Let's talk: editor@tmv.in
పీఎం కిసాన్ 22వ విడత నిధులు విడుదల

పీఎం కిసాన్ 22వ విడత నిధులు విడుదల

Dantu Vijaya Lakshmi Prasanna
14 మార్చి, 2026

ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంలోని గౌహతిలో జరిగిన ఒక కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న 9.3 కోట్లకు పైగా రైతులకు 'పిఎం-కిసాన్' పథకం కింద 22వ విడత నిధులను విడుదల చేశారు. దీని ద్వారా ప్రతి అర్హత కలిగిన రైతు ఖాతాలోకి రూ.2,000 నేరుగా జమ అయ్యాయి. ఈ ఒక్క విడతలోనే మొత్తం రూ.18,640 కోట్లను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా బదిలీ చేయడం విశేషం.

ఈ నిధుల విడుదలతో, 2019లో పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు రైతులకు అందించిన మొత్తం ఆర్థిక సాయం రూ.4.27 లక్షల కోట్లకు చేరిందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏటా రూ.6,000 చొప్పున మూడు విడతల్లో అందజేస్తున్నారు. లబ్ధిదారుల్లో 2.15 కోట్ల మంది మహిళా రైతులు ఉండటం గమనార్హం

అస్సాం అభివృద్ధి ప్రాజెక్టులు:

రైతులకు నిధుల విడుదలతో పాటు, ఎన్నికల ముంగిట ఉన్న అస్సాంలో ప్రధాని మోదీ రూ.19,480 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో రోడ్లు, రైల్వే లైన్ల విద్యుదీకరణ, ఇంధన రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, అస్సాం నేడు ఈశాన్య రాష్ట్రాలకు ఒక మోడల్‌గా (అష్టలక్ష్మి) మారుతోందని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి మొత్తం ఈశాన్య భారతావనికి కొత్త వేగాన్ని ఇస్తుందని కొనియాడారు.

కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు

అభివృద్ధి కార్యక్రమాల అనంతరం జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. దేశాభివృద్ధి పట్ల కాంగ్రెస్‌కు ఏనాడూ నిబద్ధత లేదని, దేశం యుద్ధాల వంటి సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు, అబద్ధాలు వ్యాప్తి చేయడానికే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. నెహ్రూ హయాంలో ఇతర దేశాల యుద్ధాల వల్ల మన దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిందని చెప్పిన మాటలను గుర్తుచేస్తూ, కాంగ్రెస్‌కు దేశం పట్ల నిబద్ధత లేదని విమర్శించారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం రైతులను 'అన్నదాత'గా గుర్తించి, వారిని ఆత్మనిర్భర్ (స్వయం సమృద్ధి) దిశగా నడిపిస్తోందని పేర్కొన్నారు.

ఆధునిక వ్యవసాయానికి పెద్దపీట

రైతుల సాగు ఖర్చు తగ్గించేందుకు తమ ప్రభుత్వం 'పర్ డ్రాప్, మోర్ క్రాప్' వంటి పథకాల ద్వారా మైక్రో ఇరిగేషన్ సాంకేతికతను ప్రోత్సహిస్తోందని ప్రధాని తెలిపారు. రైతులు ఎవరిపైనా ఆధారపడకుండా, ఆధునిక యంత్రాలు, విత్తనాలతో మేలైన దిగుబడి సాధించేలా డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచినట్లు ఆయన వివరించారు.

వ్యవసాయ రంగాన్ని బాహ్య సంక్షోభాల నుండి రక్షించడానికి 'స్వయం సమృద్ధి' ఒక్కటే మార్గమని మోదీ నొక్కి చెప్పారు. దీనికోసం ప్రభుత్వం 'పర్ డ్రాప్, మోర్ క్రాప్' విధానాన్ని అమలు చేస్తోందని, డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్యం పద్ధతులను రైతులకు అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. దీని ద్వారా సాగు ఖర్చు తగ్గి, దిగుబడి పెరుగుతుందని ఆయన వివరించారు.

రైల్వే, ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధి

గత దశాబ్ద కాలంలో భారత రైల్వే నెట్‌వర్క్ మొత్తాన్ని విద్యుదీకరించడం ద్వారా విదేశీ చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించామని ప్రధాని పేర్కొన్నారు. దీనివల్ల ఏటా సుమారు 1.7 కోట్ల లీటర్ల డీజిల్ ఆదా అవుతోందని చెప్పారు. రైల్వేలను ఆధునీకరించడం, స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని ప్రధాని మోడీ వెల్లడించారు.