
పెట్టుబడుల కోసం సీఎంల విదేశీ పర్యటనలు సహజమే: ఖర్గే
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిపాదిత అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. విదేశీ పర్యటనలకు కేంద్రం అనుమతులను ఎంపిక చేసుకుని ఇస్తోందని, రాష్ట్రాల పెట్టుబడి ప్రయత్నాలను అడ్డుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు.
కర్ణాటకలోని కలబురగిలో శనివారం మీడియాతో మాట్లాడిన ఖర్గే.. ముఖ్యమంత్రులు విదేశాలకు వెళ్లడం ద్వారా ప్రవాస భారతీయులను కలుసుకోవడంతో పాటు రాష్ట్రాలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పెద్ద సంఖ్యలో ప్రవాసులు అమెరికాలో ఉన్నారని, వారు స్వదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు లేదా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదిస్తారని చెప్పారు.
అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు ముఖ్యమంత్రులు వెళ్లి పెట్టుబడులకు అవకాశాలను అన్వేషించడం సహజమేనని ఖర్గే పేర్కొన్నారు. ఇలాంటి పర్యటనకు అనుమతి నిరాకరించడం అన్యాయమని అన్నారు. రాష్ట్రంలోకి విదేశీ పెట్టుబడులు వస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు దేశానికి ప్రయోజనం చేకూరుతుందని, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులన్నీ తన ద్వారానే రావాలన్న ధోరణితో రాష్ట్రాలు నేరుగా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలను అడ్డుకుంటోందని ఖర్గే ఆరోపించారు. ఇది సరైన విధానం కాదని, తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలకు సమాధానమిస్తూ.. దేశ అవసరాలకు అనుగుణంగా విధానాల రూపకల్పన అనే భావనను మొదటగా అమలు చేసింది భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అని గుర్తుచేశారు. ఆనాటి అవసరాల దృష్ట్యా నెహ్రూ ప్రభుత్వ రంగ సంస్థలు, ఐఐటీలు, ఐఐఎంలు, ప్రతిష్టాత్మక వైద్య సంస్థలను స్థాపించారని తెలిపారు.
రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్ రాజకీయ వివక్ష ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఖర్గే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం ముఖ్యమంత్రి హోదా, పర్యటన ఉద్దేశానికి ప్రతిపాదిత కార్యక్రమం అనుకూలంగా లేదని భావించినందున రాజకీయ అనుమతి ఇవ్వలేదని ఇప్పటికే స్పష్టం చేసింది.
వందేమాతరం వివాదంపై స్పందన
జాతీయ గేయం 'వందేమాతరం' పై నడుస్తున్న వివాదాన్ని ప్రస్తావిస్తూ, ఇది కేవలం ప్రజలను విభజించడానికి బీజేపీ లేవనెత్తిన కృత్రిమ వివాదమని ఖర్గే కొట్టిపారేశారు. 1937లో మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్ కలిసి వందేమాతరం గేయంలోని మొదటి రెండు పంక్తులను ఆలపించాలని నిర్ణయించారని, గత 90 ఏళ్లుగా దాన్నే విశ్వసనీయంగా పాడుతున్నామని చెప్పారు. దశాబ్దాలుగా ఉన్న ఈ విధానాన్ని ఇప్పుడు వివాదాస్పదం చేయడం కేవలం స్వార్థ రాజకీయాల కోసమేనని ఆయన దుయ్యబట్టారు.
