
పుట్టపర్తిలో రాష్ట్ర స్థాయి వేడుకలుగా శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలు
భారత గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు శ్రీ సత్య సాయి జిల్లా కేంద్రానికి బుధవారం ఉదయం 9-50 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. పుట్టపర్తి విమానాశ్రయం వద్ద భారత ప్రధానమంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు మర్యాదపూర్వకంగా మోడి ని కలిసి పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.
అనంతరం భారత ప్రధాన మంత్రి పుట్టపర్తి విమానాశ్రయం నుండి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా మహా సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు బయలుదేరి వెళ్లారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం సాయి కుల్వంత్ హాల్ లో భగవాన్ శ్రీ సత్యసాయి మహా సమాధిని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా మహా సమాధి వద్ద, బంగారు విగ్రహం వద్ద ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయిబాబా జయంతి సందర్బంగా, రైతులకు అందించే గోదాన కార్యక్రమం లోభాగంగా నలుగురు రైతులకు గోదానం చేశారు. అనంతరం పేద పండితులచే ఆశీర్వచనాలు తీసుకున్నారు.
అనంతరం హిల్ వ్యూ స్టేడియంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ , ఐశ్వర్య రాయ్ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంటి పలువురు కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులుతో పాటు దేశీయ, అంతర్జాతీయ భక్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సమావేశం లో ముఖ్య మంత్రి చంద్రబాబు మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా విశిష్ట సేవా కార్యక్రమాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ..
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రత్యక్ష దైవ స్వరూపం
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మన కాలంలో ప్రత్యక్ష దైవ స్వరూపంగా ప్రజలకు ప్రేమ, సేవ, శాంతి, సౌభాగ్యం మార్గాన్ని చూపించిన మహానుభావుడు. “అందరినీ ప్రేమించు, అందరికీ సాయం చెయ్యి, ఎవరిని నొప్పించకు” అనే ఆయన మహావాక్యాలు ఈ ప్రపంచానికి విశ్వ శాంతి, సర్వజన సుఖాయ అనే ఆయన సంకల్పాన్ని ప్రతిబింబిస్తాయి.ఈ పుణ్యభూమి పుట్టపర్తిలో నేడు జరుగుతున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా ప్రకటించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాం అన్నారు.
బాబా నమ్మింది ఒకటే. మానవ సేవే మాధవ సేవ. అదే ఆయన జీవితం, అదే ఆయన సందేశం. ఒకే కులం,ఒకే భాష,ఒక్కడే దేవుడు అని చెప్పిన ఆయన మాటలు ప్రపంచం నలుమూలలా కోట్లాది మందిని ప్రభావితం చేశాయి.
నాస్తికులను కూడా ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించిన సత్యసాయి సమ్మోహన శక్తి ప్రపంచంలో అరుదైనది. వందలాది దేశాల నుంచి వచ్చిన భక్తులందరికీ ఆయన దివ్య అనుగ్రహం లభించింది. పేద నుండి అగ్రకులాలదాకా, సామాన్యుల నుండి ప్రపంచ నాయకులదాకా అందరి బాధలు వినడం, పరిష్కార మార్గం చూపడం ఆయన ధర్మమైంది. సత్యసాయి సంస్థల ద్వారా అందుతున్న సేవలు ప్రపంచంలో ఏ సంస్థలతో పోలిస్తే ప్రత్యేకమై, విశిష్టమై ఉంటాయన్నారు. వాటిని ప్రస్తావిస్తూ …
వేర్వేరు దేశాలు వేర్వేరు ప్రాంతాల ప్రజలను మనో దర్శనంతో ప్రభావితం చేశారు. మానవ సేవే మాధవ సేవ అనే ఆయన భావనతో శ్రీసత్యసాయి భక్తులు మానవాళికి సేవలు అందిస్తున్నారు. భక్తుల్ని ఎంతో ప్రేమగా ‘బంగారూ’... అంటూ ఆయన పిలిచే పిలుపు ఎప్పటికీ గుర్తుంటుంది. బాబాతో నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ట్రస్ట్ కార్యక్రమాలపై పలుమార్లు నాతో చర్చించారు. విలువలతో కూడిన విద్యను 1వ తరగతి నుంచి ఉన్నత విద్య వరకూ ఉచితంగా అందించారు. ఇంకా ట్రస్ట్ సేవాలని వివరిస్తూ ..
• 102 విద్యాసంస్థలు 60,000 మంది విద్యార్థులకు ఉచిత, విలువల ఆధారిత విద్య అందించారు.
• సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, 2 జనరల్ హాస్పిటల్స్, 2 మొబైల్ హాస్పిటల్స్ రోజుకు 3,000 మందికి పైగా రోగులకు ఉచిత వైద్యం జరుగుతుంది.
• త్రాగునీటి కోసం 550 కోట్లు ఖర్చుచేసి ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 1600 గ్రామాలకు నీటి సరఫరా 30 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది.
• 140 దేశాల్లో 2000 కేంద్రాల ద్వారా సేవలు అందిస్తూ 7.5 లక్షల సత్యసాయి సేవాదళ్ సభ్యులు ఉన్నారు.
• చెన్నై డ్రింకింగ్ వాటర్ మోడరనైజేషన్ స్కీంకు 250 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్నారు.
బాబా ప్రజాసేవలో చూపిన వేగం, ఆయన సంకల్ప శక్తి, ఆయన కరుణామూర్తి స్వభావం ప్రపంచానికి ఆదర్శం. పేదల కోసం, నీటి కోసం, ఆరోగ్య కోసం, విద్య కోసం చేసిన సేవలకు ఎటువంటి సాటిలేదు. ఈ శతజయంతి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం భగవాన్ సత్యసాయి బాబాకు గౌరవార్ధంగా ప్రత్యేక రు.100 నాణెం, పోస్టల్ స్టాంపులను విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందని.... ఇందుకు గాను కేంద్రప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు అన్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ మహోత్సవానికి స్వయంగా హాజరై ఆశీస్సులు పొందడం, బాబాతో ఆయనకు ఉన్న ఆత్మీయ బంధాన్ని వెల్లడిస్తుంది. ఆయన పాల్గొనడం సత్యసాయి సిద్ధాంతానికి, సేవా కార్యక్రమాలకు మరింత శక్తి నింపిందని తెలిపారు.
మనందరం కలిసి బాబా బోధించిన ప్రేమ, సేవ, ధర్మం, శాంతి సిద్ధాంతాలను మరింత విస్తరించాలి. సత్యసాయి ట్రస్ట్, సేవాదళ్, భక్తులు అందరూ కలిసి భవిష్యత్ తరాలకు ఆయన మార్గాన్ని చేరవేయాలి. ఈ పవిత్ర సందర్భంలో నేను భగవాన్ శ్రీ సత్యసాయి బాబాను ప్రార్థిస్తున్నాను. చివరగా ముఖ్యంగా నా పట్ల, గౌరవప్రదమైన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పట్ల, ప్రజాసేవలో మరింత నిబద్ధతతో పనిచేయగలిగే శక్తి ప్రసాదించాలని, ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
భారత రత్న, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ ..
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి మహోత్సవంలో పాల్గొన్న భారత రత్న సచిన్ టెండూల్కర్ గారు బాబా పట్ల తనకున్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని, దివ్యానుభూతులను ఎంతో హృదయపూర్వకంగా పంచుకున్నారు. ఆయన సందేశం భక్తులను కదిలించేలా, బాబా మహిమను ప్రతీ హృదయంలో మళ్లీ ముద్రించేలాగా నిలిచింది.
సత్యసాయి బాబాకు నా ప్రణామాలు. ఆయన నాకు చిన్నతనం నుంచే ఒక దైవసంబంధం లాంటి అనుభూతిని ఇచ్చార”ని తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ చెప్పారు
"నాకు ఐదేళ్ల వయసులో ఉండగా ఎక్కడికైనా వెళ్లినా ‘ఈ బాలుడు బాల సత్యసాయి బాబాలా ఉన్నాడు’ అని అందరూ చెప్పేవారు. ఆ మాటలు అప్పట్లో వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా, తరువాత బాబాతో ఏర్పడిన అనుబంధం ఆ మాటలకు అర్థం చూపింది.”
1990లలో వైట్‌ఫీల్డ్‌లో భగవాన్ సత్యసాయి బాబా దర్శనం పొందిన సందర్భాన్ని సచిన్ గారు ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటూ "మనం అడగకపోయినా మన మనసులో ఏముందో, ఏ సందేహం వుందో బాబా ముందుగానే చెప్పేవారు. ఇది నమ్మశక్యం కాకపోయినా… నేను అనుభవించిన సత్యం.” శారీరక, మానసిక ఆరోగ్యంపై బాబా ఇచ్చిన బోధనలు తన జీవితాన్ని ప్రభావితం చేశాయని తెలిపారు.
2011 వరల్డ్ కప్‌కు సంబంధించిన తమ జీవితంలో మరచిపోలేని ఘట్టాన్ని ఆయన పంచుకున్నారు. “ఆ వరల్డ్ కప్ సమయంలో అపారమైన అంచనాలు, ఒత్తిడి ఉండేవి. బెంగళూరులో మా క్యాంప్ జరుగుతున్నప్పుడు బాబా ఫోన్ చేసి, ఒక పుస్తకం పంపించానని చెప్పారు. ఆ పుస్తకం నాలో అనూహ్యమైన విశ్వాసాన్ని రగల్చింది” అని సచిన్ అత్యంత భావోద్వేగంతో గుర్తుచేశారు.
2011లో ముంబైలో ఇండియా, శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్‌లో భారత జట్టు గెలిచి ట్రోఫీ అందుకున్నప్పుడు… అది నా జీవితంలో గోల్డెన్ మూమెంట్. అనుభవం చెప్పింది, ఇది బాబా ఆశీస్సుల వల్లే సాధ్యమైంది.” ఆ విజయంతో బాబా తనకు అంతర్గత శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం ప్రసాదించారని తెలిపారు.“బాబా మన వెంట ఉంటే భయం అనే మాటనే ఉండదు. ఆయనను స్మరించడం ఒక ఆశీర్వాదం.” అన్నారు.
ఈ శతజయంతి వేడుకల్లో పాల్గొనడం తనకు ఒక గొప్ప సత్కారం, అదృష్టం, ఆధ్యాత్మిక అనుభూతి అని “బాబా ఆశీస్సులు ఎప్పుడూ మనతో ఉన్నాయి… మమ్మల్ని నడిపిస్తున్నాయి.” అని సచిన్ తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..
భగవాన్ సత్యసాయి భక్తులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఓ హాలివుడ్ నటుడు ఆయన్ను దర్శించేందుకు ఇక్కడికి రావటం నన్ను ఆశ్చర్యపరిచింది. అత్యంత వెనుకబడిన జిల్లాలో పుట్టిన భగవాన్ సత్యసాయి ఆద్యా త్మిక తేజస్సు, విశ్వప్రేమ ఉన్న వ్యక్తి. ఈ ప్రాంతంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు బాబా కృషి చేశారు అన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన జల్ జీవన్ మిషన్ తరహాలోనే ఆయన ఈ ప్రాంత దాహార్తి తీర్చారు. జల్ జీవన్ మిషన్ కు అంకురమే ఆయన చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ప్రభావితం చేసిన ఆధ్యాత్మిక వేత్త ఆయన అని తెలిపారు.
ఐశ్వర్య రాయ్ భక్తిపూర్వక నివాళి
నటి, మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మ శత జయంతి వేడుకల్లో హృదయపూర్వకమైన ఆధ్యాత్మికంగా నివాళులర్పించారు. అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె అత్యంత గౌరవప్రదమైన స్థానంలో తన ప్రసంగాన్ని ప్రారంభించడానికి ముందు వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాదాలను తాకి, తన గౌరవాన్ని వ్యక్తం చేశారు. ఆమె ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఐశ్వర్య తన ప్రసంగంలో ఆధ్యాత్మిక గురువు యొక్క శాశ్వతమైన బోధనలకు నివాళులర్పించారు, నిజమైన నాయకత్వం సేవలో ఉందని, మానవ సేవయే దైవ సేవ అని ఆయన నమ్మకమని చెప్పారు. అర్ధవంతమైన, ప్రయోజనకరమైన ఆధ్యాత్మికంగా స్థిరపడిన జీవితానికి అవసరమైన లక్షణాలుగా ఆయన తరచుగా వివరించే ఐదు 'డి' ల యొక్క బాబా సుప్రసిద్ధ తత్వాన్ని ఆమె ప్రేక్షకులకు గుర్తు చేశారు. క్రమశిక్షణ (డిసిప్లేన్) అంకితభావం (డెడికేషన్), భక్తి (డివోషన్), దృఢ సంకల్పం (డెటెర్మినేషన్), విచక్షణ (డిస్ క్రిమి నేషన్) ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు మార్గదర్శక సూత్రాలుగా మిగిలిపోయాయని ఆమె అన్నారు.
ఐటి మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ..
భగవాన్ శ్రీసత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనటం నా ఆదృష్టం. ప్రశాంతి నిలయం ప్రశాంతతకు నిలయం. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని సేవే కులం, సమానత్వమే మన మతం గా శ్రీసత్యసాయి బోధించారు. జీవితాన్నే పాఠంగా నేర్పారు భగవాన్ సత్యసాయి. దానిని మనమంతా ఆచరించాలి. ఆధ్యాత్మికతకు గ్లోబల్ బీకాన్ గా పుట్టపర్తి ఎదిగింది. విద్య, వైద్యం అందరికీ అందించేలా సేవా మార్గాన్ని విశ్వవ్యాప్తం చేశారు. సురక్షితమైన తాగునీటి ప్రాజెక్టును చేపట్టి ఈ ప్రాంతంలో దాహార్తిని తీర్చారు. పేదలకు ప్రేమతో సాయం అందించాలని బాబా చెప్పిన సూక్తే నాకు ఆదర్శం అన్నారు. విద్య సంస్కరణల ద్వారా విద్యార్ధుల్ని యువతను తీర్చిదిద్దేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. సేవతో ప్రజలకు దేవుడు అయ్యారు భగవాన్ సత్యసాయి అన్నారు.
