Let's talk: editor@tmv.in
పీఎం ఈ-బస్ పథకానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయండి : సీఎస్ సాయి ప్రసాద్

పీఎం ఈ-బస్ పథకానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయండి : సీఎస్ సాయి ప్రసాద్

Panthagani Anusha
27 మార్చి, 2026

రాష్ట్రంలో ప్రజా రవాణా ముఖచిత్రాన్ని మార్చేందుకు ప్రభుత్వం భారీ కసరత్తును ప్రారంభించింది. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఈ-బస్ సేవా పథకాన్ని రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఏపీ సచివాలయంలో నిర్వహించిన మూడో రాష్ట్ర స్థాయి శాంక్షనింగ్ కమిటీ సమావేశంలో ఆయన ఈ పథకం అమలు తీరుపై సమీక్ష నిర్వహించి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.

ఈ సమావేశంలో సాయిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తూ 15 సంవత్సరాల కాలపరిమితి ముగిసిన పాత బస్సులను దశలవారీగా తొలగించాలని సీఎస్ సూచించారు. వాటి స్థానంలో అత్యాధునిక విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడం ద్వారా ఇంధన పొదుపుతో పాటు కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ మార్పు కేవలం వాహనాల మార్పిడికే పరిమితం కాకుండా మెరుగైన ప్రయాణ అనుభవాన్ని ప్రజలకు అందించాలని ఇందుకోసం సాంకేతిక సిబ్బందికి డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

తొలి దశలో రాష్ట్రంలోని 11 ప్రధాన నగరాల్లో సుమారు 750 ఈ-బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జాబితాలో విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, రాజమహేంద్రవరం, కడప, తిరుపతి, అనంతపురం నగరాలు ఉన్నాయి. ఇప్పటికే తిరుపతిలో 100 విద్యుత్ బస్సులు విజయవంతంగా నడుస్తున్న నేపథ్యంలో మిగిలిన టియర్-2, టియర్-3 నగరాల్లో కూడా వీటిని త్వరితగతిన ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

మౌలిక సదుపాయాలకు రూ.129 కోట్లు

మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 12 కీలక ప్రాంతాల్లో ఈ-బస్సుల ఛార్జింగ్ కేంద్రాలు డిపోల ఆధునీకరణ కోసం రూ.129.51 కోట్ల వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులను సమకూరుస్తుండగా మిగిలిన 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. 2027 చివరి నాటికి దేశవ్యాప్తంగా 10 వేల ఎయిర్ కండిషన్డ్ ఈ-బస్సులను ప్రవేశపెట్టాలన్న కేంద్ర లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన నిలవాలని సీఎస్ ఆకాంక్షించారు.

ఈ సమావేశంలో రవాణా రహదారుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు పురోగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ బాల సుబ్రహ్మణ్యం, ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్ రోజ్, పరిశ్రమల శాఖ అదనపు సంచాలకులు రామలింగేశ్వర రాజు ఇతర ఉన్నతాధికారులు పాల్గొని తమ సూచనలను అందజేశారు.