Let's talk: editor@tmv.in
పుర పోరులో వికసించని ‘కమలం’: రామచందర్ రావు

పుర పోరులో వికసించని ‘కమలం’: రామచందర్ రావు

Gaddamidi Naveen
14 ఫిబ్రవరి, 2026

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికాయి. ఈ ఎన్నికల సరళిని పరిశీలిస్తే రాష్ట్రంలో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు బీజేపీపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ పాగా

మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 350కి పైగా డివిజన్లలో బీజేపీ ఘన విజయం సాధించిందని రామచందర్ రావు వెల్లడించారు. ప్రస్తుతం రెండు కీలక మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ ముందంజలో ఉందని, ఆ రెండింటినీ కైవసం చేసుకునే దిశగా వెళ్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 నుంచి 6 మున్సిపాలిటీల్లో బీజేపీ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. గనులు, పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెంలో సైతం బీజేపీ తన ఖాతాను తెరిచి, పట్టణ ఓటర్ల మద్దతును కూడగట్టుకుంది.

ముగిసిన బీఆర్ఎస్ శకం?

ఒకప్పుడు పట్టణ ప్రాంతాలపై తిరుగులేని ఆధిపత్యం చలాయించిన బీఆర్ఎస్ పార్టీ నేడు ఘోరంగా విఫలమైంది. గతంలో 1341 వార్డులను గెలుచుకున్న ఆ పార్టీ, ఇప్పుడు కేవలం 750 వార్డులకే పరిమితమైంది. లోక్‌సభ ఎన్నికల్లో సున్నా సీట్లు, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటమి, గ్రామ పంచాయతీల్లో పరాజయం తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు ఆ పార్టీని పూర్తిగా తిరస్కరించారని ఆయన అన్నారు. అలాగే అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయి ఫలితాలను సాధించలేకపోయిందని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ధనబలాన్ని ఉపయోగించినప్పటికీ కేవలం 55 శాతం వార్డులను మాత్రమే గెలుచుకోవడం ఆ పార్టీపై ప్రజలకున్న పరిమిత నమ్మకాన్ని సూచిస్తోందని ఆయ‌న పేర్కొన్నారు. అధికార పక్షం ఎన్నికలను స్వీప్ చేయాల్సిన చోట, ఈ ఫలితాలు వారికి గట్టి హెచ్చరిక అని వ్యాఖ్యానించారు.

క్షేత్రస్థాయిలో పరిమితమైన నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ అద్భుత ప్రదర్శన చేయడం విశేషం. ఇది కేవలం ఒక గాలివాటం విజయం కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఏకైక బలమైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజలు భావిస్తున్నారని రామచందర్ రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ శకం ముగిసింది, కాంగ్రెస్ మద్దతు పరిమితం, బీజీపీ ఎదుగుదల సుస్థిరం. ఈ విజయోత్సాహంతో రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసి, భవిష్యత్తులో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని బీజేపీ నాయకత్వం ప్రకటించింది.

పుర పోరులో వికసించని ‘కమలం’: రామచందర్ రావు - Tholi Paluku