
పెరూ మాజీ అధ్యక్షుడు మార్టిన్ విజ్కారా 14 ఏళ్ల జైలు శిక్ష
పెరూ దేశ మాజీ అధ్యక్షుడు మార్టిన్ విజ్కార్రాకు అక్కడి కోర్టు షాకిచ్చింది. అవినీతి కేసులో ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం, ఆయన వెంటనే జైలు శిక్ష అనుభవించడం ప్రారంభించాలని కోర్టు ఆదేశించింది. 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు, రాజకీయాల్లోకి రాకుండా 9 ఏళ్ల పాటు నిషేధం కూడా విధించింది.
లంచం తీసుకున్నట్లు నేరం రుజువు
విజ్కార్రా 2011 నుండి 2014 వరకు పెరూలోని మోకెగువా అనే దక్షిణ ప్రాంతానికి గవర్నర్‌గా పనిచేశారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున జరిగిన ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు ముఖ్యంగా నీటిపారుదల వ్యవస్థ, ఆసుపత్రి నిర్మాణం వంటి ప్రాజెక్టులు అప్పగించడానికి నిర్మాణ సంస్థల నుండి ఆయన లంచాలు తీసుకున్నట్లు కోర్టు నిర్ధారించింది. ఆయన సుమారుగా 6 లక్షల డాలర్ల నుండి 6.76 లక్షల డాలర్ల వరకు లంచం తీసుకున్నట్లు తేలింది.
కోర్టు తీర్పుపై విజ్కార్రా తీవ్రంగా స్పందించారు. ఇది న్యాయం కాదు, ప్రతీకారం అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. "వారు నన్ను అణచివేయలేరు" అని ఆయన గట్టిగా చెప్పారు. తనపై వచ్చిన అభియోగాలు రాజకీయ ప్రేరేపితమైనవని మొదటి నుంచీ వాదిస్తున్న ఆయన, ఈ తీర్పును అప్పీల్ చేయనున్నట్లు ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు.
విజ్కార్రా జైలు శిక్ష పడటం పెరూ రాజకీయాల్లో కొత్తేమీ కాదు. 2018 నుండి ఆ దేశంలో ఇప్పటివరకు ఆరుగురు అధ్యక్షులు మారారు. అవినీతి, ఇతర కుంభకోణాల కారణంగా కొంతమంది రాజీనామా చేయగా, మరికొంతమందిని అభిశంసన ద్వారా తొలగించారు. విజ్కార్రా కూడా తన ముందు అధ్యక్షుడు పెడ్రో పాబ్లో కుచిన్‌స్కీ అవినీతి ఆరోపణలు, అభిశంసనల కారణంగా రాజీనామా చేయడంతో 2018లో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. విజ్కార్రాతో కలిపి, ప్రస్తుతం పెరూలో నలుగురు మాజీ అధ్యక్షులు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితి దేశ రాజకీయ వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన అస్థిరత, అవినీతిని సూచిస్తోందని నిపుణులు అంటున్నారు. విజ్కార్రా సోదరుడు మారియో విజ్కార్రా 2026లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ పోరాటాన్ని తన సోదరుడు కొనసాగిస్తారని, దీనికి ప్రజలే ఓటు హక్కు ద్వారా సమాధానం చెబుతారని విజ్కార్రా ధీమా వ్యక్తం చేశారు.
