
పీఎన్‌బీ రుణ మోసం కేసు: అనిల్ అంబానీపై సీబీఐ ఎఫ్ఐఆర్
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుమారు రూ.1,085.19 కోట్ల మేర బ్యాంకులను మోసం చేశారన్న ఆరోపణలపై అనిల్ అంబానీతో పాటు ఆయన సంస్థ అయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్), సంస్థ మాజీ డైరెక్టర్ మంజరి అశోక్ కక్కర్‌లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టింది.
అసలేమైంది? కేసు నేపథ్యం ఇదే..
రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ తన వ్యాపార అవసరాల కోసం 2013-2017 మధ్య కాలంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వందల కోట్ల రూపాయల అప్పులు తీసుకుంది. అయితే ఈ అప్పులను తిరిగి చెల్లించడంలో ఆ సంస్థ మొదటి నుంచీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, బ్యాంక్ నిబంధనలను తుంగలో తొక్కిందని ఆరోపణలు వచ్చాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బును ఏ పని కోసం అయితే వాడాలో దానికి కాకుండా, ఇతర అవసరాలకు వాడటంతో పాటు వడ్డీ బకాయిలు కూడా చెల్లించలేదు. దీనివల్ల 2017లో బ్యాంకులు ఆ అకౌంట్లను 'నిరర్ధక ఆస్తులు' (NPA)గా ప్రకటించాయి. వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకున్న ఈ రుణాలను రిలయన్స్ గ్రూప్‌లోని ఇతర అనుబంధ కంపెనీలకు అక్రమంగా మళ్లించారనేది ఈ కేసులో ప్రధానమైన అంశం.
ఫోరెన్సిక్ ఆడిట్‌లో విస్తుపోయే నిజాలు
బ్యాంకును మోసం చేశారనే అనుమానంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) యాజమాన్యం 'బిడిఓ ఇండియా' అనే సంస్థతో కంపెనీ లెక్కలను క్షుణ్ణంగా తనిఖీ (ఫోరెన్సిక్ ఆడిట్) చేయించింది. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన దగ్గరున్న నిధులను తప్పుడు లావాదేవీల ద్వారా తమకే చెందిన ఇతర అనుబంధ సంస్థలకు మళ్లించినట్లు ఆధారాలు దొరికాయి. అంతేకాకుండా, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను దేనికి వాడారనే విషయంలో కంపెనీ చూపించిన లెక్కలు, అసలు జరిగిన ఖర్చులకు అస్సలు పొంతన లేదని, రికార్డులను తారుమారు చేశారని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ ఆడిట్ రిపోర్ట్ ఆధారంగానే, 2021 ఫిబ్రవరిలో ఆ కంపెనీ అకౌంట్‌ను పీఎన్‌బీ ఒక 'మోసపూరిత ఖాతా' (ఫ్రాడ్)గా ప్రకటించింది.
కుట్రపూరితంగా నష్టం చేకూర్చారు..
ముంబైలోని పీఎన్‌బీ ‘స్ట్రెస్డ్ అసెట్స్ మేనేజ్‌మెంట్’ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ సంతోష్ కృష్ణ అన్నవరపు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. నిందితులు ఉద్దేశపూర్వకంగానే బ్యాంకులను మోసం చేసేందుకు కుట్ర పన్నారు. ఈ చర్య వల్ల పీఎన్‌బీకి రూ. 621.39 కోట్లు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 463.80 కోట్ల మేర నష్టం వాటిల్లింది. సిబిఐ అధికారులు మార్చి 5న ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఐపీసీ సెక్షన్ 120బి (నేరపూరిత కుట్ర), 420 (మోసం) మరియు అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో అనిల్ అంబానీతో పాటు మరికొందరు ప్రభుత్వ అధికారులు, గుర్తుతెలియని వ్యక్తుల పాత్రపై కూడా నిఘా పెంచారు.
