Let's talk: editor@tmv.in
పిల్లల భవిష్యత్తే లక్ష్యంగా విద్యా సామగ్రి పంపిణీ: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

పిల్లల భవిష్యత్తే లక్ష్యంగా విద్యా సామగ్రి పంపిణీ: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

Panthagani Anusha
3 జనవరి, 2026

జిల్లాలోని నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధి, వారి ఆరోగ్యంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని, పిల్లల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనకు అందిన విద్యా సామగ్రిని, ఆహార పదార్థాలను ఆయన విద్యార్థులకు అందజేశారు. తన విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

సాధారణంగా నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా అధికారులు, ప్రముఖులు పూలమాలలు, బొకేలతో శుభాకాంక్షలు తెలుపుతుంటారు. అయితే ఈసారి కలెక్టర్‌కు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున విద్యా సామగ్రిని కానుకలుగా అందజేశారు. వీటిని వృధా చేయకుండా అవసరమున్న విద్యార్థులకు చేరవేయాలన్న సంకల్పంతో కలెక్టర్ ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా జనవరి 1వ తేదీన నెల్లూరు నగరంలోని ఆర్.కె. నగర్‌లో గల జనహిత - వాత్సల్య అనాధాశ్రమంలో చదువుతున్న విద్యార్థులకు, అదేవిదంగా కావలిలో ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్ విద్యార్థినులకు విద్యా సామగ్రిని, పండ్లు, స్వీట్లను పంపిణీ చేశారు.

ఈ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మొత్తం 834 లాంగ్ నోట్ పుస్తకాలు, 368 షార్ట్ నోట్ పుస్తకాలు, 138 పరీక్ష ప్యాడ్లు, 795 పెన్నులతో పాటు పెద్ద సంఖ్యలో పెన్సిళ్లు, కలర్ క్రేయాన్లను అందజేశారు. విద్యార్థుల జ్ఞాన సముపార్జనకు తోడ్పడేలా 262 నిఘంటువులు (డిక్షనరీలు), అట్లాస్‌లు, ఇంగ్లీష్ వ్యాకరణ పుస్తకాలతో పాటు వాల్మీకి రామాయణం వంటి ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా కలెక్టర్ పంపిణీ చేశారు.

విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన లేఖన సామగ్రిని అందించడం ద్వారా వారి విద్యా ప్రగతికి ఊతం ఇవ్వడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ హిమాన్షు శుక్లా వివరించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఇటువంటి సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.