
పీయూష్ గోయల్ ఇజ్రాయెల్ పర్యటన - వాణిజ్యం, సాంకేతికత, వ్యవసాయంలో కీలక ఒప్పందాలు
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ వారం ఇజ్రాయెల్‌లో అనేక ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ పర్యటన వ్యవసాయం, సాంకేతికత, ఆవిష్కరణలు, వాణిజ్యం వంటి రంగాలలో ద్వైపాక్షిక సహకారానికి గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇచ్చిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
పీయూష్ గోయల్ఇటీవల జరిగిన అధికారిక కార్యక్రమాలలో భాగంగా, గోయల్ ఇజ్రాయెల్ వ్యవసాయం, ఆహార భద్రతా శాఖ మంత్రి అవి డిచ్టర్‌తో వ్యవసాయ భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై కూలంకషంగా చర్చించారు. ఇజ్రాయెల్ 25 ఏళ్ల దీర్ఘకాలిక ఆహార భద్రతా రోడ్‌మ్యాప్, ఆ దేశ విత్తన అభివృద్ధి పద్ధతులు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నీటి పునర్వినియోగ సాంకేతికతలను డిచ్టర్ ఆయనకు వివరించారు.
గోయల్ 'పెరెస్ సెంటర్ ఫర్ పీస్ అండ్ ఇన్నోవేషన్'ను కూడా సందర్శించారు. అక్కడ అధికారులు ఇజ్రాయెల్ యొక్క అత్యంత ఆధునిక ఆవిష్కరణలు అయిన డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలు, స్టెంట్ సాంకేతికతలు, ఐరన్ డోమ్ వాయు, రక్షణ వ్యవస్థ, అనేక వర్చువల్-రియాలిటీ పరిష్కారాలను ప్రదర్శించారు. పెరెస్ సెంటర్‌ను "సృజనాత్మకత, ఆవిష్కరణలు, సామాజిక ప్రభావం కలిగిన ఇజ్రాయెల్ ప్రయాణాన్ని ప్రతిబింబించే స్ఫూర్తిదాయక సంస్థ"గా గోయల్ అభివర్ణించారు.
సాంకేతికతపై దృష్టి సారించిన కార్యక్రమాలలో భాగంగా, మొబైలె నిర్వహించిన స్వయం-చోదక ప్రదర్శన ద్వారా మొబిలిటీలో ఇజ్రాయెల్ సాధించిన పురోగతిని మంత్రి వారిని అడిగి తెలుసుకున్నారు. స్థిరమైన వ్యవసాయం, సహకార జీవనం కమ్యూనిటీ ఆధారిత నమూనాను అర్థం చేసుకోవడానికి ఆయన కిబ్బుట్జ్ రామట్ రేచెల్‌ను కూడా సందర్శించారు.
ఒక రోజు ముందు, నవంబర్ 20న, గోయల్ ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి నిర్ బర్కత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సమీక్షించడానికి, కొత్త సహకార రంగాలను గుర్తించడానికి సమావేశమయ్యారు. ఈ ఇద్దరు నాయకులు తర్వాత ఇండియా, ఇజ్రాయెల్ బిజినెస్ ఫోరమ్‌కు హాజరయ్యారు, ఇక్కడ ఇరు దేశాల పరిశ్రమల ప్రతినిధులు సాంకేతికత, వ్యవసాయం, రక్షణ, అధునాతన తయారీ, ఆవిష్కరణలపై బి2బి చర్చలు నిర్వహించారు.
ఈ సమావేశంలో గోయల్ మాట్లాడుతూ, భారతదేశం, ఇజ్రాయెల్ మధ్య "నమ్మకంపై ఆధారపడిన పునాది" ఉందని, ఫైనాన్స్ టెక్నాలజీ (ఫిన్‌టెక్), అగ్రిటెక్, కృత్రిమ మేధస్సు క్వాంటం కంప్యూటింగ్, ఫార్మాస్యూటికల్స్, అంతరిక్షం, రక్షణ రంగాలలో అవకాశాలను హైలైట్ చేశారు.
గోయల్ ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజాలెల్ స్మోట్రిచ్‌తో కూడా పెట్టుబడి భాగస్వామ్యాలు, ఫైనాన్షియల్, టెక్నాలజీ సహకారం, నియంత్రణ సహకారంపై చర్చలు జరిపారు.
పరిశ్రమలతో తన చర్చల్లో భాగంగా, చెక్ పాయింట్ (సైబర్ సెక్యూరిటీ), ఐడిఇ టెక్నాలజీస్ (నీటి పరిష్కారాలు), ఎన్‌టిఎ (మెట్రో ప్రాజెక్టులు), నెటాఫిమ్ (ఖచ్చితమైన వ్యవసాయం) వంటి ప్రధాన ఇజ్రాయెల్ కంపెనీల సీనియర్ నాయకత్వంతో ఆయన చర్చించారు. సైబర్ సెక్యూరిటీ, అర్బన్ మొబిలిటీ, నీరు, మురుగునీటి నిర్వహణ, అధునాతన నీటిపారుదల పరిష్కారాలపై చర్చలు దృష్టి సారించాయి. ఇవి భారతదేశ అభివృద్ధి లక్ష్యాలకు ముఖ్యమైన రంగాలు.
భారతదేశం, ఇజ్రాయెల్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం నియమనిబంధనలపై సంతకం చేయడం, ఈ పర్యటనలో ముఖ్యమైన ఫలితాలలో ఒకటిగా బావించవచ్చు. సమతుల్యమైన, పరస్పరం ప్రయోజనకరమైన ఎఫ్‌టిఏ దిశగా చర్చలు సాను కూలంగా ముందుకు సాగుతాయని ఇరుపక్షాలు విశ్వాసం వ్యక్తం చేశాయి.
గోయల్ ఇజ్రాయెల్ మీడియా, వజ్రాల పరిశ్రమ సభ్యులతో కూడా ముచ్చటించారు. వజ్రాల పరిశ్రమ భారతదేశం, ఇజ్రాయెల్ వాణిజ్య సంబంధాలకు చాలా కాలంగా ఒక స్తంభంలా ఉంది. తర్వాత, ఆయన మంత్రి బర్కత్‌తో కలిసి ఇండియా, ఇజ్రాయెల్ సీఈఓల ఫోరమ్‌లో పాల్గొన్నారు, అక్కడ ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యం యొక్క బలం, భవిష్యత్తు సామర్థ్యాన్ని వారికి వివరించారు.
ఈ కీలక పర్యటనలో సమావేశాలు భారతదేశం, ఇజ్రాయెల్‌లకు వ్యూహాత్మకంగా ముఖ్యమైన రంగాలలో సహకారాన్ని మరింతగా పెంచడానికి రెండు దేశాల నిబద్ధతను ప్రదర్శించాయి.
