Let's talk: editor@tmv.in
పెండింగ్ సమస్యలకు సీఎం పరిష్కారం చూపారు

పెండింగ్ సమస్యలకు సీఎం పరిష్కారం చూపారు

FL - SIMHCLM
6 అక్టోబర్, 2025

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమం విజయవంతంగా జరిగిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తి అవగాహనతో ఈ ప్రాంత సమస్యలపై పరిష్కారం చూపుతూ మాట్లాడారని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.

విజయనగరంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 16 నెలలుగా ప్రతినెల ఒకటో తేదీన పేదల దినోత్సవం పేరుతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలలోని మారుమూల ప్రాంతాల్లో పర్యటిస్తూ పేదల జీవన స్థితిగతులు తెలుసుకుంటూ వారి సమస్యలకు పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారని, ఇదే క్రమంలో ఈ నెల ఒకటో తేదీన దత్తి గ్రామంలో పర్యటించడం సంతోషించదగ్గ విషయం అని, ఆ ప్రాంత ప్రజలు ఆనందోత్సాహాలతో ముఖ్యమంత్రి పర్యటనలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారని ఆయన చెప్పారు. ఎన్నో ఏళ్లుగా సార్వగడ్డ మినీ రిజర్వాయర్ అపరిష్కృతంగా ఉందని, దానికి ముఖ్యమంత్రి పర్యటన ద్వారా పరిష్కారం లభించిందని, సార్వగడ్డ మినీ రిజర్వాయర్ శాంక్షన్ చేయడం ద్వారా ఆ ప్రాంతంలో సాగునీటికి, తాగునీటికి పరిష్కారం చూపే దిశగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని ఆయన చెప్పారు.

ఈ ప్రాజెక్టు ఎంతో చిన్న ప్రాజెక్టు అయినప్పటికీ ఆ ప్రాంతంలో చాలా కీలకమైందని,ఎక్కువ ఉపయోగంగా ఉంటుందని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ పర్యటనలో తారకరామ తీర్ధ సాగర్, తోటపల్లి రిజర్వాయర్ కుడికాలువ తదితర ప్రాజెక్టులకు త్రికరణ శుద్ధితో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. భూగర్భ జలాల మట్టం పెంచే దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలియజేశారు.

విజయనగరం జిల్లాలో భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతామని మంత్రి శ్రీనివాస్ చెప్పారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉద్యోగ, ఉపాధి, స్వయం ఉపాధి కార్యక్రమాలకు ఊతం లభిస్తుందని, ఇష్టదైవాన్ని సందర్శించే అవకాశం కలుగుతుందని పలువురు మహిళలు ఆనందంతో ఉన్నారని ఆయన అన్నారు. స్త్రీశక్తి అమలు చేయడం ద్వారా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఎన్నికలలో హామీ ఇవ్వనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం రూ. 436 కోట్లు ఖర్చు చేస్తూ, 2,90,669 మంది ఆటో,మాక్సి, క్యాబ్ డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా, ఒక్కో డ్రైవర్ కు రూ. 15000 జమ చేశామని ఆయన చెప్పారు.

ఈ ఏడాదిలో శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ ఘనంగా జరుగుతుందని, ప్రతి సంవత్సరం కన్నా ఈ ఏడాది మిన్నగా జరుగుతుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఈ పండుగలో అందరినీ భాగస్వాములు చేయడం ద్వారా ప్రజల్లో భక్తి భావాన్ని పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు. సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఈ వేడుక కోసం ఖర్చు చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ ద్వారా పండుగకు రూ. 50 లక్షలు, యూత్ ఫెస్టివల్ ద్వారా మరో రూ. 50 లక్షలు, సరస్ ఎగ్జిబిషన్ కోసం రూ. కోటి ఖర్చు చేస్తున్నామని, వివిధ కార్యక్రమాల కోసం మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేస్తున్నామని అన్నారు.

గత రెండు రోజులుగా జిల్లాలో ఈదురు గాలులు, అకాల వర్షాల వల్ల విద్యుత్ శాఖకు చెందిన విద్యుత్ లైనులకు పలు ప్రాంతాలలో నష్టం జరిగిందని, దాదాపు ఇప్పటికే వాటన్నిటినీ రిపేరు చేసి విధ్యుత్ సప్లైని పునరుద్ధరించటం జరిగిందని చెప్పారు. జిల్లాలో పంట నష్టంపై గణాంకాలను అధికారులు సేకరిస్తున్నారని, ఇందుకు సంబంధించిన వివరాలు ప్రభుత్వానికి తెలియజేయాలని ఆదేశించామని, ఎక్కడైనా పంట నష్టం జరిగితే తగిన నష్టపరిహారం అందజేస్తామని మంత్రి తెలియజేశారు. వెనుకబడిన దత్తి గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా జరగటం, ముఖ్యమంత్రి అనేక సమస్యలకు పరిష్కారం చూపించిన నేపథ్యంలో దత్తి గ్రామ ప్రజలు, దత్తిరాజేరు మండలం, జిల్లా అధికార యంత్రంగా తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.

పెండింగ్ సమస్యలకు సీఎం పరిష్కారం చూపారు - Tholi Paluku