
పునర్విభజన జాతీయ ఐక్యత కోసమే ఉండాలి: ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రతిపాదనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరించాలని భావిస్తున్న ఏకపక్ష విధానం దేశంలోని ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య రాజకీయ అంతరాన్ని పెంచుతుందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన 'జీఎస్‌డీపీ ఆధారిత హైబ్రీడ్ మోడల్'ను తెరపైకి తెచ్చారు. ఈ ప్రక్రియ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, దేశ సమగ్రతను దృష్టిలో ఉంచుకుని సాగాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని తాము సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని, అయితే దానిని నియోజకవర్గాల పెంపుతో ముడిపెట్టడం సరికాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లు, లోక్‌సభ స్థానాల పునర్విభజన అనేవి రెండు వేర్వేరు అంశాలని, వీటిని కలిపి చూడకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రధానిని ఉద్దేశించి పలు ఆందోళనలను పంచుకున్నారు. కేంద్రం ప్రతిపాదించినట్లుగా ప్రస్తుతం ఉన్న సీట్లకు దామాషా ప్రకారం 50 శాతం సీట్లు పెంచితే, అది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ఉనికిని దెబ్బతీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ పెంపును ఒకే ప్రాతిపదికన కాకుండా రెండు భాగాలుగా విభజించాలని ఆయన సూచించారు. మొత్తం పెరుగనున్న 272 సీట్లలో 136 సీట్లను ప్రస్తుత జనాభా ప్రాతిపదికన కేటాయించాలి. మిగిలిన 136 సీట్లను దేశ స్థూల ఆర్థిక ఉత్పత్తి ఆధారంగా కేటాయించాలని ఆయన ప్రతిపాదించారు.
దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ల అమలుపై ఏకాభిప్రాయం ఉందని, ముఖ్యంగా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఈ కోటాను తక్షణమే అమలు చేస్తే దేశమంతా స్వాగతిస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే, మహిళా రిజర్వేషన్లను ఒక సాకుగా చూపిస్తూ, జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాల పునర్విభజనను నెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపడితే, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు, చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇది స్వల్పకాలంలో బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చవచ్చు కానీ, దీర్ఘకాలంలో దేశ సమాఖ్య స్ఫూర్తిని బలహీనపరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
లోక్‌సభ స్థానాల కేటాయింపులో కేవలం జనాభా సూత్రాన్నే కాకుండా, ఇతర శాస్త్రీయ నమూనాలను పరిశీలించాలని ఆయన సూచించారు. ఇంతటి కీలకమైన నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలని, జాతీయ ఏకాభిప్రాయాన్ని సాధించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే మిన్న. సమాఖ్య సమతుల్యత దెబ్బతినకుండా, అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా చూడటం కేంద్రం బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
ఈ విధానం ద్వారా దేశ అభివృద్ధికి ఎక్కువగా తోడ్పడుతున్న రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. లేకపోతే ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య రాజకీయ అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే ఆర్థికంగా ముందున్న దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా వెనుకబడే పరిస్థితి తలెత్తవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
జనాభా లెక్కల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, 2028 నాటికి పూర్తవుతుందని సీఎం గుర్తు చేశారు. ఈ సమయంలో హడావిడిగా నిర్ణయాలు తీసుకోవడం దేశానికి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాల పెంపు, పునర్విభజనకు ముందు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు సేకరించాలని ఆయన సూచించారు. అలాగే అఖిలపక్ష సమావేశం నిర్వహించి పారదర్శకంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రతిపాదిత 50 శాతం పెంపు విధానం అమలైతే రాష్ట్రాల మధ్య అసమానతలు తీవ్రంగా పెరుగుతాయని సీఎం వివరించారు. ఉదాహరణకు 20 సీట్లున్న కేరళలో 50 శాతం పెంచితే అవి 60 కి చేరుతాయి. అదే 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్‌లో 120 కి చేరుతాయి. దీనివల్ల రెండు రాష్ట్రాల మధ్య సీట్ల అంతరం భారీగా పెరుగుతుందని, రాజకీయ సమతుల్యత దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు. ఇది చిన్న రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించి, దేశ సమాఖ్య వ్యవస్థపై ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు.
దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, పన్నుల ఆదాయం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల్లో వాటి భాగస్వామ్యం ఎక్కువగా ఉందని సీఎం అన్నారు. అలాంటి రాష్ట్రాలకు రాజకీయంగా తగ్గింపు న్యాయం కాదని ఆయన స్పష్టం చేశారు. దేశం రాజకీయ రాజధానులు, ఆర్థిక రాజధానులుగా విడిపోకూడదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా సీట్లు కేటాయించబడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేవలం జనాభా ఆధారంగా కాకుండా సమతుల్యత, అవసరాల ఆధారంగా కూడా ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.
చివరగా, ప్రతిపాదిత హైబ్రిడ్ మోడల్‌ను పరిశీలించాలని కేంద్రాన్ని కోరుతూ, 50 శాతం సీట్లు ప్రొరేటా ప్రకారం, మిగిలిన 50 శాతం జీఎస్‌డీపీ ఆధారంగా కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మహిళా రిజర్వేషన్లను వెంటనే ఆమోదించి, నియోజకవర్గాల పెంపు అంశంపై విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. భారతదేశం వంటి వైవిధ్యమైన ప్రజాస్వామ్యంలో ఏ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్న భావన కలిగినా అది దేశ ఐక్యతకు ముప్పుగా మారుతుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, నిష్పాక్షికత, సమగ్రతతో ఈ ప్రక్రియ సాగాలని ఆయన పునరుద్ఘాటించారు.
