
పీటీపీఏ నుండి తప్పుకున్న టెన్నిస్ దిగ్గజం జోకోవిచ్
ప్రపంచ టెన్నిస్ దిగ్గజం, 24 గ్రాండ్‌స్లామ్‌ల విజేత నొవాక్ జోకోవిచ్ తాను సహ-స్థాపించిన ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్స్ అసోసియేషన్ (పీటీపీఏ)తో సంబంధాలను తెంచుకున్నట్లు ప్రకటించారు. సంస్థలో ప్రస్తుతం వున్న విలువలు, తన ఆలోచనలకు అనుగుణంగా లేదని స్పష్టం చేస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
2020 యూఎస్ ఓపెన్ సమయంలో జోకోవిచ్, కెనడాకు చెందిన వాసెక్ పోస్పిసిల్ కలిసి పీటీపీఏను స్థాపించారు. వ్యక్తిగత క్రీడ అయిన టెన్నిస్‌లో ఆటగాళ్లు స్వతంత్ర కాంట్రాక్టర్లుగా ఉన్న నేపథ్యంలో వారికి సమిష్టి స్వరం, సముచిత ప్రతినిధిత్వం కల్పించడమే ఈ సంఘం ప్రధాన లక్ష్యంగా ప్రకటించబడింది. ఆటగాళ్ల సంక్షేమం, ఆదాయ అవకాశాల పెంపు, పారదర్శక పాలన వంటి అంశాలపై పోరాటం చేయాలన్న ఉద్దేశంతో ఈ సంస్థ ముందుకు వచ్చింది.
అయితే కాలక్రమంలో సంస్థ తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలు తన ఆశయాలకు భిన్నంగా మారాయని జోకోవిచ్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పారదర్శకత లోపించడం, పాలనపై సందేహాలు, తన స్వరం, ప్రతిఛాయిని ప్రాతినిధ్యం చేసిన తీరుపై తనకు ఆందోళనలు ఉన్నాయని తెలిపారు. గత ఏడాది టెన్నిస్ పాలక సంస్థలపై పీటీపీఏ దాఖలు చేసిన సామూహిక దావాలో జోకోవిచ్ పేరు లేకపోవడం కూడా ఈ విభేదాలకు సంకేతంగా మారింది.
ఆ దావాలో మహిళల, పురుషుల టెన్నిస్ టూర్లు, అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య, క్రీడా సమగ్రత సంస్థలపై ఆటగాళ్ల హక్కులను నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు చేశారు. నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల నిర్వాహకులు బహుమతి మొత్తాలపై పరిమితులు విధిస్తూ ఆటగాళ్ల ఆదాయ అవకాశాలను తగ్గిస్తున్నారని పీటీపీఏ వాదించింది.
ఇకపై తన దృష్టి పూర్తిగా టెన్నిస్, కుటుంబం ,తన సూత్రాలకు అనుగుణంగా క్రీడకు సేవ చేయడంపైనే ఉంటుందని జోకోవిచ్ స్పష్టం చేశారు. పీటీపీఏతో తన ప్రయాణం ముగిసిందని ప్రకటిస్తూ, సంస్థతో ముందుకు సాగుతున్న ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు.
