
పూడిక తీత ఆపొద్దు – నాలాల్లో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోండి: హైడ్రా కమిషనర్
రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో, నగరంలో నాలాలు, చెరువుల నిర్వహణపై హెచ్‌ఐడీఆర్‌ఏ కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నాలాల్లో వరద ప్రవాహం తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితులను వినియోగించుకుని, నాలాల్లోని పూడికను పూర్తి స్థాయిలో తొలగించాలని ఆయన హైడ్రా డీఆర్‌ఎఫ్ టీమ్‌లకు దిశానిర్దేశం చేశారు.
నగరవ్యాప్తంగా నాలాల్లో పూడిక తీసే పనులను ముమ్మరం చేయాలని ఆయన సూచించారు. ఈ ఏడాది భారీ వర్షాలు పడినా, చాలా వరకు పూడికను తొలగించడం వలనే వరద ముప్పు పెద్దగా ఏర్పడలేదని కమిషనర్ పేర్కొన్నారు. అయితే, వచ్చే ఏడాది అసలు ఈ సమస్య తలెత్తే అవకాశం లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
క్షేత్రస్థాయి పర్యవేక్షణ
ప్రజావాణి ఫిర్యాదుల మేరకు నగరంలోని నాలాలు, చెరువులను పరిశీలిస్తున్న కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్‌నగర్, బోరబండ ప్రాంతాల్లో నాలాల్లో పూడిక తీత పనులను పర్యవేక్షించారు. పూడిక తీత పనులకు వరద ప్రవాహానికి ఆటంకాలను తొలగించడానికి ఇదే సరైన సమయమని ఆయన హితవు పలికారు. అలాగే ప్రాంతాల వారీగా వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి, సమాచారాన్ని చేరవేయాలని సూచించారు.
చెరువుల పరిశీలన, అభివృద్ధిపై సూచనలు
కమిషనర్ ఎల్‌బీనగర్ నియోజకవర్గ పరిధిలోని హరిహరపురంలోని కాప్రాయి చెరువుతో పాటు, శంషాబాద్, పెద్దగోల్కొండలోని నరసింహ చెరువు, బాలాపూర్ మండలంలోని కోమటి కుంటను ఆయన పరిశీలించారు. నగరంలో చెరువులను అభివృద్ధి చేసి వరదలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కాప్రాయి చెరువుకు ఔట్‌లెట్‌లు లేకపోవడం వల్ల తమ కాలనీలు నీటమునుగుతున్నాయని స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో, కమిషనర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇన్‌లెట్ ద్వారా ఎంత వరద వస్తుందో అంతే మొత్తం కిందకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఔట్‌లెట్‌లు లేకపోవడం, వరద నీరు చెరువులోకి వెళ్లకుండా డైవర్ట్ చేయడం వల్లే స్నేహమయినగర్, అఖిలాండేశ్వరి, గ్రీన్‌ల్యాండ్స్‌తో సహా ఏడెనిమిది కాలనీలు నీట మునుగుతున్నాయని స్థానికులు వాపోయారు. పూడిక తీత నిరంతర ప్రక్రియగా సాగాలని, వెంటనే ఈ పనులు చేపట్టాలని డీఆర్‌ఎఫ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు.
విద్యార్థినుల వినతిపత్రం
శంషాబాద్ మండలం చిన్నగోల్కొండ, పెద్దగోల్కొండ ఔటర్ రింగ్‌రోడ్డు అండర్‌పాస్‌లు వరద నీటిలో మునుగుతుండటం వల్ల పాఠశాలకు వెళ్లలేకపోతున్నామని ఆ ప్రాంత విద్యార్థినులు కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫిర్యాదు చేశారు.ఇటీవల తాము ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు అండర్‌పాస్ కింద నీటిలో ఆగిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వరద కాలువల్లో పూడికను తొలగించి, సక్రమంగా నిర్వహిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని కమిషనర్ అధికారులకు సూచించారు.
