Let's talk: editor@tmv.in
పుర పోరులో కాంగ్రెస్‌దే పై "చేయి"

పుర పోరులో కాంగ్రెస్‌దే పై "చేయి"

Gaddamidi Naveen
14 ఫిబ్రవరి, 2026

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ఉదయం అత్యంత పటిష్ట భద్రత మధ్య ప్రారంభమైంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల భవితవ్యాన్ని తేల్చే ఈ కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఈ ఎన్నికల ఫలితాలు అత్యంత కీలకంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 123 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఉటుంది. అదే రోజు మధ్యాహ్నం మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నిర్వహించనున్నారు.

కౌంటింగ్ సెంటర్లలో సమస్యలు రాకుండా, పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేశారు. డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలిపిన వివ‌రాల‌ ప్రకారం, కౌంటింగ్ సెంటర్లలో 12,000 పైగా పోలీసు సిబ్బంది, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ నియమించబడ్డారు. కౌంటింగ్ హాల్‌లో కేవలం కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు మాత్రమే ప్రవేశించ‌గ‌లిగారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకారం, అన్ని కౌంటింగ్ సెంటర్లలో, స్ట్రాంగ్ రూంల బయట వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయబడింది. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ విధిస్తూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 73 శాతం పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డుల్లో శుక్రవారం ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో కాంగ్రెస్‌ 1347 వార్డుల్లో విజయం సాధించి 66 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 717 వార్డుల్లో గెలుపొంది 13 మున్సిపాలిటీలు దక్కించుకుంది. బీజేపీ 261 వార్డుల్లో, స్వతంత్రులు 256 వార్డుల్లో విజయం సాధించారు. ఎంఐఎం 4 కార్పొరేషన్లలో 22 వార్డులు, 15 మున్సిపాలిటీల్లో 40కి పైగా వార్డులను గెలుచుకుని తన ప్రభావాన్ని చూపింది. 36 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్‌ ఏర్పడింది.

కార్పొరేషన్ల పోరు

7 మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ మూడు చోట్ల స్పష్టమైన విజయం సాధించగా, ఒకచోట ముందంజలో ఉంది. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో బీజేపీ మెజారిటీ స్థానాలను గెలుచుకుని సంచలనం సృష్టించింది. కొత్తగూడెం కార్పొరేషన్‌లో కాంగ్రెస్, సిపిఐ మధ్య హోరాహోరీ పోరు సాగింది.

కరీంనగర్‌లో హంగ్‌.. అత్యధిక స్థానాల్లో బీజేపీ విజయం

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లు ఉండగా ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. బీజేపీ 30 డివిజన్లలో గెలుపొందగా కాంగ్రెస్‌ 14, బీఆర్‌ఎస్‌ 9, స్వతంత్రులు 8, ఎంఐఎం 3, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ 2 స్థానాల్లో విజయం సాధించాయి. స్వతంత్రుల మద్దతుతో కరీంనగర్‌ మేయర్‌ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకునే అవకాశముంది.

నాలుగు మున్సిపాలిటీల్లో ఖాతా తెరవని బీఆర్‌ఎస్‌

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో భారత రాష్ట్ర సమితి 13 పురపాలికలతో సరిపెట్టుకుంది. కోస్గి, మక్తల్‌, ధర్మపురి, భైంసా మున్సిపాలిటీల్లో ఆ పార్టీ ఖాతా తెరవలేదు. ధర్మపురిలో మొత్తం 15 వార్డులు ఉండగా అన్నింటినీ కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. కోస్గిలో 16 స్థానాలు ఉండగా మొత్తం కాంగ్రెస్‌ ఖాతాలోనే పడ్డాయి.

చారిత్రక విజయం: మున్సిపల్ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ గెలుపు!

రాష్ట్రంలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి ఘనవిజయం సాధించడం చారిత్రాత్మకంగా నిలిచింది. నల్గొండ జిల్లాలోని చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నాగిళ్ల సుధాకర్ 109 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ మద్దతు పొందిన సీపీఎం అభ్యర్థి జిట్ట నగేష్‌పై గెలుపొందిన సుధాకర్‌కు ప్రజలు విశేష మద్దతు తెలిపారు. ఈ విజయం సమాజంలో మారుతున్న ఆలోచనలకు, సమానత్వానికి ప్రతీకగా నిలిచింది. రాష్ట్రంలోనే ఒక ట్రాన్స్‌జెండర్ మున్సిపల్ ఎన్నికల్లో గెలవడం ఇదే మొదటిసారి.

తెలంగాణలో ఖాతా తెరిచిన జనసేన

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బోణీ కొట్టింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల 14వ వార్డులో ఆ పార్టీ అభ్యర్థి విజయలక్ష్మి ఆరూరి 60 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్ల 34వ డీవిజ‌న్ లో 31ఓట్ల మెజారిటీతో జనసేన అభ్యర్థి అగ్గు సాగ‌ర్ ఘనవిజయం సాధించారు. ఏపీకే పరిమితం కాకుండా, తెలంగాణ పట్టణ పోరులోనూ జనసేన తన ఉనికిని చాటుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ శ్రేణులు ఈ విజయాన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్నాయి.

హంగ్ మున్సిపాలిటీల్లో 'ఇండిపెండెంట్'ల కీలకం

మెజారిటీకి స్వల్ప దూరంలో నిలిచిన హంగ్ మున్సిపాలిటీల్లో స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడగట్టేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. బ్యాలెట్ పేపర్ల వినియోగం వల్ల కౌంటింగ్ ప్రక్రియ అర్థరాత్రి వరకు కొనసాగింది. ఈ ఫలితాలు తెలంగాణలో భవిష్యత్తు రాజకీయ పోరాటాలకు కొత్త దిశను చూపించబోతున్నాయి.

ప్రభుత్వ స్పందన - ప్రజాపాలనకు దక్కిన ఆమోదం

మున్సిపల్ ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ, ఇది ప్రభుత్వ రెండేళ్ల 'ప్రజాపాలన'కు ప్రజలు ఇచ్చిన సర్టిఫికేట్ అని అభివర్ణించారు. సంక్షేమ పథకాలు, ప్రపంచ స్థాయి ప్రణాళికలతో మేము చేస్తున్న అభివృద్ధిని ప్రజలు ఆశీర్వదించారు. ప్రతి మున్సిపాలిటీని సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం అని ఆయన పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, కాంగ్రెస్ నిర్ణయాత్మకంగా 83 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లను గెలుచుకుందని ప్రకటించారు.

ప్రతిపక్షాల విశ్లేషణ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికార పార్టీ ధనబలం, బెదిరింపులకు పాల్పడినప్పటికీ బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. 15 మున్సిపాలిటీల్లో గెలిచామని, మరో 10 నుంచి 15 చోట్ల సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించామని, పట్టణ ప్రాంతాల్లో తామే ప్రధాన శక్తి అని ఆయన పేర్కొన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో తొలిసారి అధికారం చేపట్టబోతున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మంచిర్యాల, నల్గొండ, రామగుండం వంటి చోట్ల బీజేపీ బలం పెరిగిందని, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం లోపాయికారీ ఒప్పందాలను ఎదుర్కొని నిలబడ్డామని ఆయన విమర్శించారు.

తెలంగాణ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు

పుర పోరులో కాంగ్రెస్‌దే పై "చేయి" - Tholi Paluku