
పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు..నయారా నిర్ణయం
అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో గురువారం నయారా ఎనర్జీ పెట్రోల్ ధరను లీటరుకు రూ.5, డీజిల్‌ను రూ.3 మేర పెంచింది. మధ్యప్రాచ్య యుద్ధ ప్రభావంతో పెరిగిన ఇన్‌పుట్ ఖర్చులను వినియోగదారులపై కొంత మేర మోపినట్లు సమాచారం. భారతదేశంలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు నిలకడగా కొనసాగుతున్నప్పటికీ, ఫిబ్రవరి 28 నుంచి అంతర్జాతీయ చమురు ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి. ఈ పెరుగుదల అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు చేయడంతో ప్రారంభమైన పశ్చిమాసియా యుద్ధంతో మరింత వేగం అందుకుంది. దేశవ్యాప్తంగా 6,900కు పైగా పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్న నయారా ఎనర్జీ, పెరిగిన ఖర్చులను భరించడం కష్టమవడంతో ధరలు పెంచినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే, రాష్ట్రాల వారీగా వ్యాట్ (వీఏటీ) వంటి స్థానిక పన్నుల కారణంగా పెంపు ప్రభావం మారవచ్చు. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర పెరుగుదల రూ.5.30 వరకు ఉండొచ్చని సమాచారం.
ఇక జియో–బీపీ (రిలయన్స్ ఇండస్ట్రీస్–బీపీ పీఎల్సీ సంయుక్త సంస్థ) మాత్రం ఇప్పటివరకు ధరలు పెంచలేదు. భారీ నష్టాలు వచ్చినప్పటికీ ధరలను యథాతథంగా ఉంచినట్లు తెలుస్తోంది. దేశీయంగా మార్కెట్‌లో సుమారు 90 శాతం వాటా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థలు — ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం ఇప్పటికీ సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలను ఫ్రీజ్‌లో ఉంచుతున్నాయి. అయితే, ఇటీవల ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుకు రూ.2 పెంచడంతో పాటు, పరిశ్రమలకు సరఫరా చేసే బల్క్ డీజిల్ ధరను సుమారు రూ.22 పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో సాధారణ పెట్రోల్ ధర రూ.94.77గా, డీజిల్ ధర రూ.87.67గా కొనసాగుతున్నాయి. ప్రీమియం 95-ఆక్టేన్ పెట్రోల్ ధర రూ.99.89 నుంచి రూ.101.89కు పెరిగింది. బల్క్ డీజిల్ ధర రూ.87.67 నుంచి రూ.109.59కు చేరింది. అంతర్జాతీయంగా చమురు ధరలు ఈ నెల ప్రారంభంలో బ్యారెల్‌కు 119 డాలర్ల వరకు చేరి, ప్రస్తుతం సుమారు 100 డాలర్ల వద్ద ఉన్నాయి.
భారత్ తన ముడి చమురు అవసరాల్లో సుమారు 88 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి మార్గంగా సరఫరా అవుతోంది. అయితే ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తరువాత, ఇరాన్ హెచ్చరికలు, ఇన్సూరెన్స్ సమస్యల కారణంగా నౌకా రవాణా దాదాపు ఆగిపోయింది. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రభుత్వ నియంత్రణలో లేవని, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే స్వతంత్రంగా నిర్ణయిస్తాయని కేంద్రం స్పష్టం చేస్తోంది. గతంలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధ సమయంలో 2022లో చమురు ధరలు పెరిగినప్పటికీ, కంపెనీలు తక్కువ లాభాలు మాత్రమే నమోదు చేశాయి. అయితే 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ మూడు ప్రభుత్వ సంస్థలు కలిపి రూ.81,000 కోట్ల రికార్డు లాభాలు నమోదు చేశాయి. ఈ ఏడాది డిసెంబర్ త్రైమాసికంలోనే రూ.23,743 కోట్ల లాభాలు సాధించాయి.
