
పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి యత్నం!
రష్యా రాజధాని మాస్కోకు ఉత్తరాన ఉన్న నొవ్‌గోరోడ్ ప్రాంతంలోని అధ్యక్షుడు పుతిన్ అధికారిక నివాసంపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడికి ప్రయత్నించిందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు. ఆదివారం అర్ధరాత్రి సుమారు 91 లాంగ్ రేంజ్ డ్రోన్లు పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని, అయితే రష్యా రక్షణ వ్యవస్థలు వాటన్నింటినీ కూల్చివేశాయని ఆయన తెలిపారు. ఈ దాడి వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని రష్యా స్పష్టం చేసింది.
టెలివిజన్ ప్రసంగంలో లావ్రోవ్ మాట్లాడుతూ, ఈ దాడి శాంతి చర్చలను భగ్నం చేయాలనే ఉద్దేశంతో ఉక్రెయిన్, దాని మిత్రదేశాలు చేసిన ప్రయత్నమని ఆరోపించారు. ఈ దాడికి రష్యా తగిన సమయంలో తగిన విధంగా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు. ప్రతీకార చర్యలకు సంబంధించిన సమయం, లక్ష్యాలు ఇప్పటికే నిర్ణయించుకున్నామని కూడా ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటన గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారని క్రెమ్లిన్ విదేశాంగ విధాన సలహాదారు యూరీ ఉషాకోవ్ తెలిపారు. పుతిన్ నివాసంపై దాడి యత్నం గురించి తెలుసుకున్న అధ్యక్షుడు ట్రంప్ షాక్‌కు గురయ్యారని రష్యా మీడియా పేర్కొంది. అయితే ఈ ఘటన జరిగినప్పటికీ ఉక్రెయిన్‌తో జరుగుతున్న శాంతి చర్చల నుంచి తప్పుకునే ఉద్దేశం తమకు లేదని లావ్రోవ్ స్పష్టం చేశారు. అయితే చర్చలపై తమ వైఖరిని పునఃసమీక్షిస్తామని చెప్పారు.
ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ
ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడి నివాసాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకరమని, యుద్ధాన్ని ముగించడానికి దౌత్యపరమైన చర్చలే సరైన మార్గమని ఆయన పేర్కొన్నారు. శాంతి ప్రయత్నాలకు ఆటంకం కలిగించే చర్యలకు ఏ పక్షం కూడా పాల్పడకూడదని ఆయన 'ఎక్స్’ ద్వారా కోరారు.
రష్యా ఆరోపణలను తిరస్కరించిన జెలెన్‌స్కీ
మరోవైపు రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్‌స్కీ ఖండించారు. పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి జరిగిందన్న వార్తలు పూర్తిగా కల్పితమని ఆయన అన్నారు. శాంతి ప్రయత్నాలను దెబ్బతీయడానికే రష్యా ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఉక్రెయిన్ ఎప్పుడూ దౌత్య ప్రయత్నాలను అడ్డుకునే చర్యలు చేయదని స్పష్టం చేశారు. ఈ కథనాలను అడ్డం పెట్టుకుని రష్యా ఉక్రెయిన్‌పై మరిన్ని దాడులకు చేయాలని చూస్తోందని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు.
దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
రష్యా అధ్యక్షుడి నివాసంపై దాడి యత్నాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తీవ్రంగా ఖండించింది. ఈ దాడి భద్రత, స్థిరత్వానికి ముప్పుగా మారుతుందని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యా ప్రభుత్వం, ప్రజల పట్ల తమ సంఘీభావాన్ని ప్రకటిస్తూ, హింసాత్మక చర్యలన్నింటినీ యూఏఈ ఖండిస్తుందని స్పష్టం చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత ఉద్రిక్తతకు దారితీయవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రపంచ నేతలు శాంతి చర్చలే ఏకైక పరిష్కారమని మరోసారి నొక్కి చెబుతున్నారు.
