Let's talk: editor@tmv.in
పెరూలో జెన్ జెడ్ నిర‌స‌న‌ల హోరు!

పెరూలో జెన్ జెడ్ నిర‌స‌న‌ల హోరు!

Venkatesh Balusula
29 సెప్టెంబర్, 2025

పెరూలో ఇటీవ‌ల ప్ర‌భుత్వం పెన్ష‌న్ వ్య‌వ‌స్థ‌లో కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన సంస్క‌ర‌ణ‌ల‌పై ఆ దేశ జెన్ జెడ్ యువత భ‌గ్గుమంది. అధ్య‌క్షుడు డీనా బోలువార్టే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల‌పై నిర‌స‌న‌లు చేపట్టింది. రాజధాని లిమాలో గత వారం జరిగిన ప్రదర్శనల్లో పోలీసులతో ఘర్షణలు జరిగి, పోలీసులు, నిర‌స‌న‌కారులు మొత్తం 19 మంది గాయాల‌పాల‌య్యారు. తాజాగా మ‌రోసారి జెన్ జెడ్ నిర‌స‌న‌లు జ‌రుగుతుండ‌టంతో ఆందోళ‌న నెల‌కొంది. పెన్ష‌న్ వ్య‌వ‌స్థ‌లో సంస్క‌ర‌ణ‌ల‌తో పాటు ప్ర‌భుత్వ అవినీతిపై యువ‌త అస‌హ‌నం ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు దారితీసింది.

ఇటీవ‌ల‌ సెప్టెంబర్ 20న పెరూ ప్రభుత్వం పెన్షన్ వ్యవస్థలో కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణల ప్రకారం 18 ఏళ్లు పైబడిన ప్రతి పెరూ పౌరుడు తప్పనిసరిగా ఒక పెన్షన్ సంస్థ లేదా ప్రైవేట్ ఫండ్‌లో చేరాలని నిబంధన విధించారు. ఇందులో ప్రతి వ్యక్తి తమ ఆదాయంలో కొంత భాగాన్ని పెన్షన్ ఖాతాలో జమ చేయాలి. ఇది వారి పదవీ విరమణ కోసం ఉపయోగపడుతుంది. ఇది క‌చ్చితంగా ప్ర‌తి పౌరుడు చేసి తీరాలి. లేదంటే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంది. పెన్షన్ సంస్కరణలకు ముందు ఎలాంటి నిబంధ‌న‌లు లేకుండా పూర్తి ఐచ్ఛికంగా ఉండేది. ఈ మార్పులు ప్రవేశపెట్టిన తర్వాత ఆందోళ‌న‌లు ప్రారంభమయ్యాయి. మిలియన్ల మంది పెరూవియన్లు దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బోలువార్టే ప్ర‌భుత్వ అవినీతి కూడా యువ‌త‌ను మ‌రింత రెచ్చ‌గొట్టింది. పెరూవియన్ రాజకీయాలపై దశాబ్దాలుగా పరిశోధన చేసిన ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జో మేరీ బర్ట్ పెరూలో దీర్ఘకాలంగా అసంతృప్తి ఉంద‌న్నారు. అవినీతి కుంభకోణాలు, ఆర్థిక అస్థిరత, నేరాలు పెరగడం, 2022 చివరలో మాజీ అధ్య‌క్షుడు పెడ్రో కాస్టిలో అరెస్ట్ అయిన తర్వాత బోలువార్టే అధికారంలోకి వచ్చినప్పుడు భద్రతా సైన్యాలు చంపిన నిర‌స‌న‌కారుల‌పై జవాబుదారీతనం లేకపోవడం వంటి కారణాలున్నాయి. పెరూవియన్ స్టడీస్ ఇన్‌స్టిట్యూట్ జూలై రిపోర్ట్ ప్రకారం బోలువార్టేను కేవ‌లం 2.5 శాతం మంది మాత్ర‌మే అధ్య‌క్షుడిగా అంగీక‌రిస్తున్నారు. కాంగ్రెస్ 3 శాతం. రాజ‌ధాని లిమాలో నిర‌స‌న‌ల‌తో దేశంలోని మైనింగ్ పరిశ్రమ కూడా ప్రభావితమైంది. పెరూ ప్రపంచంలో మూడో అతిపెద్ద రాగి ఉత్పత్తి దేశంగా ఉంది. బంగారు, వెండి ఉత్ప‌త్తుల్లో సైతం పెరూ ముందు వ‌రుస‌లో ఉంది. ఈ నిర‌స‌న‌ల‌తో ప‌లు సంస్థ‌లు తమ సంస్థ‌ల‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్ర‌క‌టించారు.

రోజురోజుకూ తీవ్ర‌మ‌వుతున్న ఆందోళ‌న‌లు

పెరూ జెన్ జెండ్ నిర‌స‌న‌లు ఇండోనేషియా, నేపాల్‌లోని యువత ఆందోళ‌న‌ల‌ తర్వాతే వచ్చాయి. పెరూ జనాభాలో 18 సంవ‌త్స‌రాల నుంచి 29 సంవత్సరాల వారు 27 శాతం ఉన్నారు. పెరూ జెన్ జెడ్‌ ప్రదర్శనలు పెన్షన్ సంస్కరణలు, అవినీతి, ఆర్థిక సమస్యలపై యువత ఆగ్ర‌హాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి.జ‌పాన్‌కు చెందిన‌ "వన్ పీస్" స్ట్రా హ్యాట్ గుర్తు యువతలో అణచివేతకు వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని రేకెత్తిస్తోంది. ఈ ఉద్యమాలు నేపాల్, ఇండోనేషియా లాంటి దేశాల్లో యువత ఆందోళనలతో సమానంగా ఉన్నాయి, అక్కడ కూడా అవినీతి, ప్రజాస్వామ్య బలహీనతలపై యువత నిరసన వ్యక్తం చేసింది. పెరూలో ఈ ప్రదర్శనలు మైనింగ్ పరిశ్రమను తీవ్రంగా దెబ్బ‌తీశాయి. ఇది దేశినికి ఆర్థికంగా న‌ష్టం క‌లిగిస్తుంది. గతంలో పెరూ ఆందోళనలు ప్రభుత్వాలనే మార్చాయి, కాబట్టి ఈ ప్రదర్శనలు కొనసాగితే బోలువార్టే ప్రభుత్వంపై భారీ ప్రభావం చూపవచ్చు. ఈ ఉద్యమాన్ని ప్ర‌భుత్వం ఎలా ఎదుర్కొంటుంద‌న్న‌ది వేచి చూడాలి.

పెరూలో జెన్ జెడ్ నిర‌స‌న‌ల హోరు! - Tholi Paluku