Let's talk: editor@tmv.in
పెద్ద అంబర్‌పేట్ ఓఆర్ఆర్ వద్ద బస్సు బోల్తా

పెద్ద అంబర్‌పేట్ ఓఆర్ఆర్ వద్ద బస్సు బోల్తా

Panthagani Anusha
26 అక్టోబర్, 2025

కర్నూలు బస్సు ప్రమాదం మరవకముందే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. మియాపూర్‌ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న న్యూగో ఎలక్ట్రిక్ ట్రావెల్స్ బస్సు శనివారం తెల్లవారుజామున పెద్ద అంబర్‌పేట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ నుండి కిందకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి పైగా ప్రయాణికులు ఉండగా అందులో ఆరుగురికి గాయాలు కాగా క్షతగాత్రులను వారిని స్థానికులు, పోలీసులు వెంటనే డిఆర్డిఓ, అపోలో ఆస్పత్రులకు తరలించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సు అధిక వేగంతో ప్రయాణిస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఔటర్ రింగ్ రోడ్ నుంచి కిందకు బోల్తా పడినట్లు తెలుస్తోంది. బస్సు కింద పడిన సమయంలో గట్టిగా ఢీకొట్టడంతో కిటికీలు పగిలిపోయాయి సీట్లలో కూర్చున్న ప్రయాణికులు గాయపడ్డారు. అదృష్టవశాత్తూ, బస్సు పూర్తిగా తలకిందులుగా పడినా మంటలు చెలరేగలేదు. లేదంటే భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉండేదని అధికారులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంబర్‌పేట్ ట్రాఫిక్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని బయటకు తీసి అంబులెన్సుల ద్వారా ఆసుపత్రికి తరలించారు. కొందరికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలు మాత్రమే ఉన్నాయని వైద్యులు తెలిపారు.

ఇటీవలే కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ సంఘటనకు సంబంధించిన దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగానే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ వాహనాల భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ ప్రారంభమైంది.