Let's talk: editor@tmv.in
పెరూలో భారీ వర్షాల బీభత్సం: 283 జిల్లాల్లో అత్యవసర పరిస్థితి విధింపు

పెరూలో భారీ వర్షాల బీభత్సం: 283 జిల్లాల్లో అత్యవసర పరిస్థితి విధింపు

Shaik Mohammad Shaffee
14 మార్చి, 2026

లాటిన్ అమెరికా దేశమైన పెరూను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వరదల ఉధృతికి భారీగా ఆస్తి నష్టం సంభవించడమే కాకుండా, ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం దేశవ్యాప్తంగా 283 జిల్లాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

60 రోజుల పాటు కఠిన నిబంధనలు

ప్రస్తుతం నెలకొన్న ప్రకృతి విపత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ అత్యవసర పరిస్థితిని 60 రోజుల పాటు అమలు చేయనుంది. రాజధాని లిమాతో పాటు అమెజోనాస్, అంక్యాష్, కుస్కో, అరేక్విపా సహా మొత్తం 20 ప్రాంతాల్లో ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఈ సమయంలో స్థానిక, ప్రాంతీయ ప్రభుత్వాలు, జాతీయ పౌర రక్షణ సంస్థ, వివిధ మంత్రిత్వ శాఖలతో కలిసి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బాధితులకు తక్షణ ఉపశమనం కల్పించడం, దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరావాస పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడమే లక్ష్యంగా యంత్రాంగం కదులుతోంది.

రంగంలోకి సైన్యం.. మంత్రుల పర్యవేక్షణ

సహాయక చర్యల్లో ఎటువంటి జాప్యం జరగకుండా ఉండేందుకు పెరూ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వివిధ మంత్రిత్వ శాఖల మంత్రులు స్వయంగా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. పునరావాస పనులు, ఇతర రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి పెరూ సాయుధ దళాలు రంగంలోకి దిగాయి. జాతీయ పోలీసులతో కలిసి సైన్యంలోని ప్రత్యేక విభాగాల సిబ్బంది సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. రహదారుల పునరుద్ధరణ, బాధితులకు నిత్యావసరాల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించారు.

కారణం 'ఎల్ నినో' ప్రభావమే!

పెరూలో ఈ స్థాయిలో భారీ వర్షాలు కురవడానికి 'ఎల్ నినో' ప్రభావమే ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ దృగ్విషయం వల్ల సముద్ర తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగి, వాతావరణంలో తేమ శాతం అధికమవుతుంది. దీని ప్రభావంతో సీజన్లలో అసాధారణ రీతిలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతం పెరూ ఎదుర్కొంటున్న విపత్తుకు ఈ ఎల్ నినో ప్రభావమే కారణమని అధికారులు ధ్రువీకరించారు. పరిస్థితులు చక్కబడే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.