Let's talk: editor@tmv.in
పీఎం ఏక్తా మాల్ నిర్మాణంలో భారీ కుంభకోణం: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

పీఎం ఏక్తా మాల్ నిర్మాణంలో భారీ కుంభకోణం: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

Gaddamidi Naveen
13 ఆగస్టు, 2026

రాయదుర్గంలోని మల్కం చెరువు ఎదురుగా ప్రతిపాదించిన పీఎం ఏక్తా యూనిటీ మాల్ నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రూ.1,700 కోట్ల విలువైన సుమారు ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ బిల్డర్లకు అతి తక్కువ ధరకే కట్టబెట్టారని విమర్శించారు. స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్ సహా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో మాల్ వద్ద పార్టీ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించాయి. అనంతరం మీడియా సమావేశంలో దాసోజు శ్రవణ్ మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం పీఎం ఏక్తా యూనిటీ మాల్స్ కోసం తెలంగాణకు రూ.200 కోట్ల వడ్డీలేని రుణాన్ని కేటాయించిందని శ్రవణ్ తెలిపారు. ప్రతిపాదిత మాల్ 27 అంతస్తుల్లో, 27 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రభుత్వ వాటా సుమారు 9 లక్షల చదరపు అడుగులు కాగా, వంశీరామ్, అపర్ణ బిల్డర్స్‌కు 18 లక్షల చదరపు అడుగుల వాటా కల్పిస్తున్నారని ఆరోపించారు.

మాల్ నిర్మాణానికి సంబంధించిన టెండర్ డాక్యుమెంట్లు, ఒప్పందాలు ప్రజలకు అందుబాటులో లేవని ఆయన అన్నారు. టెండర్లు లేకుండా, పారదర్శకత పాటించకుండా విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబానికి చెందిన వారికి కూడా విలువైన భూములు, అవకాశాలు కల్పిస్తున్నారని ఆరోపించారు.

మాల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన దాసోజు శ్రవణ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సహా బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్ శ్రేణులు అక్కడ ధర్నాకు దిగాయి. పీఎం ప్రాజెక్టులో అవినీతి జరుగుతున్నా బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని శ్రవణ్ ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్‌బాబుకు సవాల్ విసురుతూ.. ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరిస్తే టెండర్లను రద్దు చేసి, సంబంధిత పత్రాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అమరవీరుల సాక్షిగా ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.

పీఎం ఏక్తా మాల్ నిర్మాణంలో భారీ కుంభకోణం: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ - Tholi Paluku