Let's talk: editor@tmv.in
పూణేలో చిరుత దాడిలో బాలుడు మృతి

పూణేలో చిరుత దాడిలో బాలుడు మృతి

Pinjari Chand
4 నవంబర్, 2025

మహారాష్ట్రలోని పూణే జిల్లా షిరూర్ తాలూకా పింపర్కేడ్ (అంబేవాడీ) గ్రామంలో ఆదివారం ఘోర విషాదం చోటు చేసుకుంది. పొలాల దగ్గర ఆడుకుంటున్న 13ఏళ్ల బాలుడు రోహన్ విలాస్ బొంబేను చిరుత దాడి చేసి చంపేసింది. సాయంత్రం 3.45 గంటల సమయంలో చెరుకు తోటల్లో దాగి ఉన్న చిరుత ఒక్కసారిగా దాడి చేయడంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఆగ్రహం నెలకొంది. అడవి శాఖ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కోపోద్రిక్తులైన ప్రజలు అటవీ శాఖ కార్యాలయానికి, వాహనానికి నిప్పంటించారు. చక్కర్ జామ్‌(రోడ్డుపై నిరసన) చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. అదే సమయంలో, అటవీ శాఖ ప్రధాన కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆ చిరుతను చంపేందుకు అనుమతి ఇచ్చారు. దానికోసం షార్ప్ షూటర్ల బృందం, 25 పంజరాలు, 10 ట్రాప్ కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదే విధంగా అటవీ అధికారుల ఆధ్వర్యంలో ప్రజలకు అడవి జంతువులు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టారు. చిరుత మళ్లీ గ్రామంలో కనిపిస్తుందేమోనన్న భయంతో ప్రజలు పగటి సమయంలో కూడా బయటకు రావడానికి భయపడుతున్నారు.

చిరుతలకు హట్ స్పాట్

గతంలోనూ ఈ ప్రాంతంలో చిరుతల దాడులు జరిగాయి. ఈ ప్రాంతాన్ని చిరుతలకు హాట్ స్పాట్ గా గుర్తించారు. షిరూర్ తాలూకాలో ఒక 55 ఏళ్ల మహిళను చిరుత దాడి చేసి చంపిన ఘటన 2024లో జరిగింది. జున్నార్ తాలూకాలో కూడా 2024లో వరుసగా అనేక మంది చిరుత దాడుల గాయపడ్డారు. మరికొంతమంది మరణించారు. జున్నార్ అటవీ రేంజ్‌లో ఒక సంవత్సరం లోనే 9 మరణాలు నమోదు అయ్యాయి. ఐదు సంవత్సరాలలో 17 మంది మరణించారు. 2025 అక్టోబర్‌లో 5 ఏళ్ల బాలికపై చిరుత దాడి చేసి చంపినట్టు వార్తలు వచ్చాయి. చిరుత దాడులు అధికమవుతుండడంతో అటవీ అధికారులు అనేక చర్యలు చేపట్టారు. సౌర విద్యుత్ వెల్ ఫెన్సింగ్, ఏఐ–కెమెరాలు, ట్రాప్ కెమెరాలు, నెక్-బెల్ట్‌లు విడుదల చేశారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.

పూణేలో చిరుత దాడిలో బాలుడు మృతి - Tholi Paluku