
పెట్టుబడుల పేరుతో మోసం…ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్ బట్టబయలు
అధిక లాభాల ఆశచూపి సామాన్యుల నుంచి పెట్టుబడులు సేకరించి ఆ సొమ్మును ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు మళ్లిస్తున్న కేటుగాళ్లను నెల్లూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు.కాగా కోట్ల రూపాయల లావాదేవీలతో సాగుతున్న ఈ దందాలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి ఖాతాల్లోని రూ.1.6 కోట్లను స్తంభింపజేశారు.
ఈ మేరకు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ అజిత వాజెండ్ల కేసు వివరాలను వెల్లడిస్తూ బుచ్చిరెడ్డిపాలెం రామకృష్ణ నగర్‌కు చెందిన కుశెట్టి వేణుగోపాల్ (23), బిత్ర వెంకట రమణ (31)లు ఒక ముఠాగా ఏర్పడి అమాయకులను లక్ష్యంగా చేసుకుని తొలుత వివిధ పథకాల్లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని బాధితులను నమ్మించి అలా వసూలు చేసిన సొమ్మును బాధితులకు తెలియకుండానే ‘రాధీ ఎక్స్ఛేంజ్’ (ఆర్777) అనే ఆన్‌లైన్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్‌లకు మళ్లించేవారు. ఈక్రమంలో నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ఒక వ్యక్తి వీరి మాయమాటలు నమ్మి సుమారు రూ.53 లక్షలు పోగొట్టుకోవడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఇక బాధితుడి ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నారు.
అయితే నిందితుల్లో వేణుగోపాల్ ప్రధాన నిర్వాహకుడిగా వ్యవహరిస్తుండగా వెంకట రమణ జూదగాళ్ల నుంచి నగదు వసూలు చేసేవాడని అంతేకాక బెట్టింగ్ నిధుల విషయంలో ఎవరైనా ఎదురుతిరిగినా లేదా వివాదాలు తలెత్తినా నిందితులు కత్తులతో బయపెట్టివారని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా వారి వద్ద నుంచి రెండు వేటకత్తులను మోసాలకు ఉపయోగించిన 13 మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, మానిటర్, టెలివిజన్‌ను సీజ్ చేశారు.
భారీగా నగదు స్వాధీనం
నిందితుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న సుమారు రూ.1.60 కోట్లను పోలీసులు స్తంభింపజేశారు. వీటితో పాటు నిందితుల వద్ద లభించిన రూ.34 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 318(4) (మోసం), 351(2) (నేరపూరిత బెదిరింపు)తో పాటు ఐటీ చట్టం, ఏపీ గేమింగ్ చట్టం, ఆయుధ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ నెట్‌వర్క్‌లో ఉన్న ఇతర నిర్వాహకుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని త్వరలోనే వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.
