Let's talk: editor@tmv.in
పెట్రోల్, డీజిల్ కొరత లేదు: కేంద్రం

పెట్రోల్, డీజిల్ కొరత లేదు: కేంద్రం

Pinjari Chand
26 మార్చి, 2026

పశ్చిమ ఆసియా ఘర్షణల నేపథ్యంలో ఇంధన కొరతపై వస్తున్న వార్తలపై పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ సరిపడా నిల్వలున్నాయని, ఎలాంటి కొరత లేదని తెలిపింది. బుధవారం ఇంటర్-మినిస్టీరియల్ బ్రీఫింగ్‌లో సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ మాట్లాడుతూ దేశీయంగా పిప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) సరఫరాకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. వినియోగదారులకు 100 శాతం పీఎన్జీ, సీఎన్జీ సరఫరా జరుగుతోందని తెలిపారు.

పానిక్ బాయింగ్ వద్దు

ఇటీవల పెట్రోల్ బంకులు, రిటైల్ ఔట్‌లెట్ల వద్ద క్యూలు కనిపించడం గమనించామని, ప్రజలు అపోహలకు లోనై పానిక్ బాయింగ్ చేయొద్దని ఆమె సూచించారు. దేశంలో పెట్రోల్, డీజిల్ సరిపడా ఉంది. ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. దేశంలో రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, ఏటా 26 కోట్ల టన్నుల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం ఉందని తెలిపారు.

పీఎన్జీ విస్తరణకు చర్యలు

దేశవ్యాప్తంగా గ్యాస్ పైప్‌లైన్‌ల విస్తరణకు ప్రభుత్వం సమయపాలనతో కూడిన విధానాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ఢిల్లీలో రోడ్డు పునరుద్ధరణ చార్జీలు తొలగించడంతో పైప్‌లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. దీంతో 2.2 లక్షల మంది వినియోగదారులు ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారారని, మరో 2.5 లక్షల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు.

ఎల్పీజీపై స్పష్టత

ఎల్పీజీ బుకింగ్ సమయాల్లో మార్పులు చేశారనే వార్తలు పూర్తిగా అసత్యమని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న సమయాలు: పట్టణాల్లో: 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో: 45 రోజులు ఇవి యథావిధిగా కొనసాగుతున్నాయని పేర్కొంది. వలస కార్మికులకు 5 కిలోల గ్యాస్ సిలిండర్లను ప్రాధాన్యంగా అందిస్తున్నామని తెలిపారు. 26 రాష్ట్రాలకు 22,000 టన్నుల ఎల్పీజీ కేటాయించగా, ఒకే రోజు 30,000 చిన్న సిలిండర్లు పంపిణీ చేశారని చెప్పారు.

బ్లాక్ మార్కెటింగ్‌పై చర్యలు

గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు 2,700 దాడులు నిర్వహించి, 2,000 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిత్యావసరాల చట్టం–1955 కింద ప్రభుత్వం నేచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్–2026ను జారీ చేసింది. దీని ద్వారా గ్యాస్ మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం కానుంది. మొత్తం మీద, ఇంధన సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని, ప్రజలు అపోహలకు లోనవకుండా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది.

భారత నౌకలు, నావికులు సురక్షితం

పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల మధ్య, గత 24 గంటల్లో భారత నౌకలు లేదా నావికులకు సంబంధించిన ఎలాంటి ప్రమాద ఘటనలు నమోదు కాలేదని కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పోర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా సంయుక్త అంతర్గత మంత్రిత్వ సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్‌లో 20 భారత జెండా నౌకలు సుమారు 540 మంది భారత నావికులతో ప్రయాణిస్తున్నాయని, వారు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలు వారితో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నాయని చెప్పారు. గత 24 గంటల్లో సుమారు 200 టెలిఫోన్ కాల్స్, 500 ఇమెయిల్స్ అందాయని, వాటికి స్పందనలు ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో 50 మంది భారత నావికులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా పోర్టుల కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయని, ఎక్కడా రద్దీ సమస్యలు లేవని సిన్హా స్పష్టం చేశారు. ముఖ్య పోర్టులైన జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్, కాండ్లా, విశాఖపట్నం, చిదంబరనార్ పోర్టుల్లో తీసుకున్న చర్యలతో పాటు, చిన్న పోర్టుల్లో కూడా కొత్త చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా ముండ్రా పోర్ట్‌లో మధ్యప్రాచ్యానికి వెళ్లే ఎగుమతి కంటైనర్లకు ఉచిత నిల్వ గడువును 15 రోజులకు పెంచడంతో పాటు, రీఫర్ ప్లగ్-ఇన్ ఛార్జీలను 80 శాతం తగ్గించారు. అలాగే లిఫ్ట్-ఆన్, లిఫ్ట్-ఆఫ్, రవాణా ఛార్జీలను కూడా మాఫీ చేశారు. బ్యాక్-టు-టౌన్ కంటైనర్లకు కూడా 15 రోజుల ఉచిత నిల్వ సౌకర్యం కల్పించారు.

పెట్రోల్, డీజిల్ కొరత లేదు: కేంద్రం - Tholi Paluku