
పెట్టనికోటలో వైసీపీ పాట్లు !
కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీలో గందరగోళం నెలకొంది. వైసీపీ ఇంచార్జీ ఉన్నా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇంచార్జీ పదవి లేని నేత క్రియాశీలకంగా మారారు. ఇంచార్జీ ఎవరూ ఉన్న ప్రశ్న వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎవరి ఆదేశాల మేరకు పనిచేయాలన్న గందరగోళం ఉంది. ప్రస్తుత ఇంచార్జీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారో తెలియదు. ఆయన ఇంచార్జీగా ఉంటారో.. లేదో కూడా తెలియదు. వైఎస్ కుటుంబానికి పెట్టని కోటలాంటి జమ్మలమడుగులో ఫ్యాన్ పార్టీ కన్ఫ్యూజ్ అవుతోంది.
2024 ఎన్నికల్లో జమ్మలమడుగు వైసీపీ అభ్యర్థిగా సుధీర్ రెడ్డి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత నియోజకవర్గంలో అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఓడిపోయిన అభ్యర్థులనే వైసీపీ ఇంచార్జీగా ప్రకటించింది. ఆ లెక్కన సుధీర్ రెడ్డి జమ్మలమడుగు వైసీపీ ఇంచార్జీ. కానీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, కార్యకర్తలను కాపాడుకోవడంలో నిర్లక్ష్యంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. సుధీర్ రెడ్డి మౌనానికి కారణం ఏంటన్న చర్చ వైసీపీలో నడుస్తోంది. వైసీపీ అధిష్టానంతో విబేధాలు ఉన్నాయా?. టికెట్ మరొకరికి ఇస్తారన్న సమాచారం ఉందా?. అందుకే అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రశ్నలకు ప్రస్తుతం సమాధానంలేదు. సుధీర్ రెడ్డి వ్యవహారంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది.
సుధీర్ రెడ్డి అంటీముట్టనట్టు వ్యవహరిస్తుంటే.. వైసీపీ నేత రామసుబ్బారెడ్డి మాత్రం క్రియాశీలకంగా మారారు. నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ కూడా ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేశారు. సుధీర్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేయగా.. సుధీర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత టీడీపీ దేవగుడి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడంతో రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వచ్చారు. వైసీపీలో ఇప్పుడు క్రియాశీలకంగా మారారు. సుధీర్ రెడ్డి సైలెంట్ అవ్వడంతో రామసుబ్బారెడ్డికి ఇంచార్జీ పదవి ఇస్తారా అన్న చర్చ వైసీపీలో జరుగుతోంది. ఎందుకంటే రామసుబ్బారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణ రెడ్డి కుటుంబాన్ని ఎదుర్కొగలరు అన్న ఆలోచన వైసీపీ అధిష్టానంలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే సుధీర్ రెడ్డి విషయంలో పార్టీ అధిష్టానం రెండో ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే సుధీర్ రెడ్డి అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారన్నది టాక్.
ఇద్దరి నేతల మధ్య కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. ఇంచార్జిగా ఉన్న సుధీర్ రెడ్డి యాక్టివ్ గా లేరు. పదవి లేని రామసుబ్బారెడ్డి క్రియాశీలకంగా మారుతున్నారు. ఎవరి ఆదేశాల మేరకు పనిచేయాలన్న ప్రశ్న జమ్మలమడుగు వైసీపీలో ఉంది. వైసీపీలో గందరగోళం దేవగుడి ఆదినారాయణ రెడ్డి కుటుంబానికి అనుకూలంగా మారుతోంది. వైఎస్ కుటుంబానికి పెట్టని కోటలాంటి జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థిగా దేవగుడి ఆదినారాయణరెడ్డి గెలవడం మామూలు విషయం కాదు. దేవగుడి కుటుంబం టీడీపీ,బీజేపీలో ఉంటూ నియోజవర్గంలో పట్టుపెంచుకుంటోంది. పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్ రాకుండా చేయడంలో కీలక పాత్రపోషించింది. వైసీపీలో ఇదే గందరగోళం కొనసాగితే దేవగుడి కుటుంబం బలపడి, వైసీపీ బలహీనపడుతుందన్న వాదన వైసీపీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం ఇంచార్జి విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
