Let's talk: editor@tmv.in
పుకార్లు వ్యాప్తి చేయొద్దు: సీఎం స్టాలిన్

పుకార్లు వ్యాప్తి చేయొద్దు: సీఎం స్టాలిన్

Pinjari Chand
30 సెప్టెంబర్, 2025

తమిళ వెట్రి కళగం వ్యవస్థాపకుడు, నటుడు విజయ్​ ప్రచార ర్యాలీ సందర్భంగా కరూర్​ లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి సోషల్ మీడియాలో పుకార్లను వ్యాప్తి చేయొద్దని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్​ హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన సోమవారం ‘ఎక్స్​’లో పోస్ట్​ చేశారు. ఈసందర్భంగా సీఎం స్టాలిన్​ ప్రతి ఒక్కరూ ఈ విషాద సమయంలో సంయమనం పాటించాలని, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు. కరూర్​ విషాదానికి సంబంధించి సోషల్‌మీడియాలో లేనిపోని వీడియోలు పెట్టవద్దని సూచించారు. అనవసర విషయాలు వ్యాప్తిచేస్తే సొంతపార్టీ వారినైనా వదలబోమని ఈ సందర్బంగా కఠినంగా హెచ్చరించారు. అలాగే బాధితులు ఏ పార్టీకి చెందిన వారైనా తనకు పట్టింపు లేదని, వారందరూ తనకు అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములేనని వ్యాఖ్యానించారు. ఇలాంటి విషాద ఘటనలు పునరావృత్తం కాకుండా చూసుకోవడం అందరి బాధ్యత అని తెలిపారు. తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ వేసిన ఏకసభ్య కమిషన్​ జస్టిస్ అరుణా జగదీశన్ నివేదిక వచ్చిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు.

41 చేరిన మృతుల సంఖ్య

కరూర్ తొక్కిసలాట సంఘటనలో 18 మంది మహిళలు, 10 మంది పిల్లలు, 13 మంది పురుషులు సహా మృతుల సంఖ్య 41కి చేరింది. మృతుల్లో కరూర్ జిల్లాకు చెందిన 34 మంది బాధితులు,ఈ రోడ్,తిరుప్పూర్, దిండిగల్ జిల్లాలకు చెందిన ఇద్దరు,సేలం జిల్లాకు చెందిన ఒకరు ఉన్నారు. అయితే మృతుల కుటుంబాలకు విజయ్​ రూ.20 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొరికి రూ.10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.లక్ష సాయం ప్రకటించింది. కేంద్రం ప్రభుత్వం కూడా మృతులకు ఒక్కొరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించింది.

పార్టీ ముఖ్యులతో విజయ్​ వీడియో కాన్ఫరెన్స్​

కరూర్​ సంఘటన తరువాత టీవీకే నాయకుడు విజయ్​ చెన్నైలోని తన నివాసానికి బయల్దేరిన విషయం తెలిసిందే. అయితే సోమవారం పట్టినపాక్కం పెంట్ హౌస్​ నుంచి పార్టీ ముఖ్యులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. తదుపరి తీసుకోవాల్సిన నిర్ణయాలను గురించి మాట్లాడారు. బస్సుయాత్రను కొనసాగిద్దామా? లేకుంటే ప్రజా ఆగ్రహం చల్లారేవరకు వేచి చూద్దామా అనే అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు

కరూర్​ తొక్కిసలాట సంఘటన తరువాత ఇంతవరకు విజయ్​ బాధితులను పరామర్శించలేదు. సోషల్ మీడియాలో మాత్రమే పోస్ట్ పెట్టి సంతాపం, విచారం వ్యక్తం చేశారు. బాధితుల్లో ఆగ్రహావేశాలు పెరుగుతున్నాయి. ఈ సందర్భంలో చెన్నైలోని విజయ్ నివాసమైన నీలంకరైకి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో కలకలం చెలరేగింది. భద్రతను మరింత పెంచారు. పరిసరాలను డాగ్, బాంబ్​ స్వ్కాడ్ లతో ఇంటా,బయటా క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

మద్రాస్​ హైకోర్ట్​ లో టీవీకే పిటిషన్​

కరూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై తమిళవెట్రి కళగం(టీవీకే)సోమవారం మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ లో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఘటనలో తమకు డీఎంకే, తమ అనుచరులపై అనుమానాలున్నాయని, వారే ఈ ఘటనకు కారకులని పిటిషన్ లో ఆరోపించారు. అందువలన కేసును కరూర్ పోలీస్​ స్టేషన్ నుంచి కేంద్రదర్యాప్తు సంస్థకు(సీబీఐ) బదిలీ చేయాలని టీవీకే తరపు న్యాయవాది అరివళగన్ కోరారు. తొక్కిసలాటకు దారి తీసిన వివరాలను, సంబంధిత పత్రాలను జతపరిచారు. అక్టోబర్​ 3 న విచారణకు రానుందని తెలిపారు.

పుకార్లు వ్యాప్తి చేయొద్దు: సీఎం స్టాలిన్ - Tholi Paluku