
పురాణాలకు పునర్జన్మ, ఊహల తెరపై విజయ రహస్యాలు
ఇటీవల భారతీయ సినిమారంగంలో కొత్త ట్రెండ్ మొదలైంది. అభిమానులు గమనించిన ఆ అతిపెద్ద, శక్తివంతమైన మార్పు ఏంటని వారిని అడిగితే…ఎక్కువ మంది చెప్పే జవాబు ఒక్కటే. ఆ సమాధానం ఏమై ఉంటుందనుకుంటున్నారు?
అభిమానుల సమాధానం లో ఉన్నది..పెద్ద స్టార్ హీరోల కమర్షియల్ జోష్ కాదు, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు కావు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ఆకాశాన్నంటిన విస్తరణ అంతకన్నా కాదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ ను షాక్ చేస్తుందని ఏంటంటే..పురాణ కథలను హై ఫాంటసీగా మలచి తెరమీదకు తెచ్చిన సినిమాలు. ఒకప్పుడు కేవలం ప్రాంతీయ భాషల్లో, చిన్న బడ్జెట్‌తో, కొద్దిమంది ప్రత్యేక ప్రేక్షకులకి మాత్రమే చేరే ఈ జానర్… ఇప్పుడు భారతదేశం మొత్తం ఒక్క తాటిపై నిలబడి “ఇంకో షో వేయండి సార్” అని అరుస్తోంది. ఏ రాష్ట్రమైనా, ఏ భాషైనా, ఎనిమిదేళ్ల పసిపాప నుంచి ఎనభై ఏళ్ల తాత వరకు… దేవుడు, దానవుడు, యోధుడు, దేవకన్య తెరమీద కొత్త రూపంలో కనిపిస్తే చాలు… ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సర్వర్లు కూడా అభిమానుల దాటికి కకావికలవుతున్నాయి. ఇదీ ఈ ట్రెండ్ యొక్క అద్భుత శక్తి అనే చెప్పాలి.
ఈ విజయం వెనక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసా! ప్రతీ భారతీయుని డీఎన్ఏ లో కలిసిన మన సంస్కృతి. రామాయణం, మహాభారతం, శివపురాణం, దేవీభాగవతం, విష్ణుపురాణం… ఈ కథలు మనకు పుస్తకాల్లో మాత్రమే కాదు, రక్తంలోనే ప్రవహిస్తున్నాయి. అమ్మమ్మ చెప్పిన హనుమంతుడి బలం, నానమ్మ ఇష్టంగా వినిపించిన ద్రౌపది అగ్నిప్రవేశం, అభిమన్యుడి పద్మవ్యూహం, పండగల్లో బూరెలు తింటూ విన్న కృష్ణ లీలల, మనసు నిండే వినాయక కథలు, చెవులు రెక్కించి మరీ విన్న లవకుశ కథలు.. ఇవన్నీ మన బాల్యంలోనే మనల్ని ఆకట్టుకున్నాయి.
ఇప్పుడు ఆ కథలే అత్యాధునిక విఎఫెక్స్ తో, భారీ మెగా సెట్స్‌తో, గుండెల్ని పిండే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో, శాస్త్రీయ స్క్రీన్‌ప్లేలతో తెరమీద జీవించి ఊపిరి పీల్చుకుంటున్నాయి. చిన్నప్పుడు కళ్లు మూసుకుని ఊహించుకున్న ఆకాశంలో ఎగిరే పుష్పక విమానం… ఇప్పుడు కళ్లు తెరిచి చూస్తే నిజంగానే ఎగురుతోంది. పాత జ్ఞాపకాలు గుండెల్ని తడిమితే… కొత్త టెక్నాలజీ కళ్లను ఆశ్చర్యంతో నింపుతోంది. ఈ రెండు అనుభూతుల కలయికే ఈ జానర్‌ను అమోఘంగా చేస్తోంది.
ఈ సినిమాలు ఎందుకు ప్రాంతీయ గోడలు దాటి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఎందుకంటే ఇందులోని భావాలు విశ్వవ్యాప్తమైనవి. ధర్మం కోసం యుద్ధం, అధర్మాన్ని అంతం చేయడం, ధైర్యం, త్యాగం, పశ్చాత్తాపం, న్యాయ ఇవి ఏ భాషలోనైనా ఒకేలా గుండెల్ని తాకుతాయి. ఒక యువరాజు తన రాజ్యం కోసం పోరాడటం, ఒక మహిళ సమాజ నీతి నియమాలను ప్రశ్నించటం, ఒక దేవత రాక్షస సైన్యాన్ని ధ్వంసం చేయటం… ఈ సన్నివేశాలు తమిళంలోనైనా, తెలుగులోనైనా, హిందీలోనైనా, మలయాళంలోనైనా ఒక్కటే ఉద్వేగాన్ని ఇస్తాయి. అందుకే ఒక సినిమా ఒక రాష్ట్రంలో హిట్టయితే… వారం రోజుల్లోనే మిగతా భాషల్లో కూడా హౌస్‌ఫుల్ బోర్డులు ఎగురుతున్నాయి.
ఈ జానర్ ను ఆడియన్స్ ఇంతగా ఇష్టపడటానికి మరో ముఖ్య కారణం ఆధునిక టెక్నాలజీ. ఒకప్పుడు భారతీయ సినిమా రంగం హై ఫాంటసీ ప్రపంచాల గురించి భయపడేది. ఆకాశంలో ఎగిరే రథాలు, వేల చేతులతో నాట్యం చేసే దేవతలు, సముద్రాలు చీల్చే బాణాలు… ఇవన్నీ నమ్మదగినట్టు చూపించలేకపోయేవారు. ఎంత కష్ట పడ్డా కూడా ఆ కథ ఒక ఊహగానే ప్రేక్షకుల మదిలో ఉండిపోయేది.
ప్రస్తుతం హైదరాబాద్, ముంబై, చెన్నైలోని వరల్డ్ క్లాస్ సిజిఐ స్టూడియోలు హాలీవుడ్‌కు ఏ మాత్రం తగ్గని విజువల్స్ ఇస్తున్నాయి. మోషన్ క్యాప్చర్, హై ఫ్రేమ్ రేట్ షూటింగ్, అత్యంత రియలిస్టిక్ ఎన్విరాన్‌మెంట్స్… ఇవన్నీ కలిసి పురాణ ప్రపంచాన్ని జీవంతంగా తీర్చిదిద్దుతున్నాయి. పర్వత శిఖరాలపై నిలిచిన దేవాలయాలు, ఆకాశంలో జరిగే యుద్ధాలు, వేల సంవత్సరాల క్రితం జరిగిన దివ్య యాగాలు… ఇవన్నీ ఇప్పుడు కళ్ల ముందు నిజంగా జరుగుతున్నట్టు అనిపిస్తాయి. ఇంట్లో ఓటీటీ ఉన్నా… ఈ భారీ అనుభవం కోసం ప్రేక్షకులు మళ్లీ థియేటర్ సీట్లకు పరుగులు పెడుతున్నారు.
ఆర్థికంగా చూస్తే ఇవి నిర్మాతలకు బంగారు బాతులు. పురాణ కథల ఆధారంగా వచ్చే సినిమాలు ఒక రీజియన్‌కే కాకుండా పాన్ ఇండియా కలెక్షన్లు రాబడతాయి. రిస్క్ తక్కువ, లాభాలు ఎక్కువ. అందుకే నిర్మాతలు ఇప్పుడు ధైర్యంగా వందల కోట్లు పెట్టి ఈ జానర్‌పై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు రావడం ఈ జానర్ యొక్క అతి పెద్ద విజయం. ఇప్పుడు థియేటర్ అంటే కేవలం యువత మాత్రమే కాదు… మూడు తరాల వాళ్లు కలిసి ఒకే స్క్రీన్ ముందు కూర్చుని ఆనందంగా ఉంటున్నారు.
ఈ రోజుల్లో సమాజం ఎంతో ఒత్తిడిలో ఉంది. రాజకీయ గొడవలు, సోషల్ మీడియా ట్రోలింగ్, ఆర్థిక ఒడిదొడుకులు… ఇవన్నీ మనసును కుంగదీస్తున్నాయి. అలాంటి సమయంలో పురాణ కథలు మనకు మానసిక శాంతిని, ధైర్యాన్ని ఇస్తున్నాయి. దేవుడు రాక్షసులతో పోరాడి గెలవడం చూస్తే… మన జీవితంలోని చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయని నమ్మకం కలుగుతుంది. ఇవి కేవలం వినోదం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ఔషధం, భావోద్వేగ రక్షాకవచం. ఈ జానర్ భారతీయ సినిమా రంగంలో ఇంకో గొప్ప మార్పు తెచ్చింది… సహకార భావన. తెలుగు దర్శకుడు హిందీ మార్కెట్ కోసం సినిమా తీస్తాడు. తమిళ్ సూపర్‌స్టార్ పాన్ ఇండియా పురాణ కథలో హీరో అవుతాడు. కన్నడ సినిమాటోగ్రాఫర్ భారీ తెలుగు దేవతా చిత్రానికి కెమెరా అందిస్తాడు. మలయాళం రచయిత మరాఠీ దేవుడి కథ రాస్తాడు. ‘ప్రాంతీయ సినిమా’ అనే గీతలు కనుమరుగవుతున్నాయి. ‘ఇండియన్ సినిమా’ అనే ఒకే గొప్ప గుర్తింపు బలంగా నిలుస్తోంది. ఇది రేపటి రోజుల్లో మరింత పెద్ద బడ్జెట్లకు, మరింత విస్తృత మార్కెట్లకు దారి తెరుస్తుంది.
పురాణాలు కథలే కాదు, కోట్ల విశ్వాసాల ప్రతిబింబం.
పాత్రల సారం మార్చితే ప్రేక్షకుల నమ్మకమే దెబ్బతింటుంది.
కేవలం కలెక్షన్ల కోసం కాకుండా భక్తి, పరిశోధనతో సినిమాలు రావాలి.
మార్కెట్ ఓవర్‌లోడ్ అయితే ఆసక్తి తగ్గే ప్రమాదం ఉంది.
సాంస్కృతిక గర్వాన్ని పెంచుతున్న ఈ ట్రెండ్ ఒక కొత్త సినీ యుగం…
