
పి4 పథకానికి ఊతం..యాజిలి గ్రామానికి రూ.1 కోటి విరాళం
ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన ‘పి4 మార్గదర్శి - బంగారు కుటుంబం’ కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బాపట్ల నియోజకవర్గం కార్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన గుండ్రెడ్డి సత్యనారాయణ రూ.1 కోటి విరాళం అందించడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.
సూరేపల్లి లో నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసిన గుండ్రెడ్డి సత్యనారాయణ తన స్వగ్రామం యాజిలిలో రహదారి నిర్మాణం చేపట్టాలని కోరుతూ రూ.1 కోటి చెక్కును అందజేశారు. ఈ విరాళాన్ని గ్రామ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ దాతను ప్రత్యేకంగా అభినందించారు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావనతో చేసిన ఈ సేవ ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఇలాంటి సహాయాలు ఇతరులకు ప్రేరణగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
గత ఏడాది అమరావతిలో ప్రారంభమైన ‘పి4 మార్గదర్శి - బంగారు కుటుంబం’ పథకం ద్వారా సమాజంలోని అగ్ర 10 శాతం మంది దిగువ 20 శాతం పేద కుటుంబాలకు మార్గదర్శకత్వం అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉపాధి, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో సహకారం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.
ఇప్పటివరకు ఈ పథకం కింద భారీ నగదు విరాళాలు ఎక్కువగా వెలుగులోకి రాకపోయినా యాజిలి గ్రామానికి అందిన ఈ రూ.1 కోటి విరాళం తొలి ప్రధాన సహాయాలలో ఒకటిగా భావిస్తున్నారు. మరోవైపు సంపన్నులు ముందుకు వచ్చి పేదలకు అండగా నిలవాలని ప్రభుత్వం పిలుపునిస్తోంది.
ఇక ఇలాంటి విరాళాలు పెరిగితే గ్రామీణాభివృద్ధి వేగవంతం కావడంతో పాటు సామాజిక బాధ్యతాభావం మరింత బలపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.యాజిలి గ్రామానికి అందిన ఈ విరాళం పి4 పథకంతో ప్రజల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
