
పిల్లల హక్కులను నిరాకరించలేం: కేరళ మంత్రి
కేరళలో పాఠశాలల్లో హిజాబ్ ధరించే విద్యార్థినులపై నెలకొన్న వివాదంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వి. శివంకుట్టి స్పందించారు. పిల్లల రాజ్యాంగబద్ధ హక్కులను ఎవరూ నిరాకరించలేరు. ఈ వివాదాన్ని పాఠశాల స్థాయిలో సామరస్యంగా పరిష్కరించాలని ఆయన అన్నారు. స్కూల్ మేనేజ్‌మెంట్ తప్పు చేసింది. అందువల్ల ప్రభుత్వం కొన్ని సూచనలు జారీ చేసింది. హిజాబ్ కూడా యూనిఫార్మ్‌కు సరిపడేలా రూపొందించాలి. సూచనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. అలాగే కొంతమంది ఈ విషయాన్ని మత విభేదాలుగా మలిచే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగం, కోర్టు తీర్పుల ప్రకారం ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. పాఠశాల స్థాయిలో ఏకాభిప్రాయం ఏర్పడితే అది స్వాగతించదగిన పరిణామం అని తెలిపారు.
ఎర్నాకులం జిల్లాలోని సెంట్ రిటా పాఠశాలలో ఒక విద్యార్థినిని యూనిఫాం కారణంగా తరగతిలోకి అనుమతించలేదన్న ఘటనపై మంత్రి పై విధంగా స్పందించారు. ఆ పాఠశాల చర్య రాజ్యాంగ విరుద్ధమని డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చిన నివేదికలో తేలిందని తెలిపారు. ఇక వివాదం నేపథ్యంలో రెండు రోజుల పాటు కాథలిక్ పాఠశాలను మూసివేయాలని మంత్రి సూచనలు జారీ చేశారు.
అయితే హిజాబ్ విషయమై గతంలోనూ వివాదాలు నెలకొన్నాయి. అయితే రాజ్యంగం ఏం చెబుతుంది. గతంలో వివాదాలు వచ్చినప్పుడు న్యాయస్థానాలు ఎటువంటి తీర్పులు ఇచ్చాయి. అనేది చూద్దాం
భారత రాజ్యాంగంలోని హక్కులు
ఆర్టికల్ 25: మత స్వేచ్ఛ హక్కు
ఆర్టికల్ 19(1)(ఏ): వ్యక్తిగత అభిప్రాయం, వ్యక్తీకరణ హక్కు
ఆర్టికల్ 21A: విద్యా హక్కు
ఈ మూడు అధికరణల ప్రకారం విద్యార్థి తన మత విశ్వాసాన్ని పాటిస్తూ, విద్యను కొనసాగించే హక్కు కలిగి ఉంటాడు.
అయితే ఈ హక్కు పరిమితులలో ఉంటుంది. అంటే పాఠశాల యూనిఫాం నియమాలు సెక్యులర్ వాతావరణానికి భంగం కలిగించకుండా ఉండాలి.
కర్ణాటక హైకోర్టు తీర్పు (2022)
2022లో కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లా పాఠశాలల్లో హిజాబ్ వివాదం చెలరేగింది.
దానిపై కర్ణాటక హైకోర్టు ఇలా తీర్పు ఇచ్చింది
హిజాబ్ అనేది ఇస్లాం మతంలో తప్పనిసరి ఆచారం కాదని, అందువల్ల ప్రభుత్వానికి, పాఠశాలలకు యూనిఫార్మ్ నియమం విధించే హక్కు ఉందని పేర్కోంది.
ఆ తర్వాత విద్యార్థులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు.
సుప్రీంకోర్టు (2022 అక్టోబర్)లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసింది.
ఒక న్యాయమూర్తి విద్యార్థుల హక్కుకు మద్దతు ఇచ్చారు, మరొకరు రాష్ట్రం అనుసరిస్తున్న విధానానికి మద్దతు ఇచ్చారు.
దాంతో కేసు ముగ్గురు సభ్యుల బెంచ్‌కు మార్చారు. ఇంకా తుది తీర్పు వెలువడలేదు.
కేరళలోని పరిస్థితి
కేరళలో విద్యా వ్యవస్థ సెక్యులర్ పద్ధతిలో ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మతాచారాలు పాటించే విద్యార్థుల హక్కులను కాపాడాలి, కానీ యూనిఫార్మ్ ఏకరూపతను కూడా నిలబెట్టాలి అనే విధానాన్ని అనుసరిస్తుంది.
2018లో మలప్పురం జిల్లాలో హిజాబ్ వివాదం నెలకొంది. అప్పట్లో కేరళ హైకోర్టు ఇలా పేర్కొంది.
‘యూనిఫార్మ్ నియమాలు పాఠశాల స్థాయిలో నిర్ణయించవచ్చు. కానీ విద్యార్థి హక్కులను పూర్తిగా నిరాకరించకూడదు’.
