
పెద్దలే ఇంటికి వెలుగు
ఓ బేబీ సినిమా మనకందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో సమంతా పోషించిన 'బేబీ' పాత్రకు ఒక్కసారిగా యవ్వనం వస్తుంది. అప్పుడు ఆమె, తన జీవితాన్ని మళ్లీ స్వేచ్ఛగా, సంతోషంగా గడుపుతుంది. అయితే, చివరికి ఆమె దేని కోసం పరిగెత్తింది? తను సంపాదించుకున్న గొప్ప అనుభవాలు, తన కుటుంబాన్ని, మనవడిపై తనకున్న మమకారమే తనకు ముఖ్యమని తెలుసుకుంటుంది. పెద్దల అనుభవం, వారి జ్ఞానం ఎంత గొప్పదో ఆ సినిమాలో చూపించారు. సినిమాల్లో ఇలాంటి మ్యాజిక్‌లు జరుగుతాయేమోగానీ, నిజ జీవితంలో మన పక్కనే ఉన్న పెద్దల కథలు, వారి అనుభవాలే అంతకుమించిన మ్యాజిక్!
నిజం చెప్పాలంటే... నేడు మనం దూరం చేసిన ఆ బంధాలు, ఒంటరిగా మిగిలిపోయిన ఆ చేతులే మన కోసం ఎదురుచూస్తున్నాయి. కనీసం ఒక్క ఫోన్ కాల్ కోసమైనా, ఆశగా చూసే వారి కళ్లల్లోని నిశ్శబ్దపు ఒంటరితనం మనసుల్ని కరిగించి, గుండెల్ని బరువెక్కిస్తుంది.
ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే... మన పెద్దల జీవితాలు నేడు వేగంగా తిరిగే ఈ ప్రపంచంలో ఒక మూలకు నెట్టివేయబడ్డాయి. వారి గదిలో ఉన్న నిశ్శబ్దపు గడియారం మాత్రమే వారి ఒంటరితనాన్ని లెక్కపెడుతుంది. పిల్లలు ఉద్యోగాల కోసం తలో దిక్కుకు వెళ్లడంతో, అపారమైన అనుభవాల పుట్ట అయిన ఆ వృద్ధులు, గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ఇది కేవలం వారి కళ్లలో నిండిన నీరే కాదు, మనమంతా పోగొట్టుకుంటున్న అమూల్యమైన బంధానికి ప్రతీక.
ఒకప్పుడు ఇంటికి వస్తే ఆ సందడే వేరు. ఆరుబయట అరుగులపైనో, పెరటి తోటలోనో పది, ఇరవై మంది ఆటపాటలతో గడిపేవారు. అమ్మానాన్న, తాత, బామ్మ, పెద్దనాన్న, చిన్నాన్న, అత్త, వదిన, తమ్ముడు, చెల్లి, పిన్ని.. ఇలా వరసలు, ఆ పిలుపులు ఆ ఇంటి అనురాగానికి, ఆత్మీయ బంధాలకు బలం. ఆ ఉమ్మడి కుటుంబాల వేళ్లు మన సంస్కృతిలో బలంగా పాతుకుపోయాయి. కానీ కాలం మారింది. నాగరికత వచ్చింది. బతుకుదెరువు కోసం తలో దిక్కుగా వేరుపడ్డ జనం.. నాటి బంధాలన్నీ విచ్ఛిన్నం చేసుకున్నారు. ఈ వేగవంతమైన ఆధునిక యుగంలో, మన పూర్వపు తరం.. అంటే మన పెద్దలు ఎక్కడ? ఏం చేస్తున్నారు? అనే ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చింది. అక్టోబర్ 1న నిర్వహించే అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా, మన కుటుంబ పెద్దల అనురాగాన్ని గుర్తు చేసుకుందాం. తరం మారినా స్వరం మారకూడదు అన్నట్టుగా, మన తర్వాత తరానికి వారిని దగ్గర చేసేందుకు ప్రయత్నిద్దాం!
తాతగారి మాట, బామ్మగారి పాట
మన సంస్కృతిలో పెద్దలకు గౌరవం ఇవ్వడం అనేది ఒక సంప్రదాయం మాత్రమే కాదు, మన జీవన విధానంలో భాగం. “తాత చెప్పిన మాట, బామ్మ చెప్పిన పాట” అన్నది సామెత మాత్రమే కాదు, ఎంతో విలువైన అనుభవాల సారాంశం.
నిన్నటి అనుభవాల పుట్టే ఈ పెద్దలు. వారు చెప్పే ప్రతి మాటలో ఎన్నో ఏళ్ల జీవిత సత్యం దాగి ఉంటుంది. వారు పంచే కథల్లో జ్ఞానం, నైతిక విలువలు ఉంటాయి. వారు నడిచి వచ్చిన దారులు కొత్త తరాలకు పాఠాలుగా మారతాయి. నేటి వేగవంతమైన ప్రపంచంలో, ఉద్యోగాలు, కెరీర్లంటూ పరుగులు తీస్తున్న తల్లిదండ్రులకు, తాత, బామ్మల స్థానం క్రమంగా పక్కకు వెళ్ళిపోతుందనేది నేడు మన కళ్లముందే కనిపిస్తున్న నిష్ఠుర వాస్తవం. అణువణువునా ఆధునికత ప్రవహిస్తున్న ఈ యుగంలో కుటుంబ సంబంధాలు శిథిలమవుతున్నాయి. ఒకప్పుడు ఆ ఇంటికే కేంద్ర బిందువైన వృద్ధులు, నేడు చాలా చోట్ల ఒంటరితనంతో కుమిలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం ఒక్క కుటుంబ సమస్య కాదు, సమాజం మొత్తం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు.
భవిష్యత్ తరానికి రక్షణ కవచం
తాతలు, బామ్మలు తమ మనవళ్లకు ఇచ్చే ప్రేమ అపారమైనది, అనన్యమైనది. తల్లిదండ్రులు ఆఫీసుల పనుల్లో బిజీగా ఉన్నప్పుడు, వీరే మనవళ్లను, మనవరాళ్లను లాలించి, పాలించి సంరక్షిస్తారు. ఆ మమకారమే పిల్లలకు మానసిక బలాన్ని, స్థైర్యాన్ని ఇస్తుంది.
అంతేకాదు, కథల రూపంలో వారు చెప్పే నీతులు, పంచుకునే అనుభవాలు పిల్లల్లో విలువలను, కష్టపడే గుణాన్ని పెంచుతాయి. మన చరిత్ర, సంస్కృతి, ఆచారాలు, మన కుటుంబ విలువలను వారు మాటలతో కాకుండా, తమ జీవన విధానంలో చూపించి నేర్పిస్తారు. మన పెద్దల సారధ్యం లేకుంటే, కొత్తతరం వేగంగా ఆధునిక పోకడల్లో వేరుపడిపోవడం ఖాయం. అందుకే, ఏ కుటుంబంలోనైనా కనీసం ఒక్కరైనా పెద్దవారు ఉంటే, ఆ కుటుంబంలోని పిల్లలందరికీ ఆ పెద్దలు భవిష్యత్తును తీర్చిదిద్దే గురువులుగా, చెడు నుంచి మళ్ళించే రక్షణ కవచమవుతారనడంలో ఏమాత్రం అతిశయోక్తిలేదు. వారు పంచిపెట్టే ప్రేమే, జీవితానికి కావాల్సిన చద్దిమూట అవుతుంది.
వయోధిక ఆశ్రమాలు కాదు కావాల్సింది
నేటి సమాజంలో వృద్ధాశ్రమాలు, అంటే వయోధిక ఆశ్రమాలు కనపడకపోతే, అదొక అద్భుతమైన సంఘటనగా చూసే పరిస్థితి ఏర్పడింది. మనల్ని కనీపెంచిన తల్లిదండ్రులను, మనకు సన్మార్గపు మాటలు, ఆటలు, పాటలు నేర్పిన తాత, బామ్మలను కుటుంబం నుంచి వేరు చేసి, ఇలాంటి అద్దె గృహాలకు తరలించడం ఇప్పుడు సర్వసాధారణమైంది.
ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, లండన్‌లోని నార్త్ హంబ్రియా యూనివర్సిటీ వంటి సంస్థలు కలిసి నిర్వహించిన ఒక సామాజిక, మానసిక ఆరోగ్య పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ అధ్యయనం ప్రకారం, తాత, బామ్మలతో గడిపే పిల్లలు ఇతరుల కంటే ఎంతో ధైర్యంగా ఉంటున్నారని తేలింది. ముఖ్యంగా, కుటుంబ సమస్యలు, ఒత్తిడి ఉన్నప్పుడు పిల్లలకు వచ్చే మానసిక ఆందోళన (అన్సియేటీ), కుంగుబాటు (డిప్రెషన్) వంటి లక్షణాలు వీరిలో చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. పెద్దల దగ్గర ఉండే భద్రతా భావం స్థిరత్వం కారణంగానే ఈ సానుకూల ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే, మనల్ని హాయిగా ఉంచాల్సిన ఆశ్రమాల మాట కొత్తేం కాకపోయినా, వాటిని త్యజించుకోవాలి, నివారించుకోవాలి అనే సానుకూల ఆలోచన ప్రతి కుటుంబంలో రావాలి. మన వానప్రస్థ జీవితం మనతోనే హాయిగా గడపాలనే ధ్యాసను మనందరం పెంచుకోవాలి. మన పిల్లలకు కూడా మన పెద్దల గొప్పతనం తెలిసేలా నిత్యం ప్రయత్నం చేయాలి.
ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు కూడా వృద్ధులకు కేవలం సదుపాయాలు కల్పించడం మాత్రమే కాకుండా, వారిని కుటుంబానికి, సమాజానికి అనుసంధానించే ప్రయత్నాలు చేయాలి. పాఠశాలల్లో ‘గ్రాండ్‌పేరెంట్స్ డే’ వంటి కార్యక్రమాలు జరిపించడం ద్వారా పిల్లలకు పెద్దల అనుభవాలను పంచుకోవడానికి అవకాశం లభిస్తుంది.
మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుందాం
మనమంతా కచ్ఛితంగా, మొహమాటంలేకుండా ఆత్మపరిశీలన చేసుకోవాలి. పెద్దల్ని చూసుకోవడం, వారిని సంతోషంగా ఉంచడం మన బాధ్యత మాత్రమే కాదు, మన కర్తవ్యమూ కూడా. నేటి యువత, పిల్లలు రేపటి పెద్దలు కావడం ఖాయం. కాబట్టి, పెద్దలకు గౌరవం ఇచ్చే సంస్కృతి కొనసాగితేనే, భావితరాలు కూడా అదే ప్రేమను, గౌరవాన్ని మనకు ఇస్తాయి. మన పెద్దల ఒడిలో పెరుగుతూ, వారి చల్లని మాటలను చద్దిమూట చేసుకుని ఉన్నతంగా ఎదిగేలా మన పిల్లలను పెంచుకుందాం.
