Let's talk: editor@tmv.in
పెరవూర్‌లో హైటెన్షన్ పోరు

పెరవూర్‌లో హైటెన్షన్ పోరు

Pinjari Chand
6 ఏప్రిల్, 2026

పెరవూర్‌ నియోజకవర్గంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా మారనున్నాయి. మూడు సార్లు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన సన్నీ జోసెఫ్ తన స్థానం నిలబెట్టుకునేందుకు సిద్ధమవుతుండగా, సీపీఎం స్టార్ నేత కేకే.శైలజ ఆయనకు సవాల్ విసురుతున్నారు. దీంతో ఈ నియోజకవర్గం కేరళం ఎన్నికల్లో అత్యంత ఆసక్తికర పోటీల్లో ఒకటిగా మారింది. ‘సన్నీచాయన్’గా ప్రసిద్ధి చెందిన సన్నీ జోసెఫ్ న్యాయవాది కూడా. 2011 నుంచి పెరవూర్‌కు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన కేరళ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా, అలాగే యూడీఎఫ్‌ కన్నూర్ జిల్లా కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. స్థానిక స్థాయిలో బలమైన అనుబంధం, పార్టీ వ్యవస్థపై పట్టు ఆయనకు ధృడంగా నిలుస్తోంది.

కోవిడ్‌ సమయంలో శైలజ టీచర్‌‌ అద్భుత పనితీరు

మరోవైపు, శైలజ టీచర్‌గా పేరొందిన కేకే శైలజ సీపీఐ(ఎం ప్రముఖ నాయకురాలు. 2018లో జరిగిన నిఫా వైరస్‌ సమయంలోను, అలాగే కోవిడ్‌-19 మహమ్మారి ప్రారంభ సమయంలో ఆమె చూపిన నాయకత్వం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. 2016–21 మధ్య పినరయ్‌ విజయన్‌ తొలి ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. పెరవూర్‌తో శైలజకు ప్రత్యేక అనుబంధం ఉంది. 2006లో ఆమె ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె 60,963 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి కేరళ ఎన్నికల చరిత్రలోనే అతిపెద్ద మెజారిటీని నమోదు చేశారు.

1977 నుంచి ఎక్కువగా కాంగ్రెస్‌కే మద్దతు లభించింది. అయితే 2006 నుంచి 2011 మధ్య శైలజ టీచర్ ఇక్కడ విజయం సాధించారు.

2021 అసెంబ్లీ ఎన్నికల్లో సన్నీ జోసెఫ్ 66,706 ఓట్లు (47.1%) సాధించి కేవలం 3,172 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు. సీపీఎం అభ్యర్థి కేవీ.సక్కీర్‌‌ హుస్సేన్‌ 63,534 ఓట్లు (44.8%) పొందారు. బీజేపీ అభ్యర్థి స్మితా జయమోహన్‌ 9,155 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. మొత్తం పోలింగ్ శాతం 83.13గా నమోదైంది. 2016 ఎన్నికల్లో సన్నీ జోసెఫ్ 65,659 ఓట్లు (48.3%) సాధించి సీపీఎం అభ్యర్థి బినోయ్‌ కురియన్‌పై 7,989 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో పోలింగ్ శాతం 81.45గా నమోదైంది.

పోటీలో పలు పార్టీలు

పెరవూర్ కేరళం అసెంబ్లీలో 16వ నియోజకవర్గం. ఇది ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ కాని జనరల్‌ సీటు. రాజకీయంగా చురుకైన కన్నూర్‌‌ జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం కన్నూర్‌‌ లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ సాధారణంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌, సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ మధ్య ప్రధాన పోరు సాగుతూ వస్తోంది.

ఈసారి పోటీలో భారత్‌ ధర్మ జనసేన తరఫున కే.పైలీ వాత్‌యట్టు, ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున హెనిస్టియన్ జార్జ్‌ , స్వతంత్ర అభ్యర్థిగా కే.ఎస్‌ జయచంద్రన్‌ కూడా పోటీ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రధాన పోరు మాత్రం కాంగ్రెస్‌, సీపీఎం మధ్యనే ఉండనుంది. ఈ నేపథ్యంలో సన్నీ జోసెఫ్ తన గెలుపు పరంపర కొనసాగిస్తారా? లేక శైలజ టీచర్ ప్రవేశం ఎల్డీఎఫ్‌కు అనుకూలంగా మారుస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. 2026 శాసనసభ ఎన్నికలు కేరళంలో ఏప్రిల్‌ 9న ఒకే దశలో జరగనుండగా, ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ పదవీకాలం మే 23తో ముగియనుంది.

పెరవూర్‌లో హైటెన్షన్ పోరు - Tholi Paluku