Let's talk: editor@tmv.in
పుణేలో బంగ్లాదేశ్ ఫుడ్ స్టాల్‌ ధ్వంసం

పుణేలో బంగ్లాదేశ్ ఫుడ్ స్టాల్‌ ధ్వంసం

Pinjari Chand
12 ఫిబ్రవరి, 2026

బంగ్లాదేశ్ భారతదేశం పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక ధోరణులకు నిరసనగా బీజేవైఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనలో ఓ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న కల్చరల్ ఫెస్టివల్ లో బీభత్సం సృష్టించి, బంగ్లా జాతీయ పతాకాన్ని దహనం చేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పుణేలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో నిర్వహించిన వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్ సందర్భంగా బంగ్లాదేశ్ ఫుడ్ స్టాల్‌ను బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు ధ్వంసం చేశారు. పొరుగు దేశ జాతీయ పతాకాన్ని దహనం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్సిటీ ప్రాంగణంలో వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు ఏర్పాటు చేసిన ఆహార స్టాల్స్‌లో భాగంగా బంగ్లాదేశ్ స్టాల్ కూడా ఉంది. కార్యక్రమం అనంతరం కొందరు అనుమతి లేని వ్యక్తులు క్యాంపస్‌లోకి ప్రవేశించి ఈ ఘటనకు పాల్పడ్డారని యూనివర్సిటీ రిజిస్ట్రార్ గణేష్ పోకలే ఒక ప్రకటనలో తెలిపారు. ఘటనపై అధికారిక ఫిర్యాదు నమోదు చేసే ప్రక్రియలో ఉన్నామని చెప్పారు. కోత్రుడ్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ సందీప్ దేశ్మానే ఘటన జరిగినట్లు ధృవీకరించారు. దర్యాప్తు కొనసాగుతోందని మాత్రమే తెలిపారు.

పుణే నగర బీజేవైఎం అధ్యక్షుడు దుష్యంత్ మొహోల్ మాట్లాడుతూ, బంగ్లాదేశ్ ప్రస్తుత ‘యాంటి-ఇండియా’ వైఖరిని ఉటంకిస్తూ, స్టాల్ వద్ద ప్రదర్శించిన జెండాను తొలగించాలని స్థానిక విద్యార్థులు కోరినట్లు చెప్పారు. అయితే స్టాల్ నిర్వాహకులు మరో జెండా ప్రదర్శించడంతో ఆగ్రహం వ్యక్తమై స్టాల్‌ను ధ్వంసం చేసి జెండాను దహనం చేశామని అంగీకరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బుధవారం బీజేవైఎం కార్యకర్తలు రోడ్డుపై బంగ్లాదేశ్ జెండా చిత్రాన్ని వేయడం, నినాదాలు చేయడం కూడా వివాదాస్పదంగా మారింది. యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులందరికీ భద్రతా, గౌరవప్రద, సమగ్ర వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉందని పేర్కొంది. ఘటనపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశముంది.