Let's talk: editor@tmv.in
పూలే జయంతి నాడే పేదల ఇళ్ల కూల్చివేతలా?: మాజీమంత్రి హరీశ్ రావు

పూలే జయంతి నాడే పేదల ఇళ్ల కూల్చివేతలా?: మాజీమంత్రి హరీశ్ రావు

Gaddamidi Naveen
12 ఏప్రిల్, 2026

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి రోజున బడుగు, బలహీన వర్గాల ఇళ్లను కూల్చివేయడం అత్యంత అమానుషమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ను సందర్శించిన ఆయన, ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సామాజిక న్యాయం కోసం పోరాడిన ఫూలే ఆశయాలను గౌరవించాల్సింది పోయి, ఆయన జయంతి రోజే పేదల ఇళ్లను కూల్చడం ఫూలే ఆత్మను అవమానించడమేనని హరీశ్ రావు అన్నారు. ప్రజాపాలన అంటే మహిళలు, చిన్నారులను నడిరోడ్డుపై నిలబెట్టడమేనా? అని ఆయన ప్రశ్నించారు.

ఇదేనా కాంగ్రెస్ చేసే ప్రజాపాలన అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి బడుగు బలహీన వర్గాలపై దాడులు జరగడం, వారికి నిలువ నీడ లేకుండా చేయడం ప్రజాస్వామ్యానికే మచ్చ అని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఉద్యమం బలహీన వర్గాల హక్కులు, గౌరవం కోసం సాగిందని, కానీ నేటి సీఎం రేవంత్ ప్రభుత్వ పాలనలో ఆ విలువలు తుడిచిపెట్టుకుపోతున్నాయని ఆరోపించారు. భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం భయం నింపే ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. అలాగే ఢిల్లీలో ప్రతిరోజూ రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడే రాహుల్ గాంధీ, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించాలంటూ ప్రశ్నించారు. పేదల ఇళ్లను శని, ఆదివారాల్లో కూల్చడం రాజ్యాంగ ఆత్మకు తూట్లు పొడిచినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అమానుష చర్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, బాధితులకు తక్షణ న్యాయం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇక సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ను సందర్శించిన హరీశ్ రావు, రైతుల సమస్యలపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పంట కొనుగోళ్లలో నిర్లక్ష్యం జరుగుతోందని ఆరోపించారు. నారాయణపేట, ఆదిలాబాద్, నిజామాబాద్ కేంద్రాల్లో జొన్న కొనుగోలు సెంటర్లు ఇంకా ప్రారంభం కాలేదని వెంటనే ప్రారంభించి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మార్కెట్ యార్డులను అధికారులు తరచూ సందర్శించకపోవడంతో రైతులు తక్కువ ధరలకు పంటలు అమ్ముకోవాల్సి వస్తోందని తెలిపారు. పంట మార్పిడి చేయమని ప్రభుత్వం చెబుతున్నా, ఆ పంటలను కొనుగోలు చేసే వ్యవస్థ లేదని విమర్శించారు. వడగళ్ల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని, రైతు భరోసా సకాలంలో ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.