
పుర్బాచల్ ప్లాట్ కేసు: షేక్ హసీనాకు 10 ఏళ్ల జైలు శిక్ష
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఢాకా కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుర్బాచల్ న్యూ టౌన్ ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులో భూకేటాయింపుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై నమోదైన రెండు అవినీతి కేసుల్లో కోర్టు ఆమెకు మొత్తం 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు ఢాకా స్పెషల్ జడ్జి కోర్టు-4 న్యాయమూర్తి రబియుల్ ఆలమ్ సోమవారం తీర్పును వెలువరించారు.
ఏమిటీ భూ కేటాయింపుల వివాదం?
రాజధాని ఢాకాలోని పుర్బాచల్ (రాజుక్ న్యూ టౌన్) ప్రాజెక్టులో 10 కఠాల (ఒక కఠా=80 గజాలు) చొప్పున భూమి కేటాయింపుల విషయంలో అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నిబంధనలను ఉల్లంఘించి ప్లాట్లు కేటాయించారని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. ఈ కేసులను యాంటీ–కరప్షన్ కమిషన్ (ఏసీసీ) 2025 జనవరి 13న నమోదు చేసింది. అనంతరం మార్చి 10, 2025న 18 మంది నిందితులపై చార్జ్‌షీట్ దాఖలు చేసింది. మొత్తం 31 మంది సాక్షులను విచారించిన అనంతరం కోర్టు సోమవారం తుది తీర్పును వెలువరించింది.
కుటుంబ సభ్యులకూ శిక్షలు
ఈ కేసుల్లో షేక్ హసీనా కుటుంబ సభ్యులకూ శిక్షలు పడ్డాయి. ఆమె సోదరి షేక్ రేహానా కుమార్తె, బ్రిటన్ ఎంపీ తులిప్ రిజ్వానా సిద్ధిక్‌కు రెండు కేసుల్లో కలిపి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. షేక్ హసీనా మేనల్లుడు రద్వాన్ ముజిబ్ సిద్ధిక్ (బాబీ)కు ఏడు సంవత్సరాలు, అజ్మినా సిద్ధిక్‌కు కూడా ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడింది. జైలు శిక్షతో పాటు, దోషులందరికీ ఒక్కొక్కరికి లక్ష టాకాల చొప్పున జరిమానా విధించారు. ఒకవేళ ఈ జరిమానా చెల్లించడంలో విఫలమైతే, వారు అదనంగా మరో ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
హింసాత్మక నిరసనలు.. దేశం విడిచిన హసీనా
2024 జూలైలో బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఈ ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో అదే ఏడాది ఆగస్టు 5న షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ప్రాణరక్షణ కోసం భారతదేశానికి పారిపోయి వచ్చారు. అప్పటి నుండి ఆమె ఇక్కడే ఉంటున్నారు. ఆమె బంగ్లా విడిచిన తర్వాత నోబెల్ విజేత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం హసీనా, ఆమె అనుచరులపై పాత కేసులను తిరగదోడటమే కాకుండా కొత్తగా అనేక కేసులు నమోదు చేసింది.
తదుపరి పరిణామాలు ఏమిటి?
కోర్టు ఇప్పటికే షేక్ హసీనాను 'పరారీలో ఉన్న వ్యక్తి'గా ప్రకటించింది. తాజా తీర్పు ప్రకారం ఆమెకు శిక్ష అమలు కావాలంటే ఆమెను భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు అప్పగించాల్సి ఉంటుంది. అయితే ఇది రెండు దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే హసీనా కేబినెట్ మంత్రులు, పార్టీ నాయకులు పలు కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నారు.
