
పురాణాపూల్‌లో ఆలయ విగ్రహ ధ్వంసం: నిందితుడు అరెస్ట్
హైదరాబాద్ నగరంలోని పురానాపూల్ మైసమ్మ ఆలయ ఆవరణలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు కేవలం 24 గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకోవడం విశేషం.
ఘటన వివరాలు
బుధవారం రాత్రి పురానాపూల్ దర్వాజా వద్ద ఉన్న మైసమ్మ ఆలయ వరండాలో ఒక ఫ్లెక్సీ బ్యానర్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాన్ని ఒక దుండగుడు ధ్వంసం చేశాడు. ఈ విషయం తెలియడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు భారీగా తరలిరావడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో జరిగిన రాళ్లదాడిలో నలుగురు పోలీసు సిబ్బంది గాయపడగా, ఒక వర్గానికి చెందిన మతపరమైన కట్టడం కూడా దెబ్బతింది.
పోలీసుల దర్యాప్తు
హైదరాబాదు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పూరణాపూల్ దర్వాజా మైసమ్మ మందిరం ఘటనలో దోషిగా ఉన్న అనుమానితుడిని 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. విగ్రహ ధ్వంసం, పోలీసులపై దాడికి సంబంధించి కామటిపురా పోలీస్ స్టేషన్‌లో గురువారం రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయని. గర్భాలయంలోని ప్రధాన విగ్రహాలు సురక్షితంగా ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు ప్రధాన ఆలయంలోకి ప్రవేశించలేదు. మూలవిరాట్ ధ్వంసమైందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం వదంతులు మాత్రమే అని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ నేరుగా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు.
సీసీటీవీ ఫుటేజ్, వీడియోల ఆధారంగా పోలీసులపై దాడి చేసిన వారిని కూడా గుర్తించారు. నిందితుడిని ప్రస్తుతం విచారిస్తూ మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం పురానాపూల్ ప్రాంతంలో పరిస్థితి ప్రశాంతంగా అదుపులో ఉందని, ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
పురానాపూల్ ఘటనపై వీహెచ్ ఆందోళన
నగరంలోని పురానాపూల్ మా దుర్గాదేవి ఆలయంపై జరిగిన దాడి, విగ్రహాల ధ్వంసం ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు (వీహెచ్) తీవ్రంగా స్పందించారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ దుశ్చర్యపై ఆయన పోలీసుల పనితీరును ప్రశ్నిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు.
మూర్తులపై జరిగిన ధ్వంసం కారణంగా కలిగిన ఆందోళన... ఇలాంటి విషయాల్లో కొన్ని సార్లు తీసుకునే విస్మరణ కారణంగా ప్రభావం ప్రతిచోటా వ్యాపిస్తుంది, దీని వల్ల చట్ట-వ్యవస్థ సమస్యలు ఉత్పన్నమవుతాయని హనుమంతరావు అన్నారు. నిందితులు ఎవరైనా సరే, వారు ఏ వర్గానికి చెందిన వారైనా వదలకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కావని పేర్కొన్నారు.ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, ప్రజల మధ్య ఘర్షణలు తలెత్తకుండా శాంతిభద్రతలను కాపాడాలని కోరారు.
అదనపు పోలీస్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్ - సౌత్ రేంజ్) తఫ్సీర్ ఇక్బాల్ ఈ ఘటనపై మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు.అసాంఘిక శక్తులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, నిందితులకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలు లభించాయని వివరించారు. ముందు జాగ్రత్త చర్యగా సున్నితమైన ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించామని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని లేదా వదంతులను ప్రజలు నమ్మవద్దని, శాంతిని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
