
పీఎం-శ్రీ పథకం కింద ఏపీలో 935 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి: సీఎస్ విజయానంద్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల స్థాయి పెంచే దిశగా కీలక ముందడుగు పడింది. పీఎం-శ్రీ పథకం కింద రాష్ట్రంలో 935 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి వాటిని అన్ని విధాలా మెరుగైన రీతిలో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఈ పనులు సాగుతున్నాయన్నారు.
బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన జాతీయ ప్రాజెక్టుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్‌లో విజయానంద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పీఎం-శ్రీ పథకం అమలుపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ఎంపికైన పాఠశాలలను అన్ని అంశాల్లో మెరుగుపరుస్తూ విద్యార్థులకు మెరుగైన అభ్యాస ఫలితాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఈ పాఠశాలల్లో శాశ్వత భవనాలు, నిరంతర విద్యుత్ సరఫరా, అబ్బాయిలకు, అమ్మాయిలకు వేర్వేరు మరుగుదొడ్లు, సురక్షిత తాగునీరు, చేతులు కడుక్కునే సదుపాయాలు, గ్రంథాలయాలు, క్రీడా సామగ్రి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. మౌలిక వసతులన్నింటినీ ఒకే స్థాయిలో మెరుగుపరచడమే లక్ష్యమన్నారు.
అదేవిధంగా, ఈ పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం, కంప్యూటర్ ల్యాబ్‌లు, ఆట స్థలాలు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా చెప్పారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు గుర్తింపు కార్డులు జారీ చేయడంతో పాటు, చైల్డ్ ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా హాజరును పర్యవేక్షించే విధానం అమలు చేస్తున్నామని వివరించారు. దీనివల్ల విద్యా నాణ్యతతో పాటు విద్యార్థుల భద్రత కూడా మెరుగవుతుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా మోడల్ సంస్థలుగా మార్చడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.. ఈ పథకం కింద ఆధునిక మౌలిక వసతులు, డిజిటల్ విద్య, పర్యావరణహిత చర్యలు, సమగ్ర అభ్యాస విధానం అమలు చేస్తూ జాతీయ విద్యా విధానం-2020కి అనుగుణంగా విద్య అందిస్తున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. వివిధ కేంద్ర పథకాల అమలు పురోగతిని సమీక్షించి, ఎదురవుతున్న సవాళ్లపై చర్చించి, కేంద్రం-రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.
