Let's talk: editor@tmv.in
పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఎందుకు కల్పించలేదు: విజయ్

పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఎందుకు కల్పించలేదు: విజయ్

Pinjari Chand
5 ఏప్రిల్, 2026

పుదుచ్చేరిలో అధికార, ప్రతిపక్ష కూటములు రెండూ ప్రజల ఆశలను నెరవేర్చలేకపోయాయని టీవీకే నేత విజయ్‌ విమర్శించారు. తన పార్టీ తమిళ వెట్రి కజగం ను విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా నిలబెడుతూ పూర్తి రాష్ట్ర హోదా సాధనకు 100 శాతం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం పుదుచ్చేరిలో నిర్వహించిన సభలో మాట్లాడారు. అధికారంలో ఉన్న ఆల్‌ఇండియా ఎన్‌.ఆర్‌‌ కాంగ్రెస్‌ (ఏఐఎన్‌ఆర్‌సీ)బీజేపీ కూటమిని ‘అలసిపోయిన కూటమి’గా, ప్రతిపక్ష డీఎంకే– కాంగ్రెస్ కూటమిని గందరగోళ కూటమిగా అభివర్ణించారు. తమిళనాడులో ఉన్నట్లే పుదుచ్చేరిలో కూడా డీఎంకే–కాంగ్రెస్ కూటమి అంతర్గత విభేదాలతో ఉందని, కొన్ని నియోజకవర్గాల్లో ఒకరినొకరు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. మరోవైపు ఏఐఎన్‌ఆర్‌సీ–బీజేపీ కూటమి ఐక్యంగా కాకుండా తరచూ విభేదాలతో కొనసాగుతోందని విమర్శించారు.

పుదుచ్చేరికి పూర్తి రాష్ట్ర హోదా ఇప్పటివరకు ఎందుకు కల్పించలేదని విజయ్ ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఈ డిమాండ్‌ను అమలు చేయలేదని అన్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం సుష్మా స్వరాజ్‌ నేతృత్వంలోని కమిటీ రాష్ట్ర హోదాను సిఫార్సు చేసినప్పటికీ అది అమలు కాలేదని గుర్తు చేశారు. టీవీకే అధికారంలోకి వస్తే లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం లేకుండా పూర్తి రాష్ట్ర హోదా సాధించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రజా పంపిణీ వ్యవస్థ దెబ్బతింది

అలాగే పుదుచ్చేరిలో ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్ వ్యవస్థ) దెబ్బతిన్నదని ఆయన విమర్శించారు. భవన యజమానులకు అద్దె చెల్లించకపోవడంతో అనేక రేషన్ దుకాణాలు సంవత్సరాలుగా మూసివేశారని పేర్కొన్నారు. గోధుమలు, చక్కెర, నూనె వంటి ముఖ్య సరుకుల పంపిణీ దాదాపు ఐదేళ్లుగా నిలిచిపోయిందని, రేషన్ దుకాణాల సిబ్బందికి కూడా జీతాలు చెల్లించలేదని ఆరోపించారు. టీవీకే అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. అలాగే పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వైద్య బీమా, గర్భిణీలకు రూ.25,000 ఆర్థిక సాయం, మత్స్యకారులకు డీజిల్‌పై రూ.20 సబ్సిడీ అందిస్తామని తెలిపారు. అదనంగా ‘పుదుచ్చేరి యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అండ్ ఆర్ట్స్’ను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. విజయ్ సభకు ముందు నగరంలో భారీ రోడ్‌షో నిర్వహించారు. వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు పార్టీ జెండాలతో నినాదాలు చేస్తూ ఆయనకు ఘన స్వాగతం పలికారు. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు ఏప్రిల్‌ 9న జరగనున్నాయి.