లోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం నిందితుడు (24) బాధితురాలు (22) దగ్గరి బంధువులు. వీరిద్దరికీ వివాహం చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు ప్రాథమికంగా నిర్ణయించుకున్నారు. అయితే నిందితుడి తల్లిదండ్రులు ఇప్పటికే హెచ్‌ఐవీ బాధితులు కావడంతో యువతి తండ్రి అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా యువకుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా అతనికి కూడా హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలింది. దీంతో యువతి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆమె తండ్రి ఈ సంబంధాన్ని రద్దు చేసుకున్నారు.

కాగా తనకు వ్యాధి ఉందన్న కారణంతో పెళ్లి సంబంధం చెడిపోవడాన్ని నిందితుడు అవమానంగా భావించాడు. ఆ యువతిని తనతో పెళ్లి చేసుకోనివ్వకుండా చేసిన వారందరిపై కక్ష పెంచుకున్నాడు. తాను అనుభవిస్తున్న వేదనను ఆమె కూడా అనుభవించాలని అప్పుడే ఆమె తనతోనే ఉంటుందని వికృత ఆలోచన చేశాడు. ఈ క్రమంలోనే పక్కా పథకం ప్రకారం హెచ్‌ఐవీ సోకిన రక్తాన్ని సేకరించి మార్చి 11న బాధితురాలి ఇంటికి వెళ్లాడు.

అక్కడ ఎవరూ లేని సమయం చూసి ఆమెపై దాడి చేసి నిందితుడు తన వద్ద ఉన్న సిరంజితో హెచ్‌ఐవీ రక్తాన్ని ఆమె శరీరంలోకి ఇంజెక్ట్ చేశాడు. బాధితురాలు ప్రతిఘటించినప్పటికీ వదలకుండా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోచారం ఐటీ కారిడార్ పోలీసులు, నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.