Let's talk: editor@tmv.in
పుదుచ్చేరిలో హీటెక్కిన రాజకీయం

పుదుచ్చేరిలో హీటెక్కిన రాజకీయం

Pinjari Chand
30 మార్చి, 2026

రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో లట్చియా జననాయక కట్చి (ఎల్‌జేకే) అభ్యర్థి జోస్‌ ఛార్లెస్‌ మార్టిన్‌పై కాంగ్రెస్ నాయకురాలు డాలీ శర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. లాటరీ పథకాల పేరుతో మొత్తం కేంద్రపాలిత ప్రాంత ప్రజలను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఆదివారం ఏఎన్ఐతో మాట్లాడిన డాలీ శర్మ ఇక్కడి ప్రజలను మోసం చేయడమే వీరి లక్ష్యం. ప్రస్తుత ప్రభుత్వం ఏమీ చేయలేదు. పుదుచ్చేరిలో జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ పాలనలోనే జరిగిందని పేర్కొన్నారు.

ఇదే సమయంలో ఈ ఆరోపణలకు ప్రతిస్పందించిన జోస్ చార్లెస్ మార్టిన్, కాంగ్రెస్‌పై ప్రతివిమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ పై విమర్శలు చేస్తూ సిస్టమ్‌ను అవినీతితో కలుషితం చేసింది కాంగ్రెస్ పార్టీ. 2జీ వంటి కుంభకోణాలు అందరికీ తెలుసు. అలాంటి పార్టీకి ఇతరులపై ఆరోపణలు చేసే నైతిక హక్కు లేదని అన్నారు. ఇక ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ, ఎన్డీయే కూటమి ఈసారి విజయం సాధిస్తుందని, ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి నాయకత్వంలో 25 స్థానాలు గెలుచుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి. 30 సభ్యుల అసెంబ్లీ గడువు జూన్ 15తో ముగియనుంది. గత ఎన్నికల ఫలితాలపై ఒకసారి చూస్తే, 2021లో ఏఐఎన్‌ఆర్‌‌సీ అతిపెద్ద పార్టీగా 10 స్థానాలు గెలుచుకోగా, డీఎంకే 6 స్థానాలు, బీజేపీ, కాంగ్రెస్ తలా 6 స్థానాలు సాధించాయి. అప్పట్లో ఓటింగ్ శాతం 84.8గా నమోదైంది. 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ 15 స్థానాలతో స్పష్టమైన మెజారిటీ సాధించగా, ఎఐఎన్‌ఆర్‌సీ 8, ఎఐఏడీఎంకే 4, డీఎంకే 2 స్థానాలు గెలుచుకున్నాయి. ఆ ఎన్నికల్లో 83.6 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంగా, పరస్పర ఆరోపణలు–ప్రత్యరోపణల మధ్య పుదుచ్చేరి ఎన్నికల పోరు వేడెక్కుతోంది.

పుదుచ్చేరిలో హీటెక్కిన రాజకీయం - Tholi Paluku