
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేద్దాం: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి సాగునీటి రంగాన్ని తిరిగి పట్టాలెక్కించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాలను కేంద్రంగా చేసుకుని ప్రపంచ స్థాయి ఉద్యాన క్లస్టర్ అభివృద్ధి దిశగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గ్లోబల్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పెంచుతూ, 500 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధించడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో 10 జిల్లాల్లో ఇరిగేషన్, ఉద్యాన, లాజిస్టిక్స్, రవాణా, మార్కెట్ కనెక్టివిటీ అంశాలపై విస్తృతంగా చర్చించారు. పూర్వోదయ సాస్కీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులను సమన్వయం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. కాగా గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి అనేక ప్రాజెక్టులను పెండింగ్‌లో ఉంచిందని మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ సమావేశంలో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన సీఎం… తక్కువ నిధులతో త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో ముందుగా చేపట్టాలని కీలక ప్రాజెక్టులను కాలపరిమితిలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
వెలిగొండ ప్రాజెక్టును ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని గత నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు తక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గాలేరు,నగరి ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను కడప వరకు తీసుకెళ్లే అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఈ దిశగా సుమారు 20కి పైగా ప్రాజెక్టులు అభివృద్ధి చేయాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. వీటి ద్వారా కొత్తగా 8.87 లక్షల ఎకరాల ఆయకట్టు, 4.30 లక్షల ఎకరాల స్థిరీకరణకు సాగునీరు అందే అవకాశం ఉందని సీఎంకు తెలిపారు.
సీమతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యతతో చేపట్టాలని సీఎం సూచించారు. పోలవరం కుడి కాలువ పనులు పూర్తైతే గోదావరి జలాలను ఉత్తరాంధ్ర వరకు తరలించవచ్చని తద్వారా పోలవరం,వంశధార నదుల అనుసంధానం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈలోగా ఉత్తరాంధ్రలో చేపట్టాల్సిన ప్రాజెక్టులపై స్పష్టమైన రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యాన క్లస్టర్‌గా రాయలసీమ
ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఉద్యాన సాగు విస్తృతంగా పెరుగుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 10 జిల్లాల్లోని 201 క్లస్టర్లు, 303 మండలాల్లో ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని మూడేళ్లలో ఉద్యాన సాగు విస్తీర్ణాన్ని 8.41 లక్షల హెక్టార్ల నుంచి 14.41 లక్షల హెక్టార్లకు పెంచే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు.
రాయలసీమ ప్రాంతాన్ని దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యాన క్లస్టర్‌గా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దుబాయికి చెందిన డీపీ వరల్డ్ సంస్థ ఏపీలో ఉద్యాన క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చిందని దీనికి అనుగుణంగా అంతర్జాతీయ విధానాలను అధ్యయనం చేసి పూర్తి స్థాయి ఎకో సిస్టమ్ అభివృద్ధి చేయాలని అధికారులకు ఆదేశించారు.
ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయనున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు
వెలిగొండ ప్రాజెక్ట్, కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, పాలేరు రిజర్వాయర్, మల్లెమడుగు లిఫ్ట్–రిజర్వాయర్, శ్రీ బాలాజీ రిజర్వాయర్, కుప్పం–పుంగనూరు బ్రాంచ్ కెనాళ్లు, హంద్రీ–నీవా ప్రధాన కాల్వ, నీవా బ్రాంచ్ కెనాల్, జీడిపల్లి–భైరవానితిప్ప లిఫ్ట్ పథకం, జీడిపల్లి–అప్పర్ పెన్నార్ ఎత్తిపోతలు అనంతలో కమ్యూనిటీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్, మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ, పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గాలేరు–నగరి సుజల స్రవంతి, అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ వేదవతి–అలగనూరు–గాజులదిన్నె ప్రాజెక్టులు, అదేవిధంగా ఏడు జిల్లాల్లో 1011 మైనర్ ఇరిగేషన్ చెరువుల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ సమావేశంలో సీఎస్ విజయానంద్‌తో పాటు ఆర్థిక, ఇరిగేషన్, వ్యవసాయ, ఉద్యాన, పోర్టులు, ఆర్‌అండ్‌బీ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
