Let's talk: editor@tmv.in
పులి గోర్లు, దంతాల అక్రమ రవాణా ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ డీఆర్‌ఐ

పులి గోర్లు, దంతాల అక్రమ రవాణా ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ డీఆర్‌ఐ

Gaddamidi Naveen
11 ఫిబ్రవరి, 2026

హైదరాబాద్‌ నగరంలోని నాంపల్లిలో వన్యప్రాణుల అవయవాలను అక్రమంగా విక్రయిస్తున్న ముఠాపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు దాడి చేశారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 7 పులి గోర్లు, మూడు పులి కేనైన్ పళ్లను స్వాధీనం చేసుకున్నారు.

వన్యప్రాణుల అవయవాలను గ్రే మార్కెట్‌లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో, డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ ఫిబ్రవరి 9న ఈ ఆపరేషన్‌ను చేపట్టింది. నాంపల్లి పరిసరాల్లో నిఘా ఉంచిన అధికారులు, అనుమానిత ఇద్దరు వ్యక్తులను చాకచక్యంగా అడ్డుకున్నారు. వారిని విచారించగా, ఒక వ్యక్తి తన బ్యాక్‌ప్యాక్ నుంచి జిప్-లాక్ కవర్‌ను బయటకు తీశాడు. దాన్ని పరీక్షించగా అందులో పులికి సంబంధించినవిగా భావిస్తున్న గోర్లు, కేనైన్ పళ్లు లభ్యమయ్యాయి.

వన్యప్రాణుల సంరక్షణ చట్టం, 1972 నిబంధనల ప్రకారం ఆ అవయవాలను, వాటిని దాచిన బ్యాగును నిందితులు వాడిన మొబైల్ ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. పట్టుబడిన ఇద్దరు స్మగ్లర్లతో పాటు స్వాధీనం చేసుకున్న సామాగ్రిని తదుపరి విచారణ నిమిత్తం తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అధికారులకు అప్పగించినట్లు డీఆర్ఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవయవాలను ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? దీని వెనుక ఉన్న పెద్ద ముఠా ఎవరనే కోణంలో అటవీ శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.