Let's talk: editor@tmv.in
పుష్కర ఎత్తిపోతల పనుల్లో జాప్యం.. మంత్రి నిమ్మల ఆగ్రహం

పుష్కర ఎత్తిపోతల పనుల్లో జాప్యం.. మంత్రి నిమ్మల ఆగ్రహం

Pinjari Chand
13 ఆగస్టు, 2026

పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్‌ పనుల్లో జాప్యంపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం పనులు పూర్తి చేయకపోతే కాంట్రాక్టు ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రయోజనాలకు నష్టం కలిగించేలా కాంట్రాక్టర్లు వ్యవహరిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేసి జైలుకు పంపేందుకు కూడా వెనుకాడవద్దని పోలవరం జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను ఆదేశించారు. పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్‌ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పోలవరం జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఇరిగేషన్‌ అడ్వైజర్‌ వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, ఈఈలు, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇటీవల పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్‌ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులు వర్క్‌ షెడ్యూల్‌ అందజేశారని మంత్రి తెలిపారు. ఆ షెడ్యూల్‌ ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అనే అంశాన్ని ఇరిగేషన్‌ అడ్వైజర్‌ వెంకటేశ్వరరావు క్షేత్రస్థాయిలో పరిశీలించి తనకు నివేదిక అందించారని చెప్పారు. వర్క్‌ షెడ్యూల్‌ ఇచ్చినప్పటికీ పనుల్లో ఆశించిన స్థాయిలో వేగం పెరగకపోవడంపై మంత్రి అధికారులను, ఏజెన్సీల ప్రతినిధులను నిలదీశారు. ప్రజాప్రయోజనాలకు సంబంధించిన అత్యంత కీలకమైన పనుల్లో అలసత్వాన్ని ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.

ఈఈకి మెమో.. రోజువారీ ప్రగతి నివేదిక

పనుల్లో అలసత్వం వహించిన ఈఈకి మెమో జారీ చేయాలని ఈఎన్‌సీ నరసింహమూర్తిని మంత్రి ఆదేశించారు. ఇకపై పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్‌ పనులపై ప్రతిరోజూ వర్క్‌ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ అందించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎల్‌నినో వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి నీటి చుక్కనూ ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి తెలిపారు. గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు పుష్కర ఎత్తిపోతల పథకం పనులు కీలకమని పేర్కొన్నారు.

ఈ నెలాఖరులో గోదావరి జలాల విడుదల

ఈ నెలాఖరులో సీఎం చంద్రబాబు పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకు గోదావరి జలాలు వెళ్లేలా నీటిని విడుదల చేయనున్నారని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్‌ పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టు ఏజెన్సీలను ఆదేశించారు.

పుష్కర ఎత్తిపోతల పనుల్లో జాప్యం.. మంత్రి నిమ్మల ఆగ్రహం - Tholi Paluku