
పెదపారుపూడిలో అమానుషం: నాలుగేళ్ల బాలికపై బంధువు లైంగిక దాడి
కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలంలో సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. రక్షణగా ఉండాల్సిన సన్నిహిత బంధువే నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం కుటుంబ కలహాల కారణంగా బాధితురాలి తల్లి ఈ నెల 5వ తేదీన తన పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో తల్లి లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు ఫిబ్రవరి 7వ తేదీన బాలికకు స్నానం చేయించిన అనంతరం ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఫిబ్రవరి 14న తిరిగి వచ్చిన బాలిక తల్లికి ఈ విషయం తెలియడంతో ఆమె వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు తక్షణమే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. ఇక నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 65(2) తో పాటు పోక్సో చట్టం-2012లోని సెక్షన్ 4 కింద కేసు నమోదు చేశారు. మరోవైపు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన ఆధారాలను సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అదేవిదంగా నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నారు. ఇదిలా ఉండగా బాధితురాలు మైనర్ కావడంతో చట్ట నిబంధనల ప్రకారం ఆమె వివరాలను గోప్యంగా ఉంచుతూ కేసుపై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
