Let's talk: editor@tmv.in
పెట్టుబడిదారుల సంపద రూ.23.44 లక్షల కోట్లు ఆవిరి

పెట్టుబడిదారుల సంపద రూ.23.44 లక్షల కోట్లు ఆవిరి

Pinjari Chand
13 మార్చి, 2026

అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య కొనసాగుతున్న పశ్చిమాసియా ఘర్షణ ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లలో తీవ్ర కలకలం నెలకొంది. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు పెట్టుబడిదారుల సంపద సుమారు రూ.23.44 లక్షల కోట్లు కరిగిపోయినట్లు గణాంకాలు చూపిస్తున్నాయి. ఇదే సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 6 శాతానికి పైగా పడిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28న ఇరాన్‌పై సైనిక దాడులు ప్రారంభించగా, ఆ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయోతుల్లా అలీ ఖమేనీ మృతి చెందినట్లు సమాచారం. దీనికి ప్రతిగా ఇరాన్ పలు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై దాడులు ప్రారంభించింది. ఈ దాడులు యూఏఈ, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో కొనసాగుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో ఇరాన్ ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్‌ మార్గాన్ని దాదాపు అడ్డుకోవడంతో అంతర్జాతీయ చమురు, గ్యాస్‌ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రపంచ చమురు బెంచ్‌ మార్క్ అయిన బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 6.66 శాతం పెరిగి 98.11 డాలర్లకు చేరింది. ఫిబ్రవరి 27 నుంచి ఇప్పటివరకు సెన్సెక్స్ మొత్తం 5,252.77 పాయింట్లు (6.46శాతం) పడిపోయింది. ఇదే సమయంలో బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,40,06,434.01 కోట్లకు తగ్గింది. అంటే ఈ కాలంలోనే పెట్టుబడిదారుల సంపద రూ.23,44,237.26 కోట్లు కరిగిపోయింది.

మార్కెట్లు ఇంకా ఒత్తిడిలోనే ఉన్నాయని అజిత్‌ మిశ్రా తెలిపారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గే సూచనలు లేకపోవడం వల్ల ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోందన్నారు. చమురు ధరలు మళ్లీ 97 డాలర్ల సమీపంలో ఉండడం ద్రవ్యోల్బణం పెరగడం, కరెన్సీ బలహీనపడటం, భారత్ వాణిజ్య సమతుల్యంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 829.29 పాయింట్లు (1.08%) పడిపోయి 76,034.42 వద్ద ముగిసింది. ఒక దశలో ఇది 992.53 పాయింట్లు పడిపోయి 75,871.18 వరకు దిగజారింది. సెన్సెక్స్ కంపెనీల్లో మహీంద్రా & మహీంద్రా షేరు 4.23 శాతం పడిపోవడంతో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. దీనికి తోడు మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, అల్ర్టాటెక్‌ సిమెంట్, ట్రెంట్‌ షేర్లు కూడా గణనీయంగా పడిపోయాయి.

మరో వైపు ఎన్టీపీసీ, పవర్‌‌గ్రిడ్‌ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ముగిశాయి. రంగాల వారీగా చూస్తే ఆటో సూచీ 2.92 శాతం పడిపోగా, ఎఫ్‌ఎంసీజీ 1.62 శాతం, కన్స్యూమర్ డిస్క్రెషనరీ 1.59 శాతం, రియల్టీ 1.53 శాతం, ప్రైవేట్ బ్యాంకుల సూచీ 1.45 శాతం, టాప్-10 బ్యాంకుల సూచీ 1.29 శాతం తగ్గాయి. ఇంకోవైపు యుటిలిటీస్ సూచీ 3.31 శాతం పెరిగింది. పవర్ సూచీ 2.51 శాతం, ఎనర్జీ 1.06 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.55 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.52 శాతం, మెటల్ సూచీ 0.45 శాతం లాభపడ్డాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 0.65 శాతం, మిడ్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 0.55 శాతం చొప్పున తగ్గాయి. బీఎస్‌ఈలో మొత్తం 2,516 షేర్లు పడిపోగా, 1,713 షేర్లు లాభపడ్డాయి. 175 షేర్లలో మార్పు లేదు.