
పిస్టల్‌తో కాల్చుకుని హైడ్రా కమిషనర్ గన్ మెన్ ఆత్మహత్యాయత్నం
రక్షణ కవచంలా ఉండాల్సిన ఆయుధమే ఆ యువ కానిస్టేబుల్ ప్రాణ సంకటంగా మారింది. ఆన్‌లైన్ బెట్టింగ్ మాయాజాలంలో చిక్కుకుని, అప్పుల బాధ తాళలేక ఓ గన్‌మెన్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించడం నగరంలో సంచలనం సృష్టించింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ ముత్యాలపాటి కృష్ణ చైతన్య (2020 బ్యాచ్) ఆదివారం ఉదయం తన నివాసంలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
పోలీసుల కథనం ప్రకారం.. హయత్‌నగర్ మండలం మునగనూరులో నివాసముంటున్న కృష్ణ చైతన్య గత రెండేళ్లుగా ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లకు బానిసయ్యారు. ఈ క్రమంలో భారీగా డబ్బు నష్టపోవడంతో పాటు పెద్ద ఎత్తున అప్పులు చేశారు. అప్పుల భారం పెరగడం ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన, ఆదివారం ఉదయం తన సర్వీస్ పిస్టల్‌తో తలపై కాల్చుకొని ఆత్మహత్య యత్న చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే రక్తపు మడుగులో పడి ఉన్న ఆయనను గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలిసిన వెంటనే హైడ్రా సీపీ ఏవీ రంగనాథ్ ఆసుపత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. చైతన్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వైద్యులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు కానీ, ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆయన మీడియాకు వివరిస్తూ ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వల్ల వచ్చిన ఆర్థిక ఇబ్బందులే ఈ దారుణానికి దారితీశాయని తెలుస్తోంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు హయత్‌నగర్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి సర్వీస్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది. కేసు నమోదు చేసిన పోలీసులు, అప్పుల వ్యవహారంతో పాటు మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యతాయుతమైన విధుల్లో ఉండి, చురుకైన కానిస్టేబుల్‌గా గుర్తింపు పొందిన చైతన్య ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తోటి ఉద్యోగులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
