Let's talk: editor@tmv.in
పీవీకే–5 గనిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన

పీవీకే–5 గనిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన

Gaddamidi Naveen
26 జనవరి, 2026

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీపంలోని 74 ఏళ్ల చరిత్ర కలిగిన పీవీకే–5 భూగర్భ గనిని కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కార్మికుల భద్రత, సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. గనుల్లో ప్రమాదాలు లేని పని వాతావరణమే లక్ష్యంగా ‘జీరో యాక్సిడెంట్ మైన్ పాలసీ’ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులకు రూ.1 కోటి బీమా కవరేజీ కల్పించడం ద్వారా వారి కుటుంబాలకు భరోసా, భద్రత కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయ‌న పేర్కొన్నారు.

సంవత్సరాలుగా ప్రాణాలను పణంగా పెట్టి దేశ అభివృద్ధికి సేవలందిస్తున్న గనికార్మికుల త్యాగాలను కృతజ్ఞతతో గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులోనూ భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయ‌న సూచించారు. సింగరేణి సంస్థను రాజకీయ జోక్యాల నుంచి దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని, ఇది పూర్తిగా కార్మికుల సంస్థ అని స్పష్టం చేశారు. సింగరేణిని కాపాడుకోవాలంటే కార్మికులు, ట్రేడ్ యూనియన్లు ఐక్యంగా నిలబడి సమిష్టి కృషితో ముందుకు సాగాలని కిష‌న్ పిలుపునిచ్చారు.

గనిలో పనిచేస్తున్న కార్మికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. సింగరేణి కుటుంబంతో సమయం గడపడం ఎప్పుడూ ప్రత్యేకమే. కార్మికుల నిబద్ధత, క్రమశిక్షణ చూసినప్పుడు నాకు కొత్త ఉత్సాహం లభిస్తోందని కిష‌న్ అన్నారు.

136 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కేవలం ఒక సంస్థ మాత్రమే కాదని, లక్షలాది కుటుంబాలకు ఆధారస్తంభమని, తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాదు దేశానికే ఇది కీలక సంస్థ అని పేర్కొన్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో దాదాపు మూడు వంతులు బొగ్గుపైనే ఆధారపడి ఉన్నాయని, అందులో ప్రతి సింగరేణి కార్మికుడి కృషి దేశ ప్రగతికి నేరుగా దోహదపడుతోందని ఆయ‌న‌ అన్నారు.

కొత్తగూడెం భూగర్భ గని సందర్శన సందర్భంగా కార్మికుల కష్టపాటు, పట్టుదల, శ్రమను ప్రత్యక్షంగా చూసి అభినందించారు. దేశాన్ని నడిపించే శక్తికి వెన్నెముకగా నిలుస్తున్న సింగరేణి కార్మికులే నిజమైన హీరోలని ఈ సందర్భంగా కొనియాడారు.