
పెంచిన విద్యుత్ సర్దుబాటు ట్రూడౌన్ చేయాలి
విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్ తుది నిర్ణయం ప్రకారం రు.923 కోట్లు మాత్రమే కాకుండా 202425 కాలానికి అక్రమంగా వసూలు చేసిన మొత్తం ట్రూఅప్ ఛార్జీలు రూ.2758 కోట్లు వినియోగదారులకు వాపసు చేయాలని (ట్రూడౌన్) సిపిఐ(యం) రాష్ట్ర కమిటి డిమాండ్ చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. 202425 కాలానికి సంబంధించి 923 కోట్ల రూ. ట్రూ డౌన్ ద్వారా, ఇప్పుడు వినియోగించుకుంటున్న విద్యుత్ పై యూనిట్ కు 13 పైసలు చొప్పున సంవత్సర కాలంలో తిరిగి వినియోగదారులకు చెల్లించాలని నియంత్రణ మండలి ఆదేశాలు ఇవ్వటం సరైనదేనని తెలిపారు.
అయితే ప్రతి నెల వినియోగించుకున్న యూనిట్‌పై తదుపరి నెల బిల్లులలో 40 పైసలు చొప్పున ముందుగానే 2758 కోట్ల రూ. వినియోగదారుల వద్ద నుంచి అక్రమంగా ఇంధన సర్దుబాటు చార్జీలు (ఎఫ్.పి.పై.సి.ఏ) పేరుతో వసూలు చేశారని విమర్శించారు. ఇది అన్యాయంగా వసూలు చేసినట్లు స్పష్టమవుతుందున దాన్ని కూడా వినియోగదారులకు వాపసు ఇవ్వాలన్నారు. అంతేకాక ఇప్పటివరకు వసూలు చేస్తున్న 40 పైసల్ని వెంటనే ఆపేయాలని సిపిఐ(యం) డిమాండ్ చేశారు. ఇప్పటికే వసూలు చేసిన వేలకోట్ల రూ.సర్దుబాటు చార్జీల భారాన్ని మరుగుపరిచి, 923 కోట్లు తగ్గింపుతోనే సరిపెట్టడం తగదని స్పష్టం చేశారు. విద్యుత్ అదనపు భారాలు మోపబోమని కూటమి పార్టీలు ఎన్నికలలో హామీ ఇచ్చాయని శ్రీనివాసరావు గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్ బాదుడు ఉండదని పదే పదే ప్రకటించారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాట తప్పిందని చెప్పారు. 15 నెలల కాలంలోనే 2022-23, 23-24 సంవత్సరాలకు సంబంధించి రూ. 15,485 కోట్లను సర్దుబాటు చార్జీల పేరుతో భారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాకుండా ప్రతినెల 40 పైసలు చొప్పున అదనంగా సర్దుబాటు చార్జీలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనుక ప్రజలకు ఇచ్చిన హామీకు అనుగుణంగా ఇప్పటికే వసూలు చేసిన 2758 కోట్లతో పాటు ఇప్పటికీ వసూలు చేస్తున్న రూ. 15,485 కోట్ల భారాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అదనంగా మోపిన మొత్తం భారాలను తగ్గించి కూటమి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఈ సర్దుబాటు చార్జీల విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరారు. మొత్తం సర్దుబాటు చార్జీల భారం తగ్గించే వరకు ప్రభుత్వంపై వివిధ రూపాల్లో ఒత్తిడి చేయడానికి ప్రజలు సిద్ధం కావాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
